రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక టార్గెట్..!
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ హాజరయ్యారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు మొత్తం 5,28,217 గ్రీవెన్స్‌లు అందగా, వాటిలో 4,55,189 గ్రీవెన్స్‌లను పరిష్కరించినట్లు అధికారులు నివేదించారు. ప్రస్తుతం 73,000 గ్రీవెన్స్‌లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో 2024 జూన్ నుంచి 22-A జాబితా నుంచి తొలగించాలంటూ 6,846 దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం, వెబ్ ల్యాండ్ 2.0లో డేటా నమోదు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా భూ రికార్డుల అప్‌గ్రెడేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 2.77 కోట్ల కుల ధ్రువీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేసినట్టు వివరించారు. ఇక, స్టాంప్ & రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 10,169 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ విధానం కోసం చర్యలు వేగవంతం చేశారు. ఇక త్వరలో జరగబోయే రిజిస్ట్రేషన్ కార్యక్రమాల ద్వారా 15,570 రిజిస్ట్రేషన్లతో రూ. 250 కోట్ల ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులు చర్యలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
పరకామణి చోరీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు మరోసారి హైకోర్టు దృష్టిని ఆకర్షించింది. ఈ కేసులో జరిగిన వివాదాస్పద పరిణామాలు, ముఖ్యంగా లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ఒప్పందం చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత కోసం సీఐడీ నూతనంగా ఒక అదనపు నివేదికను హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో రాజీ ప్రక్రియపై మరిన్ని వివరాలు, సంబంధిత పత్రాలు ఉన్నట్లు సమాచారం. అయితే, సీఐడీ సమర్పించిన అదనపు నివేదికకు మరో రెండు సెట్స్ సిద్ధం చేసి, వాటిని సీల్డ్ కవర్లలో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ నడుస్తున్నందున వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసులో జరిగిన లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను పరిశీలిస్తోంది. కోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తూ.. “సీఐడీ సమర్పించిన అన్ని నివేదికలను ధర్మాసనం ముందు ఉంచాలి” అని ఆదేశించింది. ఈ నివేదికల ఆధారంగా రాజీ ఒప్పందం చట్టపరంగా నిలబడుతుందా లేదా అన్న దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అయితే,సీఐడీ సమర్పించిన తాజా నివేదికను పూర్తిగా పరిశీలించి, తదుపరి ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. తదుపరి విచారణలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. తిరుమల పరకామణి చోరీ వివాదంలో లోక్ అదాలత్ ఒప్పందం నిజంగా చట్టబద్ధమా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వెలువడనుంది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది.. శ్వేతపత్రానికి సిద్ధమా..?
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ పెరిగిందని రెండు గంటల పాటు చెప్పి, మిగతా సమయం మొత్తం జగన్ ప్రభుత్వాన్నే తప్పుపట్టడమే చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని చెప్పడం హాస్యాస్పదమని, అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అసలు బ్రాండ్ వ్యవసాయమేనని, దేశానికి దక్షిణ ధాన్యాగారంగా నిలిచిన రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబే అని పేర్ని నాని ఆరోపించారు. రైతు హితానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాన్ని, చంద్రబాబు గద్దెనెక్కినప్పటి నుంచి రైతు వ్యతిరేక దృక్పథమే నడుస్తోందని ఆయన విమర్శించారు. మీరు తెచ్చిన అప్పుల డబ్బు ఎక్కడ ఖర్చయిందో శ్వేతపత్రం ఇవ్వడానికి చంద్రబాబుకు ధైర్యం ఉందా? అని పేర్ని నాని సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంటే, టీడీపీ నాయకులు మాత్రం హెలికాప్టర్లు, విమానాల్లోనే తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత జీడీపీ 13.5 అని చంద్రబాబు చెప్పడం పూర్తిగా తప్పని, జగన్ పాలనలో 10.5 అని ఎలా లెక్కపెట్టారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు లెక్కలు కూర్చొని మాట్లాడుదామంటే సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు సంవత్సరాల కోవిడ్ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం దేశ సగటు కన్నా మంచి ప్రదర్శన ఇచ్చిందని పేర్కొన్నారు. పోర్టులు, మెడికల్ కళాశాలలు, గ్రామ సచివాలయాలు, అరుదైన స్థాయిలో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్లు.. ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు మాజీ మంత్రి పేర్ని నాని..
తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రెండో రోజు రూ.2.96 లక్షల కోట్లకు ఎంవోయూలు..
ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది.. బ్యాక్‌టు బ్యాక్ మీటింగ్‌లు, వరుసగా మౌ సంతకాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో రూ.5,39,495 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.. తొలి రోజు రూ.2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా.. 2వ రోజు.. పెట్టుబడులు మరింత పెరిగాయి.. రూ.2 లక్షల 96 వేల 495 కోట్ల పెట్టుబడులు రెండో రోజు వచ్చాయి…. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి..
ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో, సీవోవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికులకు రూ.750 కోట్లను వెనక్కి ఇప్పించామని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. క్రమంగా ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు సాధారణస్థితికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రయాణికులకు రిఫండ్, లగేజీలను చేర్చే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని, డీజీసీఏ ఇండిగో యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని స్పష్టం చేశారు.
కర్ణాటకలో మళ్లీ ‘టిప్పు’ వివాదం.. ‘‘బిన్ లాడెన్ జయంతి’’ జరపాలంటూ బీజేపీ ఫైర్..
కర్ణాటకలో మరోసారి ‘‘టిప్పు జయంతి’’ ఉత్సవాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశపనవ్వర్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు. కాశపనవ్వర్ టిప్పు జయంతిని నిలిపేయడాన్ని ప్రశ్నించారు. ఈ వేడుకల్ని ఎందుకు జరపకూడదని అడిగారు. 2013 నుంచి టిప్పు జయంతి ఉత్సవాలను ప్రారంభించామని, దీనిని తిరిగి ప్రారంభించాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జయంతిని జరుపుకోవడం తప్పా.? అని ప్రశ్నించారు. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కూడా ఈ వేడుకల్ని పునరుద్ధరించాలని కోరారు. ఇది లౌకిక దేశమని, టిప్పు జయంతిని జరుపుకుంటే తప్పేంటని, హిందూ ముస్లింల సమస్యల్ని బీజేపీ సృష్టిస్తోందని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ చర్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ నేత ఆర్ అశోక అన్నారు. కాంగ్రెస్ ముస్లింల పట్ల ప్రేమ, హిందువుల పట్ల ద్వేషంతో టిప్పు జయంతిని జరుపుకుంటుందని, చివరకు వారు ‘‘బిన్ లాడెన్ ’’ జయంతిని కూడా జరుపుకుంటారని ఎద్దేవా చేశారు. 2015లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతిని ప్రవేశపెట్టింది. అయితే, 2015, 2016లలో కొడగు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఘర్షణలు జరిగాయి. బీజేపీ టిప్పును హిందూ వ్యతిరేకిగా, మతపరమైన హింసకుడిగా ఆరోపిస్తోంది. 2019లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా టిప్పు జయంతిని నిలిపేసింది. శాంతిభద్రతల సమస్యగా పేర్కొంది.
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి..!
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ భవనం టెర్రా డ్రోన్ ఇండోనేషియా (Terra Drone Indonesia) కార్యాలయం. ఈ సంస్థ మైనింగ్ నుంచి వ్యవసాయ రంగం వరకు వివిధ క్లయింట్‌లకు ఏరియల్ సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్‌లను అందిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసత్యో పూర్ణోమో కొండ్రో విలేకరులతో మాట్లాడుతూ.. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని, భవనం లోపల మరింత మంది బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం మధ్యాహ్నం మొదటగా మొదటి అంతస్తులో మొదలై, ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించిందని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా.. మరికొందరు ఆఫీసు నుంచి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 20కి చేరుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం, మేము బాధితులను తరలించడం, మంటలు చల్లబరిచే పనులపై దృష్టి సారించామని చెప్పుకొచ్చారు.
అంబానీ ఫ్యామిలీకి CBI ఝలక్.. జై అన్మోల్‌పై రూ. 228 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణ
కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో FIR నమోదు చేసింది. ఇందులో బ్యాంకుకు రూ. 228 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ కేసు ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైంది. ఫిర్యాదులో RHFL, జై అన్మోల్ అంబానీతో పాటు సంస్థ డైరెక్టర్లైన రవీంద్ర శరద్ సుధాకర్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఫిర్యాదు ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యాపార అవసరాల కోసం ముంబైలోని బ్యాంకు SCF బ్రాంచ్ నుంచి రూ. 450 కోట్ల వరకు క్రెడిట్ లిమిట్లను పొందింది. ఇందుకు బ్యాంకు కొన్ని ఆర్థిక క్రమశిక్షణ నియమాలను విధించింది. వీటిలో సమయానికి చెల్లింపులు, వడ్డీ చెల్లింపు, భద్రత పత్రాలు సమర్పించడం, అలాగే మొత్తం అమ్మకాల ఆదాయం బ్యాంకు ఖాతా ద్వారా మళ్లించడం వంటి షరతులు ఉన్నాయి. అయితే, సంస్థ ఈ షరతులను పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్ 30న ఖాతాను NPA (Non-performing Asset)గా మార్చినట్లు అధికారులు తెలిపారు.
వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో పాండ్యా ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాస్తవానికి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ వెలుపల హార్దిక్ ప్రియురాలిని కొందరు ఫోటోగ్రాఫర్స్ అనుచితంగా ఫోటోలు తీశారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా ఈ పోస్ట్ చేశాడు. హార్దిక్ ఈ పోస్ట్‌లో ఒక పబ్లిక్ ఫిగర్‌గా తాను నిరంతరం కెమెరాల దృష్టిలో ఉంటానని అర్థం చేసుకున్నానని, కానీ తాజాగా జరిగింది బౌండ్రీలైన్ దాటిందని ఆయన వెల్లడించాడు. ఆ సమయంలో మహికా మెట్లు దిగుతోందని, కానీ టైంలో ఫోటోగ్రాఫర్స్ తనని అనుచితంగా ఫోటోలు, వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్దిక్ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ తాను ఎల్లప్పుడూ మీడియాకు సహకరిస్తానని, కానీ ఇలాంటివి అవసరం లేదని పేర్కొన్నాడు. చివరగా హార్దిక్ “దయచేసి కొంత మానవత్వం కలిగి ఉండండి, ధన్యవాదాలు” అని ఈ సుదీర్ఘ పోస్ట్‌ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ విషయానికి వస్తే ఆయన 2025 ఆసియా కప్ సమయంలో గాయపడి రెండు నెలలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఈ స్టార్ ఆల్ రౌండర్ మంగళవారం కటక్‌లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తరుఫున మైదానంలోకి తిరిగి పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మహికా శర్మ విషయానికి వస్తే ఆమె ఒక ప్రముఖ మోడల్. అలాగే ఆమె మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా మెరిచింది. ప్రస్తుతం పాండ్యా – మహికా రిలేషన్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ తాండవం’. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 12వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతున్న కొన్ని సినిమాలు తమ రిలీజ్ వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే ‘మోగ్లీ’ టీమ్ తమ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక, వంశీ నందిపాటితో బన్నీ వాసు కలిసి రిలీజ్ చేయాల్సిన ‘ఈషా’ అనే ఒక హారర్ థ్రిల్లర్ సినిమాని సైతం వాయిదా వేసుకుంటున్నట్లుగా సమాచారం.
ఒకే ఏడాది 300 కోట్ల రికార్డ్ మిస్సయిన ప్రదీప్ రంగనాథన్
సైలెంట్‌గా ‘లవ్ టుడే’ అనే సినిమా చేసి తెలుగులో సైతం బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఏడాది నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ మరుసటి రోజే ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దానికి తోడు, ఈ సినిమా తెలుగు వెర్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కచ్చితంగా తన సినిమాని తమిళంతో పాటు తెలుగులో సైతం రిలీజ్ చేయాలని పట్టుబడుతున్న ప్రదీప్ రంగనాథన్‌కు అది సాధ్యం కాదని తెలియడంతో, సినిమాని ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే, వాలెంటైన్స్ వీక్‌లో ఈ లవ్ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద, ఈ ఏడాది వరుసగా మూడు హిట్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆశలకు మాత్రం గండి పడినట్లే చెప్పాలి.