డిప్యూటీ సీఎం అంశం… జనసేన కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం తీవ్ర వివాదంగా మారింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఇది పెను ముప్పుగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వినిపించాయి.. ఈ వ్యవహారంలో ముందుగానే అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ.. ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. టీడీపీ-జనసేన పోటీ పోటీ.. సోషల్ మీడియా పోస్టులకు కాస్త బ్రేక్ పడినట్టు అనిపించింది.. మరోవైపు.. జనసేన అధిష్టానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఆదేశాలను జనసేనా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ వాట్సాప్ స్టేట్‌గా పెట్టారు.. ఆ తర్వాత జనసేన గ్రూపుల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు టీడీపీ ఆదేశాలు ఇచ్చిన ఒక రోజు తర్వాత స్పందించింది జనసేన.. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నుంచి కూడా పలువురు స్పందిస్తుండడంతో.. నిన్న లోకేష్ డిప్యూటీ అంశం ఎవ్వరూ మాట్లాడవద్దని టీడీపీ ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంశం మాట్లాడినా స్పందించవద్దు అని జనసేన ఆదేశించింది.. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వ్యవహారంపై పోస్టులు పెడుతున్నారు.. అయితే, జనసేన ఆదేశాలతో ఇక డిప్యూటీ సీఎం అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ కూడా సాగుతోంది..
గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక చేయనున్నారు.. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఒక షాపుకి ఫీజు 2 లక్షల రూపాయల నాన్ – రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించారు.. ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది.. కానీ, ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. ఇక, రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..
కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అదే.. రైతులకు ప్రయోజనం..
రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు.. సిటిఆర్ఐ పరిధిలో మరో 4 పంటలను కలిపి ఉత్పత్తి పెంచాలి.. గోదావరి జిల్లాల్లో రైతులు సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సర్వనాశనం చేసింది గత ప్రభుత్వాలే అని దుయ్యబట్టారు శ్రీనివాస్ వర్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయింపు కంటి తుడుపు చర్యలు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని హితబోధ చేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే అనడం సబబు కాదన్నారు.. షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
అర్హులైన వారికి ఇంటి స్థలాలు.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు..
అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించాం. సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలు వైద్యం కోసం వెళ్లే PHC, CHC లకు మరిన్ని వసతులను కల్పిస్తున్నాం అన్నారు.. ఇక, వైఎస్‌ఆర్ వైసిపి పాలనలో వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలను మూల పడేసిందని విమర్శించారు. గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు.. అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని తెలిపారు. ఈ రోజు నుంచి మరో నాలుగు పథకాలు అందిస్తామని అన్నారు. అంతేకాకుండా… రేషన్ కార్డులకు సంబంధించి ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని పేర్కొ్న్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వబోతుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల పవర్‌లూమ్స్‌కు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. మొదటి దశలో 4.6 కోట్ల సెంటీమీటర్ల చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.. ఈ ఆర్డర్ ఫలితంగా ఎనిమిది నెలల పాటు పవర్ లూమ్స్ కార్మికులకు పని దొరుకుతుందని పేర్కొన్నారు. ఆర్డర్‌లోని 95 శాతం పనులు సిరిసిల్లలో 20 వేల పవర్‌లూమ్స్‌కే ఇచ్చామని వెల్లడించారు. కమిషన్లకు కక్కుర్తిపడి బతుకమ్మ చీరలు కిలోల చొప్పున సూరత్ నుంచి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెచ్చామని కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు.. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి నూలు డిపో తేలేక పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. న్యాయం కోసం తప్పలేదు
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో 149 ఎకరాల్లో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది.. 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే చిన్న ఉద్యోగులు ఈ లాండ్ కొనుగోలు చేశారని అన్నారు. 2006లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేసేందుకు చూశారు.. కానీ కోర్ట్ కూడా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ తప్పని డిస్మిస్ చేసిందని ఎంపీ ఈటల పేర్కొన్నారు. 2011లో మరోసారి కాజేసే ప్రయత్నం చేశారు.. కొంతమంది అధికారులతో కలిసి DPO సహకారంతో.. ధరణిని ఆసరాగా చేసుకుని మళ్ళీ లాండ్ కాజేసే యత్నం చేశారని ఈటల రాజేందర్ తెలిపారు. ప్లాట్ ఓనర్స్ ఇళ్లు కట్టుకుందామంటే అనుమతులు రావడం లేదు.. రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యంగా ప్లాట్స్ యజమానులను వేధిస్తున్నారని పేర్కొన్నారు.
మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే లక్ష్యంగా వరాలు
దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. అయితే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓట్లు రాబట్టేందుకు ఇప్పటికే తొలి విడత మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే పథకాలను ప్రకటించింది. తాజాగా మంగళవారం రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యార్థులు, యువత లక్ష్యంగా పలు ఆకర్షక పథకాలను వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ మేనిఫెస్టో వివరాలు వెల్లడించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జల్ జీవన్ మిషన్‌ను అమలు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఠాకూర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాలు, సంక్షేమాన్ని మెరుగుపరచడానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యువతకు పోటీ పరీక్షల కోసం రూ.15,000 ఆర్థిక సహాయం, రెండుసార్లు ఉచితంగా ప్రయాణించేందుకు, దరఖాస్తు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ఠాకూర్ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రెండు సార్లు రూ. 15,000 ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే భీమ్‌రావ్ అంబేద్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐలు, పాలిటెక్నిక్ స్కిల్ సెంటర్లలో టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని వెల్లడంచారు.
యూపీలో ఎన్‌కౌంటర్.. నలుగురు దుండగులు హతం
ఉత్తరప్రదేశ్ పోలీసులు.. నేరగాళ్ల అంతుచూశారు. దుండగుల భరతం పట్టారు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు క్రిమినల్స్ హతమయ్యారు. ఈ ఘటనలో ఒక పోలీస్ గాయపడ్డారు. ముస్తఫా కగ్గా ముఠా సభ్యుడు అర్షద్‌తో పాటు మరో ముగ్గురు మంజీత్, సతీష్, ఒక గుర్తు తెలియని సహచరుడు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. యూపీలో యోగి ప్రభుత్వం నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మంగళవారం షామ్లి జిల్లాలోని జింఝానా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగరు దుండగులు హతమయ్యారు. ఒక ఇన్‌స్పెక్టర్ కూడా గాయపడ్డాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
“బర్త్ రైట్ పౌరసత్వం” రద్దు.. ఇండియన్స్‌కి ట్రంప్ బిగ్ షాక్.. ప్రభావం ఎంత..?
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. అక్రమ వలసల్ని అడ్డుకుంటానని చెప్పిన ట్రంప్, బర్త్ రైట్ పౌరసత్వాన్ని కూడా నిలిపేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. తొలి రోజే ఈ రెండు ఆర్డర్స్‌ని పాస్ చేశాడు. బర్త్ రైట్ పౌరసత్వం అంటే.. అమెరికా సార్వభౌమాధికారం కలిగిన ప్రాంతంలో పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభించే విధానం. ఈ విధానంలో పిల్లాడి తల్లిదండ్రులు అమెరికన్లు కాకుండా విదేశీయులు అయినప్పటికీ, బిడ్డ అమెరికాలో పుట్టిన కారణంగా అతడిని అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తుంది. ఈ నిబంధన 1868లో అమలులోకి వచ్చింది మరియు USలో జన్మించిన వారందరికీ పౌరసత్వాన్ని విస్తరించడానికి రూపొందించబడింది. ఈ విధానాన్నే ప్రస్తుతం ట్రంప్ రద్దు చేశారు. జన్మహక్కు పౌరసత్వం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో నల్లజాతీయులను బానిసలుగా చేసే పద్ధతిని అడ్డుకునేందుకు, అమెరికన్ అంతర్యుద్ధం ముగిసిన మూడు ఏళ్ల తర్వాత 1868లో ఆమోదించిన రాజ్యాంగంలోని 14వ సవరణ నుంచి వచ్చింది.
మార్కెట్‌పై ట్రంప్ ఆశలు గల్లంతు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు. కానీ ట్రంప్ ప్రభావం ఏ మాత్రం చూపించకపోగా.. భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1, 235 పాయింట్లు నష్టపోయి 75, 838 దగ్గర ముగియగా.. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23, 024 పాయింట్లు దగ్గర ముగిసింది. నిఫ్టీలో ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం అత్యధికంగా నష్టపోగా.. అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు రియాలిటీ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం క్షీణించగా, బ్యాంక్, విద్యుత్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 2 శాతం క్షీణించాయి.
విశ్వక్ “లైలా” నుంచి రెండో సాంగ్ వచ్చేస్తోంది
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ప్రతీ సినిమాతో ఏదొక యునిక్ పాయింట్ తో అలరించే ప్రయత్నం తాను చేస్తుంటాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలను రిలీజ్ చేశాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా ప్రకటించాడు విశ్వక్. ఈ సినిమా విశ్వక్ మొదటిసారి లేడీ గెట్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందట అనౌన్స్ చేసాడు. మెకానిక్ రాకీ రిలీజ్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా అయిపోవడంతో లైలా సినిమా పై దృష్టిపెట్టాడు. లైలా సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నాడు. దీనితో ఈ పాయింట్ పై మంచి బజ్ ఉంది.
రవితేజ మాస్ జాతర టీజర్ కు డేట్ ఫిక్స్ ?
విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా ఇపుడు ఓ సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. దీనితో ఈ రానున్న జనవరి 26 రవితేజ పుట్టిన రోజు కానుకగా టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తుంది.