టిడ్కో ఇళ్లపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి..
టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాం. మున్సిపాలిటీలు, పట్టణ అభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు మంత్రి నారాయణ..
క్రికెట్ స్టేడియంలో క్షుద్ర పూజలు.. నిలిచిపోయిన టోర్నమెంట్..!
ఆధునిక సమాజంలోనే క్షుత్ర పూజలు భయపెడుతూనే ఉన్నాయి.. ఓవైపు అంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే.. మరోవైపు.. ఇలాంటి ఘటనలు.. నమ్మేవారిని మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా.. నల్లచెరువులోని క్రికెట్ స్టేడియంలో క్షుద్ర పూజలు చేశారు.. క్రికెట్ స్టేడియంలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసినట్టు అనవాళ్లు కనిపిస్తున్నాయి.. క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండగా క్షుద్ర పూజలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు.. క్రికెట్ స్టేడియంతో పాటు మండల కేంద్రంలోని మొబైల్ షాపు వద్ద కూడా క్షుద్ర పూజలు చేసినట్టుగా చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఆకతాయిలే ఈ మ్యాచ్‌లు ఆపడానికి క్షుద్రపూజలు చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే, స్టేడియంలో క్షుద్రపూజలు చేయడంతో.. కొందరు క్రీడాకారులు మ్యాచ్‌లు ఆడేందుకు వెనకడుగు వేయడంతో.. మ్యాచ్‌లు కాసేపు నిలిచిపోయినట్టుగా సమాచారం.. అయితే, క్షుద్రపూజలు చేసినవారిపై చర్యలు చేపట్టాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం..
హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై విద్యాశాఖ కమిషనర్‌ను వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది హైకోర్టు. అయితే, ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన నియమకాల విషయంలో విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. పాఠశాలలలో నియామకాలు చేపట్టాల్సిందిగా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గతంలోనే జారీ చేసింది న్యాయస్థానం.. అయితే, ఈ ఉత్తర్వులను విద్యాశాఖ అమలు చేయని కారణంగా పాఠశాల యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.. విచారణ జరిపిన హైకోర్టు విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేసింది.. జులై 11వ తేదీన హైకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది..
గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు..!
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై రకరకాల ప్రచారాలు సాగాయి.. చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారని.. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.. దాంట్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు కొడాలి నాని..
కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు గురైన ఆధారాలను చూపించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “కెసిఆర్, కేటీఆర్ లు దిగజారి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు.. చట్టం మీద రెస్పెక్ట్ లేదు వ్యక్తుల ప్రైవసీ మీద గౌరవం లేదు.. పదవులు కాపాడుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేశారు.. 2018 లోనే ఎన్నికలలో ఓడిపోతానని గ్రహించి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి గెలిచారు.. ఇక భవిష్యత్తులో కెసిఆర్ మళ్లీ పదవిలోకి రాడు.. దర్యాప్తు సక్రమంగా జరగకపోతే సిబిఐకి అప్పగించాలి.. జితేందర్ రెడ్డి తో మాట్లాడిన ఫోన్ కాల్ ను సిట్ అధికారులు నాకు వినిపించారు.. ప్రణీతరావు రికార్డు చేశారు ఆ ఫోన్ కాల్ ను.. కొన్ని ఫోన్ కాల్స్ ని డిలీట్ చేశారు.. ఎన్నికల సమయంలో నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు పోలీసులు.. తన ఇంట్లో కంప్యూటర్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారు..
మంత్రి సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్.. లేఖపై స్పందించిన మంత్రి
మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. సీతక్కకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు మావోలు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా…? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు స్పష్టం చేశారు. జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు.
పూరి జగన్నాథ ఆలయంలో ‘‘మూడో మెట్టు’’ రహస్యం.. ఈ మెట్టుపై భక్తులు కాలు పెట్టరు..
