ఏపీకి ఆర్థిక తోడ్పాటు అందించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి..
హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటును కోరారు.. “సాస్కి” పథకం (SASCI—-Special Assistance to States for Capital Investment) తో పాటు, “మిషన్ పూర్వోదయ” పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.. “సాస్కి” పథకం ద్వారా రాష్ట్రాలకు “మూలధన పెట్టుబడి” (Capital Investment) కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనుంది కేంద్రం.. రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసుకునేలా వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తుంది కేంద్ర.. ఆయా పర్యాటక కేంద్రాలకు రహదారుల నిర్మాణం, నాణ్యత ప్రమాణాలతో కూడిన వసతులు, సమర్థవంతమైన నిర్వహణ, పర్యాటక ప్రాంతాల్లో ఉండాల్సిన ఇతరత్రా సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, “మిషన్ పూర్వోదయ” పథకం ద్వారా ఈశాన్య ప్రాంత ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.. “మిషన్ పూర్వోదయ”పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.. “వికసిత్ భారత్” లో భాగంగా అంతగా అభివృద్ధి సాధించని రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం చేయాలని “మిషన్ పూర్వోదయ” పథకాన్ని కేంద్ర ప్రారంభించిన విషయం విదితమే కాగా.. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా అన్నివిధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. వైసీపీ డిమాండ్
నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై మంత్రి నారా లోకేష్‌తో పాటు సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.. అయితే, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి..ఇక, బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గచర్య అన్నారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నటిస్తుందని విమర్శించారు.. బుడ్డా పై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులు వేస్ట్ అన్నారు.. ఎమ్మెల్యే బుడ్డాను సీఎం చంద్రబాబు ఎందుకు పిలిపించి మందలించలేదు? అని నిలదీశారు.. బుడ్డా ఆంబోతులా వ్యవహరిస్తే సీఎం చంద్రబాబు కళ్లు మూసుకొని నిద్రపోతున్నారు అని ఫైర్ అయ్యారు.. అధికారంలోకి వచ్చాక పట్టుడు కర్రల ఫ్యాక్టరీ పెడతామన్న బుడ్డా మాటల వెనుక ఆంతర్యం ఇదేనా? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తక్షణమే స్పందించాలి.. బుడ్డాపై కేసులు పెట్టి, పార్టీ నుండి సస్పెండ్ చేసి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.. బుడ్డాను నిర్లక్ష్యంగా అచ్చోసిన ఆంబోతులా వదిలేస్తే ప్రజల హింసిస్తాడు.. బుడ్డా అక్రమ వసూళ్లు , దౌర్జన్యాలపై మంత్రి లోకేష్ విచారణ కమిటీని వేయాలి.. బుడ్డా వ్యాపారం , కాంట్రాక్టులు చేయడం లేదు కేవలం వసూళ్లపై రాజకీయాలు చేస్తున్నారు… పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తన నిజ స్వరూపాన్ని చూపాలి… బడ్డాపై చర్యలు తీసుకొని అటవీశాఖ అధికారులు మనోధైర్యాన్ని నింపాలని కోరారు శిల్పా చక్రపాణి రెడ్డి..
నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..
నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్… ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్… అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ పై సమీక్ష నిర్వహించిన లోకేష్ కీలక సూచనలు చేశారు.. విద్యాశాఖలో గత 14నెలల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం.. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదే అన్నారు.. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తాం అన్నారు.. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది అన్నారు.. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి… దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అన్నారు..
సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ ఆందోళన.. సచివాలయం వద్ద ఉద్రిక్తత..!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “సేవ్ హైదరాబాద్” పేరుతో బీజేపీ నేతలు సచివాలయం వద్ద నిరసనలు చేపట్టగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సచివాలయం వైపు చేరుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని, పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు ఛేదించిన పోలీసులు.. హంతకుడు ఎవరంటే..?
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్‌వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగులగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్లాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను ‘హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్’ అని ఇంగ్లీష్‌లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..
శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన దేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో సీఐడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కార్యాలయానికి రావాలని పిలిచింది. ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈక్రమంలో ఆయనను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే లండన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని CID చెబుతోంది. ఈ పర్యటన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకున్నారని సీఐడీ వాదన. పలు నివేదికల ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో ఆయన క్యూబాలోని హవానాకు వెళ్లారు. అక్కడ జరిగిన G77 సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వస్తుండగా లండన్‌లో ఆగి, తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ మొత్తం పర్యటన అధికారిక కార్యక్రమం కంటే వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, ఈ ఖర్చులన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారని CID ఆరోపించింది.
