మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, కాస్త తెరపి ఇచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, 4 రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడుతుందని.. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉండగా.. రేపు అనగా ఈ నెల 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఇక, 22వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది వాతావరణ శాఖ..
ఆ విషయంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..! ఇప్పటికైనా మారాలని దిశా నిర్దేశం..
ఏపీ సీఎం చంద్రబాబు అటు మంత్రులకు ఇటు నేతలకు వైసీపీ ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్తున్నారు.. కేబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి మంత్రులకు రకరకాల సూచనలు ఇస్తున్నారు… వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని అదే విధంగా వైసీపీపై ధీటుగా స్పందించట్లేదని… ఇలా చేయకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. దీంతోపాటు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నారు.. పార్టీ నేతలు కూడా సరిగా స్పందించట్లేదని అభిప్రాయంలో సీఎం చంద్రబాబు ఉన్నారు.. వైసీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహంపై దాడులు చేసినా వాళ్లని కాపాడుకునే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందని… నకిలీ మద్యం వ్యవహారంలో కూడా వైసీపీ అప్పర్ హాండ్ లో ఉందనే అభిప్రాయం సీఎం నేతల దగ్గర చెప్పారట. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా వైసీపీ చేస్తున్న విమర్శలకు సరిగా నేతలు స్పందించట్లేదని టీడీపీ నేతలుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు… పార్టీ నేతలు తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని.. వైసీపీ చేసే విమర్శలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని… నేతలకు సూచించారు. చంద్రబాబు.. వైసీపీ చేసే విమర్శలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని సీఎం చంద్రబాబు తన మనసులో మాటను పార్టీ నేతల దగ్గర బయటపెట్టారు..
పల్నాడులో దారుణ హత్య..
పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో దారుణహత్య కలకలం సృష్టించింది. స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ ను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. నర్సరావుపేట నుంచి రావిపాడు వెళ్లే రోడ్డులో స్వర్గపురి-2లో ఎఫ్రాన్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఎఫ్రాన్ పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. మెడ, గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎఫ్రాన్ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న ఎఫ్రాన్ గత ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా పనిచేశారు. ఇది మనసులో పెట్టుకుని అదే వార్డుకు చెందిన ఖాదర్, అతని సోదరులు, అనుచరులు ఎఫ్రాన్ ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఎఫ్రాన్ హత్యకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం ఉందంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
200 ఏళ్లుగా ఆ గ్రామంలో దీపావళిపై బ్యాన్..
శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంటే.. పండుగకు దూరంగా మరో ఊరు ఉంది.. అదే రణస్థలం మండలంలోని పున్నానపాలెం. దీపావళి వేడులకు ఆ గ్రామం 200 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. గతంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో ఆ ఊరిలో దీపావళి రోజు చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. పూర్వకాలంలో పాము ఓ ఇంట్లోకి వచ్చి ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిని కాటేసిందట. ఆ చిన్నారి చనిపోయింది. అదే రోజు ఊరులో ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా మరణించాయట. ఈ విషాద ఘటనలు గ్రామస్థులను తీవ్రంగా కలిచివేశాయి. నాటి నుంచి తమ ఊరిలో దీపావళి పండుగ జరుపుకోవద్దని పెద్దలు తీర్మానించారట. పున్ననపాలెం గ్రామస్థులు ఇప్పటికీ ఆ కట్టుబాటును గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం లేదు. మొత్తానికి.. దీపావళిని జరుపుకోని గ్రామాలు కూడా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తమ పూర్వీకులు చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ పాటిస్తూ.. ఆ గ్రామం దీపావళికి దూరంగా ఉంటూ వస్తుంది.. గతంలో జరిగిన ఈ విషాద ఘటనలు మళ్లీ తమ గ్రామంలో జరగకూడదు అంటే.. దీపావళికి దూరంగా ఉండడమే సరైనది అనే కట్టుబాట్లకు వచ్చారు ఆ గ్రామస్థులు.
మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను హస్తం పార్టీ ప్రకటించింది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం ఇప్పటి వరకు 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. తొలి జాబితాలో 48 మంది, రెండో జాబితాలో ఐదుగురు, తాజాగా సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఇలా మొత్తం 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో విపక్ష పార్టీ సభ్యులు పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు రెండో విడత పోలింగ్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది.
కాల్పుల విరమణకు ఒప్పుకున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్..
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఖతార్‌లోని దోహాలో శనివారం నాడు పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖావాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య కొనసాగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. అయితే, పాకిస్థాన్, అఫ్గాన్ మధ్య శాంతి స్థాపన కోసం జరిగిన ఈ చర్చలకు ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించాయి. తక్షణ కాల్పుల విరమణ అమలు చేసేందుకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని ఖతార్ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాల్పుల విరమణ అమలు తీరును సమీక్షించేందుకు తదుపరి మీటింగ్ ను నిర్వహించాలని పాక్- అఫ్గాన్ దేశాలు నిర్ణయించాయని చెప్పుకొచ్చారు.
గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. నుసెయిరాట్ ప్రాంతంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిగిన దాడిలో చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, బిడ్డ ఉన్నట్లు పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాదులు.. తమ దళాలపై విధ్వంసక క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ దళాలపై జరిపిన దాడుల తర్వాత ఎన్‌క్లేవ్ అంతటా హమాస్ లక్ష్యాలను, ఫీల్డ్ కమాండర్లు, గన్‌మెన్‌లు, ఒక సొరంగం, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
దేశంలో యూపీఐ ద్వారా 85 శాతం చెల్లింపులు..
భారత దేశంలో 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో పెను విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో ఆయన తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. ఇక, ఇండియాలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు UPI ద్వారానే కొనసాగుతున్నాయి. యూపీఐ సురక్షితంగా, స్కేలబుల్ గా ఉండే డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్ (DPPలు) విషయంలో దేశం ఒక కేస్ స్టడీగా మారగలదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. కలుపుకొని వృద్ధి, ఆవిష్కరణలకు DPPలు శక్తివంతమైన ఉత్ప్రేరకంగా మారాయని వెల్లడించారు. త్వరలోనే క్యాష్ లెస్ చెల్లింపులు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
మ్యాచ్ ఓడినా.. భారత్ కు సెమీఫైనల్‌కు ఛాన్స్.. ఎలాగంటే?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 19) ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన టీమ్‌ఇండియా.. కొన్ని తప్పుల కారణంగా గెలుపును చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాలతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్ గెలిచే ఆశలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఇంకా ఉంది. అయితే, ఇప్పుడు పరిస్థితి ‘డూ ఆర్ డై’ అన్నట్లుగా మారింది. ప్రస్తుతానికి భారత్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌కు కూడా నాలుగు పాయింట్లే ఉన్నా, భారత్ కంటే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది. అయితే సెమీఫైనల్‌కు చేరడానికి భారత జట్టుకు అత్యంత సులభమైన మార్గం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే, టీమ్‌ఇండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
అఖండ 2 కోసం పాట పాడిన ప్రముఖ ప్రవచన ప్రచారకర్త
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు.’ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త ప్రసిద్ధ అగ్రేసర దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటరత్న బాలకృష్ణ కథనాయకుడుగా రూపొందుతున్న ‘అఖండ 2’ విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపధ్యం లో ‘ఈ చిత్రం లోని ఒక కీలక సన్నివేశం కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు మీరే పాడాలి..’ ఆంటూ సంగీత దర్శకులు తమన్ హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని తన రికార్డింగ్ థియేటర్ ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రిని గురు భావనతో ఆహ్వానించారు. బోయపాటి శ్రీను గీతా శ్లోకాల సందర్భాన్ని, చిత్రo లోని కీలకమైన ఘట్టాలనూ కన్నులకు కట్టినట్టు గా వివరించారు. ఈ చిత్రం ఈ దేశానికి, సనాతన ధర్మానికి అంకితమని బోయపాటి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అఖండ’ చిత్రానికి అత్యంత బలమైన రీరికార్డింగ్ అందించిన తమన్ ను ఆయన ప్రత్యేకం గా అభినందించారు. ఇటీవల ఒక సందర్భం లో హీరో బాల కృష్ణ తనతో మాట్లాడుతూ సనాతన ధర్మం పవర్ ఏమిటో ఈ సినిమాలో చూపించామని అన్నారంటూ గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భం గా శ్రీ బోయపాటి, శ్రీ థమన్ లను ‘ఈ చిత్రం ‘అఖండ’ విజయాన్ని సాధించుగాక..!’ అని ఆశీర్వదిస్తూ తులసిమాల, ‘భగవద్గీత’ బహూకరించారు. అని భగవద్గీత ఫౌండేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.
‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్‌నే ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఒక మాస్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని టాక్. ఈ పాటలో బాలయ్య స్టైల్, పవర్‌ఫుల్ ఆట్టిట్యూడ్ ని హైలైట్ చేసేలా కాన్సెప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే, ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య పాత్రను మాఫియా నేపథ్యంతో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. అంటే బాలయ్య లుక్, గెట్‌అప్ కూడా పూర్తిగా కొత్తగా, స్టైలిష్‌గా ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్‌డేట్..!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కె ర్యాంప్’ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు మరింత కలెక్షన్లు రాబట్టి మేకర్స్‌కు జోష్ తెచ్చింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ క్రమంగా పాపులర్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా సాగుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న – “ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?” అన్నదే! తాజా సమాచారం ప్రకారం, ‘కె ర్యాంప్’ సినిమా ఓటీటీ హక్కులను ఆహా (Aha) ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. అంటే థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న తర్వాత, ఈ మూవీ నవంబర్ మూడో వారంలో ఆహాలో స్ట్రీమింగ్‌కి రానుంది అని టాక్. సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో నాలుగు వారాలు పూర్తయ్యాకే ఓటీటీలోకి వస్తాయి కాబట్టి, అదే రూల్ ఈ సినిమాకు కూడా వర్తించే అవకాశముంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో రీసెంట్‌గా ‘క’ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ‘దిల్ రూబా’ కొంత నిరాశ కలిగించినా, ఈ హీరో “మినిమం హిట్ హీరో”గా తన స్థాయిని నిలబెట్టుకున్నాడు. అందుకే ఆహా టీమ్ ఈ ‘కె ర్యాంప్’ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించిందని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి, ‘కె ర్యాంప్’ థియేటర్లలో హిట్‌గా దూసుకెళ్తుండగా, త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది!