రప్పా.. రప్పా.. వ్యాఖ్యలపై కేబినెట్‌లో చర్చ.. వారికే డ్యామేజ్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మరోవైపు, రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు.. ఇక, రప్పా.. రప్పా.. వంటి వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్ధించడం.. ఆ పార్టీకే బాగా నష్టం కలిగించందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు మంత్రులు..
అమరావతిలో మలివిడత భూసేకరణ.. కేబినెట్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు.. అయితే, తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. మరోవైపు, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇంఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని.. మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు.. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చు అని స్పష్టం చేశారు సీఎం.. అయితే, సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు చంద్రబాబు.. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా మరోసారి చెప్పారు ముఖ్యమంత్రి..
అమరావతి ఎలా ఉండాలి..? ప్రజల సలహాలు కోరిన సీఆర్డీఏ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే భూమి సేకరించిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు, రెండో విడత భూ సమీకరణపై దృష్టిసారించింది.. దీనికి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, అమరావతి అభివృద్ది విషయంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ).. ఎపీ సీఆర్‌డీఏ విజ న్ 2047 పేరుతో ఆన్‌లైన్‌లో ప్రశ్నావళి రూపొందించింది సీఆర్‌డీఏ.. విజన్ లో అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వాములై తమ ఆలోచనలు, సూచనలు, ప్రాధాన్యతలు, అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేసింది.. 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా సీఆర్‌డీఏ ఉందని వెల్లడించింది.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో సీఆర్‌డీఏ విస్తరించి ఉన్నట్టు పేర్కొంది.. మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు 900 గ్రామాలున్న ప్రాంతమని వెల్లడించింది సీఆర్‌డీఏ.. ఇక, సీఆర్‌డీఏ విజన్ 2047పై పలు ప్రశ్నలు వేస్తూ.. సమాధానాలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు సూచించింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ.. ఇంకేముందు.. మన రాజధానిలో.. మీరు ఏముండాలి ? అనుకుంటున్నారు.. ఎలా డెవలప్‌చేయాలని సూచిస్తారు..? మీరిచ్చే సలహాలు.. సూచనలు.. మీ ఆలోచనలు, ప్రణాళికలు.. ఇలా అన్నీ.. సీఆర్‌డీఏకు చేరవేయండి..
రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు.. సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం ఆదేశాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. త్వరలో మార్కెట్, టెంపుల్ కమిటీల్లో నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించి జడ్‌పీటీసీ, జిల్లా అధ్యకుడిగా పని చేసి ఇప్పుడు మంత్రి అయ్యారు. భట్టి విక్రమార్క.. ఎన్‌ఎస్‌యూఐ నుంచి సీఎల్పీ నేతగా పని చేసి.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. షబ్బీర్ అలీ.. శాసన సభలోకి దూసుకెళ్లి ఆందోళనలు చేశారు.. ఆ తర్వాత.. ఎమ్మెల్యే, మంత్రి అయ్యి.. ఈ స్థాయికి వచ్చారు.
ఇది కరెక్ట్ కాదు.. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి..!
మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని.. ఎవరికి వారు… నేనే అభ్యర్థిని చెప్పుకోకండన్నారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా చూడాల్సి వస్తుందని.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. మంత్రి పదవులు కోసం ధర్నాలు చేయించడం ఏంటి? అని ప్రశ్నించారు. పదవులు అడగడం తప్పు లేదు.. కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారు అని… రేపు ఇంకొకరు చేస్తారు అని తెలిపారు. పీసీసీ కమిటీలో పదవులు వచ్చిన వారికి నియామకం పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా జాబితా సిద్ధం చేయండని సీఎం పిలుపునిచ్చారు. ముందు అందరికీ పని అప్పగించాలని స్పష్టం చేశారు. పని చేసిన వాళ్ళు ఒక జాబితా.. పని చేయని వాళ్ళది మరో జాబితా సిద్ధం చేయాలన్నారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇద్దామన్నారు. మొహమాటం అవసరం లేదని స్పష్టం చేశారు.
పాస్‌పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ భేష్.. టీజీ పోలీసుల శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు..
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు “సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్”ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,06,684 పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణను తెలంగాణ పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ధృవీకరణలు పూర్తిగా నిర్ణీత వ్యవధి (15 రోజులలోపు) పూర్తయ్యాయి. వాస్తవానికి, తెలంగాణలో పాస్‌పోర్ట్ ధృవీకరణలకు తీసుకున్న సగటు సమయం 7 రోజులకు కూడా తగ్గిందనే ప్రశంసనీయమైన ఘనతను సాధించారు.
బీజేపీలో చేరికపై శశిథరూర్ ఏమన్నారంటే..!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. నిత్యం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో శశిథరూర్ పార్టీ మారడం ఖాయమని పొలిటికల్‌గా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎన్నో రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. విదేశాలకు దౌత్య బృందాలను పంపించింది. ఆ బృందంలో ఒక కమిటీకి శశిథరూరే నాయకత్వం వహించారు. దీంతో పార్టీ మారడం ఖాయంగా వార్తలు వచ్చాయి. మంగళవారం ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ స్పందించారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. పార్టీ మారడం ఖాయమా? అని విలేకరి అడిగాడు. దానికి చిరునవ్వు చిందిస్తూ.. బీజేపీలో చేరడానికి అవేమీ సంకేతాలు కావని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని.. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదని.. ఇది భారతదేశ విదేశాంగ విధానం అని చెప్పుకొచ్చారు. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పినట్లు గుర్తుచేశారు. అంత మాత్రాన బీజేపీలో చేరతానని కాదని.. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అవుతాయని తెలిపారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినేనని.. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ట్రంప్ సీస్‌ఫైర్ విఫలం.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడులు..!
గత కొన్ని రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. సీస్‌ఫైర్ అమలులోకి వచ్చిన 2 గంటలకే ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్‌కు ఆదేశించానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. టెహ్రాన్‌కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. బీర్‌షెబాలో నివాస భవనాన్ని ఇరానియన్ క్షిపణి ఢీకొంది. ఇందులో నలుగురు మృతి చెందగా.. డజను మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..?
అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను కూడా వద్దనుకున్నట్టు సమచారం. ఇప్పుడు ఐకాన్ సినిమాను కూడా బన్నీతో చేయట్లేదని దిల్ రాజు తెలిపాడు. త్వరలోనే కొత్త హీరోను ప్రకటిస్తామన్నారు. చూస్తుంటే ఆ కొత్త హీరో దిల్ రాజు బ్యానర్ తో మంచి సంబంధం ఉన్న విజయ్ దేవరకొండనే అని తెలుస్తోంది. ఐకాన్ అనేది హ్యూమన్ యాక్షన్ మూవీ. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దీనికోసం భారీగా లుక్ ఛేంజ్ చేసుకుని కష్టపడాలంట. అందుకే మంచి ఫిజిక్ ఉన్న విజయ్ దేవరకొండవైపే మొగ్గుచూపుతున్నారంట. తమ్ముడు సినిమా అయిపోయిన తర్వాత ఈ మూవీపై వేణు శ్రీరామ్ ఫోకస్ చేస్తారంట. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
నిహారిక విడాకులు.. మేం చేసిన తప్పే!
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ సక్సెస్ కొడుతున్నారా లేదా అనేది నేను చూడను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేదే నాకు ముఖ్యం. నిజానికి వరుణ్ తేజ్ వచ్చి లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఆమెతో హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా? ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం చేస్తావ్ అని అడిగాను. అయితే కచ్చితంగా ఆమెతో హ్యాపీగా ఉంటాను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకోగలనని నమ్మకం ఉందంటే వెంటనే పెళ్లి చేశాను. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే నిహారిక విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా జరిగింది.
తల్లి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు..
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. ‘మా తల్లి ఆరోగ్యం చాలా బాగుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్’ అంటూ ఖండించారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ రకమైన వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అవేమీ నిజం కాదని తేలిపోయింది. గతంలోనూ ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. రెండు, మూడు సార్లు చిరంజీవి స్వయంగా స్పందిస్తూ రూమర్లను ఖండించారు. తన తల్లి ఆరోగ్యంపై ఇలాంటివి రాయొద్దంటూ వేడుకున్నారు. కొద్ది నిముషాల క్రితమే ఉపాసన కూడా అంజనాదేవితో చేసిన ఓ వంటల వీడియోను షేర్ చేసింది. దాన్ని బట్టి ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని తెలుస్తోంది.