‘నా వయసు 25, నా బాయ్‌ఫ్రెండ్ వయసు 76’.. తన లవ్ స్టోరీ చెప్పిన డయానా
ప్రేమకు వయోబేధం ఏమీ లేదు. ఎప్పుడు.. ఎలా? ఎవరిపై ప్రేమ పుడుతుందో చెప్పలేము. మనసులు కలిస్తే చాలు. సంతోషంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తుంటారు లవ్ బర్డ్స్. ఇదే రీతిలో ఓ యువతి తనకంటే 51 ఏళ్లు పెద్దవాడైనా వృద్ధుడితో ప్రేమలో పడింది. దీంతో ఈ జంట వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం వారి మధ్య వయసు తేడా. ఎందుకంటే ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు కాగా, ఆమె ప్రేమికుడికి 76 సంవత్సరాలు. ఇది శాన్ డియాగోకు చెందిన డయానా మోంటానో స్టోరీ. డైలీ మెయిల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో డయానా తన ప్రేమకథ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నా వయసు 25 సంవత్సరాలు, నా ప్రియుడికి 76 సంవత్సరాలు అని ఆమె చెప్పింది. 51 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ, మేము ఒకరినొకరం సంతోషంగా ప్రేమించుకుంటున్నాం అని తెలిపింది.
జీఎస్టీ శ్లాబుల్లో భారీ మార్పులు.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయ్…
దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించారు. 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు కావొచ్చని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉన్నాయి. ఇక దీపావళి నుంచి రెండే శ్లాబులు అమల్లోకి వస్తాయి. 12 శాతం, 28 శాతం జీఎస్‌టీ శ్లాబులను తొలగించి, కేవలం 5 శాతం, 18 శాతం జీఎస్‌టీ రేట్లను మాత్రమే ఉంచాలని యోచిస్తోంది. 5 శాతం, 18 శాతం పన్ను రేట్లు ఉంటే చాలా వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. పేద, మధ్యతరగతి జనాలకు మేలు చేకూరనుంది.
ప్రపంచ కప్ షెడ్యూల్‌ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్‌లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాటిలో మూడు మ్యాచ్‌లు లీగ్ దశకు చెందినవి. ఒకటి సెమీ-ఫైనల్ మ్యాచ్. భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటే, ఈ టైటిల్ మ్యాచ్ కూడా ఈ స్టేడియంలోనే జరిగేది. ఈ మ్యాచ్‌లన్నీ ఇప్పుడు DY పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లను నిర్వహించడానికి సురక్షితం కాదని గుర్తించింది. అందుకే ఈ స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ICC తొలగించింది.
చిరు, బాలయ్య మల్టీస్టారర్ అప్పుడే.. అనిల్ రావిపూడి క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయన మొదటి షాట్ ను మానిటర్ లో చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఇందులో చిరంజీవి, వెంకటేశ్ గారిని చూపించే అవకాశాలు కలిగింది అంటూ తెలిపారు అనిల్. దీంతో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా ఎప్పుడు అని రిపోర్టర్లు ప్రశ్నించారు. అనిల్ స్పందిస్తూ.. ‘గతంలో చిరంజీవి గారు కూడా బాలకృష్ణతో నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. కానీ సరైన కథ దొరకాలి కదా. ఎందుకంటే ఇద్దరి స్టార్ డమ్ వేరే, మ్యానరిజం, ఫ్యాన్ బేస్ వేరే. ఇద్దరికి సరిపోయే కథ దొరికినప్పుడు కచ్చితంగా సినిమా తీస్తా. దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేశ్ తో చేసే అవకాశం దక్కింది అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. కుదిరితే ప్రతి ఏడాది సంక్రాంతికే తన సినిమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ సినిమాలో మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని తెలిపాడు. వింటేజ్ మెగాస్టార్ ను ఇందులో చూపించబోతున్నట్టు తెలిపాడు. చిరంజీవి ఎంతో కష్టపడి తన లుక్స్ ను మార్చుకున్నాడని.. అందుకు తగ్గట్టే మేం కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని తెలిపాడు.
ప్రెగ్నెంట్ టైంలో నన్ను చంపాలని చూశాడు.. హీరో ధర్మ మహేష్ బండారం బయటపెట్టిన భార్య గౌతమి
హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తనపై హానిచేయాలని ప్లాన్ చేశాడని, పిల్లాడు పుట్టిన తర్వాత తన కొడుకును కుటుంబంలో కలపకపోవడం, తన డబ్బు, హోటల్ లాభాలను మాత్రమే స్వాధీనం చేసుకోవడం, తనను బెడ్‌రూంలోకి రాకుండా చేయడం వంటి ఘోర చర్యలతో ఆమెను వేధిస్తున్నాడని ఆమె వెల్లడించారు. అదనంగా, బిగ్ బాస్ షోలో ఉన్న అమ్మాయిల వీడియోలను ఆమెకు పంపి శారీరక హింసకి ఉపయోగిస్తున్నాడని గౌతమి పేర్కొన్నారు. ఇవి తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, మహేష్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదని, తనకు మంత్రులు, ముఖ్యమంత్రులు తెలిసి ఉన్నట్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆమె చెప్పారు. అలాగే, తనను.. తన కుటుంబాన్ని తుపాకులతో కాల్చి చంపుతా అని కూడా బెదిరించాడు అని తెలిపింది.
బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు
టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ పసివాడు ఏం చేశాడు. నా కొడుకు మీద ఎందుకు కక్ష. మా భర్తకు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఆర్టిస్టులు తరచూ అతని ఫ్లాట్ కు వస్తుంటారు. వారందరి గురించి నేను అడిగితే నన్ను టార్చర్ చేస్తున్నాడు. తిరిగి నా మీదనే అఫైర్లు అంటగడుతున్నాడు అంటూ వాపోయింది.