పూరీ జగన్నాథ ఆలయంలో ఎన్నో రహస్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతీది దైవత్వాన్ని సూచిస్తుంది. ఒడిశాలోని పూరీలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పూరీకి చేరుకుంటారు. హిందూ మతంలోని చార్ ధామ్‌లలో ఒకటైన పూరీ అనేక పురాతన రహస్యాలను కలిగి ఉంది. వీటిలో ఆసక్తికమైనది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘‘మూడో మెట్టు’’ దీనిని ‘‘యమ శిల’’ అని కూడా పిలుస్తారు. పూరీ జగన్నాథుడి ఆలయంలోకి ప్రవేశించడాన్ని ప్రతీ భక్తుడు కూడా పవిత్రంగా భావిస్తాడు. ఆలయంలో ప్రవేశించేందుకు 22 మెట్లు ఎక్కాలి. అయితే, దిగువ నుంచి మూడో మెట్టు ఇందులో చాలా ప్రత్యేకమైంది. దీనిని యమ శిల అని పిలుస్తారు. హిందూ మతంలో మరణదేవుడిగా పేరున్న యమ ధర్మరాజు నివాసంగా దీనిని నమ్ముతారు. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం, యమ రాజు ఒక సారి జగన్నాథుడిని దర్శించుకునేందుకు వస్తాడు. ఏ ఆత్మలు తన రాజ్యానికి రావడం లేదని స్వామి ముందు తన బాధను వ్యక్తం చేశాడు. జగన్నాథుడిని చూడటం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతున్నారని, యమలోకాని వెళ్లకుండా స్వామి చూసుకుంటాడని భక్తులు నమ్ముతారు.
ఢాకాలో దుర్గా మాత ఆలయం కూల్చివేత.. భారత్ నుంచి తీవ్ర స్పందన..
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు. ‘‘ఢాకాలోని ఖిల్ఖేత్ లోని దుర్గా ఆలయాన్ని కూల్చివేయాలని అరాచకవాదులు నినాదాలు చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము. తాత్కాలిక ప్రభుత్వం, ఆలయానికి భద్రత కల్పించడానికి బదులుగా, ఈ సంఘటన అక్రమ భూ వినియోగం కేసుగా చిత్రీకరించి, ఆలయాన్ని నాశనం చేశారు’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ‘‘ దీని ఫలితంగా దేవతను మరో ప్రదేశానికి తరలించే ముందు నష్టం వాటిల్లింది. బంగ్లాదేశ్ లో ఇలాంటి పునరావృతం కావడం పట్ల మేము నిరాశ చెందాము. హిందువులను, వారి ఆస్తులను మరియు వారి మత సంస్థలను రక్షించడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత అని నేను నొక్కి చెబుతున్నాను’’ అని జైస్వాల్ అన్నారు.
తమ్ముడు సెన్సార్ పూర్తి.. A సర్టిఫికెట్ వచ్చిందే..
యంగ్ హీరో నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న మూవీ తమ్ముడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ మీద మంచి బడ్జెట్ తో తీస్తున్నారు. దగ్గరుండి ప్రమోషన్లు కూడా చేసుకుంటున్నారు దిల్ రాజు. రేపు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది. ఇదే ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నాయి. హింస కూడా ఉందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ అంటే కొంత హింస తక్కువే ఉంటుంది. కానీ తమ్ముడు మూవీలో హింస ఉందని తెలుస్తోంది. అయినా సరే ఏ సర్టిఫికెట్ రావడం షాక్ కు గురి చేసింది.
స్టేజి మీదనే ఏడ్చేసిన హీరో సిద్ధార్థ.. ఎందుకంటే..?
హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్‌కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో నా తల్లిదండ్రులు కూడా నటించారు. ఈ మూవీ విషయంలో నా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించా. ఇది 40వ సినిమా అని నా తండ్రి సూర్య నారాయణన్ కు చెప్పాను. ఆయన చాలా గర్వపడ్డారు. ఆయన ముఖంలో చెప్పలేనంత ఆనందం, సంతోషం కనిపించాయి. అంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపించింది. ’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సిద్దార్థ్.
మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిన ఏడాది..!
అవును.. మంచు ఫ్యామిలీకి ఈ ఏడు బాగా కలిసొచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చారు. మనోజ్, విష్ణు మంచి హిట్లు అందుకున్నారు. మనోజ్ సినిమాలు చేయక ఏడేళ్లు అవుతోంది. ఇక హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శౌర్య సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నారు. దాని తర్వాత అన్నీ ప్లాపులే. చివరిగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో మెరిశాడు. దాని తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. ఏడేళ్ల తర్వాత మొన్న భైరవం సినిమాతో మే 30న వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో మనోజ్ మెయిన్ లీడ్ కాకపోయినా.. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మంచు విష్ణు, మోహన్ బాబులు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన కన్నప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విష్ణుకు కచ్చితంగా హిట్ పడాలి అన్న టైమ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది కన్నప్ప.