ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే.. ప్రజలపైనే పన్నుల బారం పడుతుంది..
నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్ధిక పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరగాలని తెలిపారు. పాలసీ మేకర్లు జాగ్రత్తగా పని చేయాలి.. నాయకుల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆయన వెల్లడించారు. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, నీతి ఆయోగ్ 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది.. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి జరుగుతుంది.. సంక్షేమం చేస్తాం.. మళ్ళీ సంపద వస్తుంది.. ఇలా సైకిల్ తిరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించింది.. 2022- 23లో విపరీతంగా అప్పులు చేశారు.. అలాగే, గత సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టింది అని చంద్రబాబు అన్నారు.
పోలవరం ఎత్తు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదు..
గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు.. పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ఒక రివ్యూ చేశాం.. ఏ పని ఏ నెలలో పూర్తి చేయగలరో ఏజెన్సీలకు లక్ష్యం నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధీ లేని పాలన గత వైసీపీ పాలన.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరల నిర్మించడం మా లక్ష్యం.. ప్రతీ పనిని వెబ్ సైట్ లో పెట్టి రివ్యూ చేస్తామని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెం నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలి.. సన్మానాలు కాదు.. మన బలాన్ని ఐకమత్యతను సమాజానికి చూపించాలి.. బీసీల బలం పెరగటానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టిడిపి తీసుకుంది.. బీసీలు పంచాయతీ మెట్ల ఎక్కాలంటేనే అనేక అవమానాలు పడేవాళ్లు.. అలాంటి బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని తెలిపారు. గజనీ మహమ్మద్ హిందుస్తాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు… రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు.. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్నా బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారని అన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సీట్లు గెలిచిన సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయన్నారు. మూడు స్థానాలు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొందామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మండలి ఎన్నికల ద్వారా దాన్ని మనం రుజువు చేయాలి.. ఓటర్‌ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలి.. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు.
పీసీసీ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ..
గాంధీ భవన్‌లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని.. అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు. ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కాటా కమిటీ ముందు ఉంచారు. ఇటీవల జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోలను కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి ఇచ్చారు. అనంతరం.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి 72 వేల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. మిగిలిన నాలుగు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తావా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాల్సిందే అంటున్నాడు బండి సంజయ్.. ఎందుకు పెట్టాలని అడిగారు. బలహీనవర్గాలకు ఆరు లక్షలు తాము ఇస్తే.. 72 వేలు కేంద్రం ఇవ్వాలి.. ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వనే లేదని అన్నారు.
రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..
మధ్యప్రదేశ్ మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వ మనదేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, కేవలం ధనికలకు మాత్రమే హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కోరుకుంటోందని, వారు పేదలని, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని విశ్వసించేు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉందని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, భారతదేశ వేల ఏళ్ల ఆలోచన అని చెప్పారు. ఇందులో అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలు దాగి ఉన్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ మాట్లాడిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు బీజేపీ అడ్డుకున్నారని వెల్లడించారు.
ఢిల్లీ ప్రజలకు ఆప్ హామీల జల్లు.. ప్రతీ మహిళకు నెలకు రూ. 2100
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య భారీ పోటీ నెలకొంది. పోటాపోటీగా ఇరు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా, ఆప్ మరోసారి ఢిల్లీ ప్రజలపై హామీల జల్లు కురిపించింది. సోమవారం తన మానిఫెస్టోని విడుదల చేసింది. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తాంమని, అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 అందిస్తామని వెల్లడించింది. సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడంతో పాటు నీటి సరఫరా బిల్లులు మాఫీ, 24 గంటల పాటు నీటి సరఫరాని కల్పిస్తామని చెప్పింది. యూరప్ తరహాలో రోడ్ల నిర్మాణం, యమూనా నది క్లీన్ చేయడం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ, రేషన్ కార్డులు మంజూరు, డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారాలు చూపిస్తామని చెప్పింది. ఆటో, టాక్సీ, ఈ- రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ. లక్ష సాయం,వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా అందిస్తామని వెల్లడించింది.
ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని బలవంతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలోని గురుద్వారాలలో అక్రమ వలసదారుల్ని వేటాడుతున్నారు. అయితే, ఈ చర్యల్ని అనేక సిక్కు సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇది తమ మతపరమైన స్థలాల పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని గురుద్వారాలను సిక్కు వేర్పాటువాదులు, పత్రాలు లేని వలసదారులు సమావేశ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే వలసదారులపై చర్యలు మొదలయ్యాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) మరియు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అమలుపై బిడెన్ పరిపాలన మార్గదర్శకాలను రద్దు చేస్తూ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక కార్యదర్శి బెంజమిన్ హాఫ్‌మన్ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. బైడెన్ హయాంలో గురుద్వారాల వంటి ప్రార్థనా స్థలాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి చర్యల్ని పరిమితం చేసింది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రావడంతో గురుద్వారాలను కూడా అధికారులు వదిలిపెట్టకుండా తనిఖీ చేస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్.. సినిమాను మించి!
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ప్రతిరోజూ కొత్త షాకింగ్ అప్‌డేట్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం అసలు నిందితుడా కాదా అని ముంబై పోలీసులను సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌కు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌లో సైఫ్ అలీఖాన్ ఇంట్లో లభించిన వేలిముద్రలు, షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్త్తోంది. దీంతో పోలీసులు చేసిన అరెస్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి 19 వేలిముద్రల నమూనాలను స్వాధీనం చేసుకుంది. అయితే షరీఫుల్ ఇస్లాం షాజాద్ వేలిముద్రతో ఏ ఒక్క నమూనా కూడా సరిపోలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క ఇప్పటికే మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ తండ్రి బంగ్లాదేశ్ నుండి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్
శాండల్‌వుడ్ స్టార్ జంట హరిప్రియ, వశిష్ఠసింహ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. నిన్న (జనవరి 26) మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట షేర్ చేసింది. వివాహ వార్షికోత్సవం రోజున బాబు పుట్టడంతో ఈ జంట మూడు సింహాలతో ఉన్న పిక్ షేర్ చేశారు. హరిప్రియ కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న హరిప్రియ తెలుగు, తుళు భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆమెకు బాలకృష్ణతో చేసిన జైసింహా సినిమా తెలుగులో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఆమె వశిష్ఠ సింహ అనే కన్నడ సినీ నటుడితో ప్రేమలో పడింది. 2023వ సంవత్సరం 26వ తేదీన వీరి వివాహం మైసూరులో అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న, వారి రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, హరిప్రియ అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఈ స్టార్ కపుల్ విడుదల చేయడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల, నటుడు వశిష్ట సింహా తన భార్య హరిప్రియ కోసం గ్రాండ్ బేబీ షవర్ ఫంక్షన్ కూడా జరిపారు. కన్నడలోని ప్రముఖ నటీనటులు, దర్శకులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.