కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది.. తాజాగా, కామినేని శ్రీనివాస్ ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణం అయ్యాయి.. అయితే, అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం.. పార్టీ సీనియర్ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట.. బోండా ఉమా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు.. అసలు సభ ఎలా జరుగుతోంది.. అనే అంశంపై దృష్టి పెట్టాలి కదా? అని చీఫ్ విప్‌తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆడిగినట్టు సమాచారం.. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌కు సంబంధించి సీఎం సీరియస్‌గా రియాక్ట్ అయ్యారట.. కొంతమంది అధికారుల బదిలీల విషయాల్లో సభలో ప్రస్తావనపై కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం..
విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం పట్టుకుంది. గడచిన రెండు నెలల్లో ఐదవసారి వరద తాకిడికి గురవుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శభరి, గోదావరి నదులకు వరద ప్రవాహం ఉధృతమైంది.. కూనవరం వద్ద 42 పాయింట్ 0,2 అడుగులతో రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది.. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్ వే పైకి చేరింది వరద నీరు చేరింది. వీఆర్ పురం మండలంలో చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం అడవి వెంకన్న గూడెంలో రహదారులపైకి వరద నీరు చేరింది.. చింతూరు మండలం చూటూరు – ముకునూరు మధ్య రోడ్డుపైకి చేరిన వరద నీరు చేరడంతో.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఎటపాక మండలంలో నెల్లిపాక వీరాయిగూడెం రహదారిపైకి వరద నీరు చేరింది. వరద నీటిలోనే గిరిజనుల ప్రయాణాలు కొనసాగుతున్నాయి.. నాలుగు మండలాల వ్యాప్తంగా పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఎటపాక మండలంలో పలు చోట్ల మిర్చిపంట నీట మునిగింది. మరోవైపు, ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరిలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది..
తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఆరా!
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పోటెత్తాయి. దీంతో జంట జలాశయాలకు భారీగా వరద పెరగడంతో ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో మూసీ నదికి వరదనీటి ప్రవాహం పెరగటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు నుంచి రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇక, ఎంజీబీఎస్‌కి వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని, బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత రెండు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురవడంతో వరదల పట్ల పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ నది ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టి, వాహనాలు, ప్రజలు ఆ ప్రాంతాల ద్వారా వెళ్ళకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్.. చిక్కుకుపోయిన ప్రయాణికులు..
హైదరాబాద్ మహానగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండు లోపల వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎంజీబీఎస్ నుంచి బయటికి రావడానికి వీలు లేక పోవడంతో లోపలే చిక్కుకుపోయారు. ఇక, ప్రమాదకరంగా ప్రవాహిస్తున్న నీటిలోనే కొందరు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటకు తీసుకు వస్తున్నారు. MGBS బస్టాండ్ నీట మునగడంపై Ntv effectతో హైడ్రాతో పాటు పోలీసులు స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. గండిపేట గేట్లు ముందస్తు హెచ్చరిక లేకుండా ఎత్తేయడంతో నీటి ఉధృతి పెరిగి అల్లకల్లోలం ఏర్పడిందని హైడ్రా సిబ్బంది తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వికారాబాద్కి రాకపోకలు బంద్
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సదాశివపేట్ మండలం నాగ్సన్‌పల్లి- నందికంది పెద్ద వాగు పొంగి పొర్లడంతో NH-65 హైవే అర్ధరాత్రి చెరువులా మారిపోయింది. శిల్పా వెంచర్ నుంచి వచ్చిన వరద నీటితో హైవే ముంపుకు గురై, రాత్రి పొడవునా ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరద తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నప్పటికీ, రోడ్డుపక్కన ఉన్న పెట్రోల్ బంక్‌లు, హోటళ్లు, దాబాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ఇక, కొండాపూర్ మండలంలో భారీగా వాన కురవడంతో అర్ధరాత్రి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా చెరువులు నిండుకుండలుగా మారి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సైదాపూర్ గ్రామ శివారులో వాగు ఉధృతితో రహదారి కొట్టుకుపోవడంతో, సంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్‌లోని మొమిన్‌పేట్, తాండూర్ వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. భారతదేశం ఎలాంటి బెదిరింపులకు భయపడదని.. ఎప్పుడూ తలొగ్గదని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం సందేశం స్పష్టంగా ఉందని.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరింది. ఇక భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. భారతదేశంతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ప్రసంగాలు చేయడం కాదు.. మాటల్లో నిజంగా నిజాయితీ ఉంటే ఆచరణలో చూపించాలని హితవు పలికారు. అలాగైతే వెంటనే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలను తక్షణమే మూసివేతకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భారతదేశం అడుగుతున్న ఉగ్రవాదులను తక్షణమే అప్పగించాలని కోరారు. ద్వేషం, మతతత్వం, అసహనాన్ని అనుసరించే దేశం.. యూఎన్ సభలో విశ్వాస విషయాలపై బోధించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అద్దం వైపు చూడడం చాలా కాలం అయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నడిపేది.. బైక్ టాక్సీ .. సంపాదించేది నెలకు లక్ష
ముజఫర్ నగర్ కు చెందిన సుమిత్ ప్రజాపతి (22) తన తండ్రి రిక్షాను సోషల్ మీడియాకు వేదికగా మార్చాడు. చిన్న చిన్న ఉద్యోగాలు, కుటుంబ కష్టాల నుండి వైరల్ వీడియోలను పోస్ట్ చేయడం.. ఏ పనీ చిన్నది కాదని నిరూపించడం ద్వారా అతను ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. చిన్నతనంలో, సుమిత్ తన చదువును కొనసాగించడానికి పొలాల్లో పనిచేసేవాడు, కార్లు తుడిచే వాడు. వాహనాలు మరమ్మతులు చేసేవాడు, కూరగాయలు అమ్మేవాడు. బట్టల షాప్ లో పనిచేసేవాడు. 7వ తరగతి నాటికి తనని చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో తానే కష్టపడుతూ డిగ్రీ పూర్తి చేశాడు. కాలక్రమేణా, సోషల్ మీడియాపై అతని ఆసక్తి పెరిగింది. అతను కంటెంట్ ఉన్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. అతని నైపుణ్యాలు స్థానిక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించడానికి అతనికి సహాయపడ్డాయి.. సుమిత్ వారానికి రెండు రోజులు రెండు గంటలు పనిచేసి దాదాపు రూ.25,000 సంపాదిస్తున్నాడు. అతనికి రోజుకు నాలుగు నుండి ఐదు ప్రమోషన్ అభ్యర్థనలు వస్తాయి. గత నెలలోనే, అతను బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా రూ.1.5 లక్షల వరకు సంపాదించాడు.
ఆ స్టార్ హీరోకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే
మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్‌కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్ సాధించారు లాలట్టన్. ఆగస్టు 28న రిలీజైన హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేయడమే కాదు హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ సాధించిన తొలి మాలీవుడ్ హీరోగా మారారు. ఒక్క ఏడాదిలోనే ఈ ఫీట్ సాధించగా రూ. 600 కోట్ల మార్కెట్ క్రియేట్ చేసిన నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్, ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నారు మోహన్ లాల్. మలైకొట్టై వాలిబన్, స్వీయ దర్శకత్వం వహించిన బర్రోజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయ్యాయి. బర్రోజ్ ఒక్కటే వంద కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. రూ. 150 కోట్ల పెట్టి బొమ్మ తీస్తే రూ. 20 కోట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ రెండు ప్లాపులతో కాస్తంత తడబడినా , ఈ ఏడాది వరుస హిట్స్ కొట్టేసి లాస్ట్ ఇయర్ లెక్కలన్నీ సరి చేశారు. హ్యాట్రిక్ హిట్స్ ఎంజాయ్ చేస్తున్న లాలెట్టన్‌కు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాదా సాహెబ్ అవార్డును ప్రకటించి సత్కరించింది. ఇదే ఆనందంలో దృశ్యం3ని కూడా స్టార్ట్ చేసేసిన మోహన్ లాల్.. నెక్ట్స్ వృషభ మూవీని లోడ్ చేస్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తే కంప్లీట్ స్టార్‌కు 2025 కంప్లిట్ హిట్ ఇయర్ గా మిగులుతుంది.
శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..!
తమిళ సినిమా ఇండస్ట్రీలో మాస్ అండ్ కంటెంట్ కలిపి చూపించగల దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెట్రిమారన్. ఆడుకలాం, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలతో ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీను మూసివేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ దాంతో తన క్రియేటివ్ జర్నీ ఆగిపోలేదు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టిని తన కొత్త ప్రాజెక్ట్ #STR 49 మీద పెట్టారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది శింబు (సిలంబరసన్). ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను షూట్ చేయగా, అది అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. శింబు స్టైల్, వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్ ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే పెద్ద ఎక్సైట్మెంట్ ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వెట్రిమారన్ ఎక్కువగా జి.వి. ప్రకాష్ కుమార్తోనే పనిచేశారు. ఆడుకలాం నుంచి వడా చెన్నై వరకు ఈ కాంబినేషన్ సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. కానీ ఈసారి కొత్త ఫ్రెష్‌నెస్ కోసం, అలాగే శింబు ఎనర్జీకి తగిన బీట్ కోసం అనిరుధ్‌ను ఎంపిక చేశారని టాక్. మొత్తానికి, వెట్రిమారన్ రియలిస్టిక్ టచ్, శింబు మాస్ పర్ఫార్మెన్స్, అనిరుధ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. STR49 ఏ స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి.