వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు.. తల్లికి వందనం మేలో ఇస్తా.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం.. ఇక, నుంచి నాలుగు నెలలకి ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాం.. మే, జూన్ లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 20 వేలు ఇస్తామని వెల్లడించారు..
పవన్ కల్యాణ్‌పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిపాలన చేసే సత్తా లేదని ఒక పెద్ద మనిషి చెప్తున్నారని అన్నారంటూ సెటైర్లు వేశారు.. రాజమండ్రి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకు వెళ్ళచ్చు కదా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఆ పని కూడా చేయలేదని విమర్శించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని అంజలిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల. హాస్పిటల్ కి విచ్చేసి అంజలి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.. బాధితురాలు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక, ఈ సందర్భంగా వరుడు కళ్యాణి, యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన దీపక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కేసు పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కోరారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలే ప్రమాదకరమైన ఇంజెక్షన్ తీసుకుందా..? లేక ఎవరైనా ఇచ్చారో.. బయట పెట్టాలని, అంజలి విషయంలో అనుమానాలు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఆరోగ్యం విషయమై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోషులకు కఠిన శిక్షలు పడట్లేదని విమర్శించారు. ప్రతి గంటకు ముగ్గురు మహిళలు అఘాయిత్యానికి గురవుతున్నారని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆరోపించారు.. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల.
కాకాణి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..!
తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు కోర్టులో మెమో ఫైల్ చేసింది.. అయితే, హైదరాబాద్ లో ఉన్న కారణంగా పోలీసు విచారణకు హాజరు కాలేకపోయారని కాకాణి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.. అయితే, పోలీసులు రెండో నోటీసులు జారీ చేసిన.. వరుసగా రెండో రోజూ కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం.. మరోవైపు.. కేసు క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కాకాణిపై తొందరు పాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది ఏపీ హైకోర్టు.. పొదులుకూరు పోలిసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. విచారణ జరిపి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం.. వివరాలు సమర్పించాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..
కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ కేవైసీ నమోదు పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెడతాం అన్నారు.. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తాం అన్నారు మంత్రి మనోహర్.. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కార్డ్‌లో ఉంటాయన్నారు.. రేషన్ కార్డు అని కాకుండా ఫ్యామిలి కార్డుగా ఉంటుందన్నారు.. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్‌గా రేషన్ కార్డు ఉంటుందని వెల్లడించారు.. ఇక, ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు ఎప్పుడు లేని విధంగా కొనుగోలు చేశామన్నారు మనోహర్.. రైతుకు భరోసా కల్పించేలా 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ అయింది. రైతులకు ఏ మిల్లు కు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యం అమ్ముకునే అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వం కన్నా 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాలో 65 వేల మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం.. వెహికల్స్ సీజ్ చెయ్యమని కూడా చెప్పాం… గతంలో ఎప్పుడు లేని విధంగా సీజ్ చేశామని.. మిల్లర్ అసోసియేషన్ తో కూడా సమావేశాలు పెట్టామన్నారు.. కాకినాడలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం.. ఎప్పటికప్పుడు చెకింగ్ జరుగుతోందని.. దీపం 2 పథకం గత దీపావళి రోజు ప్రారంభం అయ్యింది.. దీపం పథకాన్ని మొదటి దశలో 99 లక్షలకు పైగా వినియోగించుకున్నారు.. ఇవాళ్టి నుంచి దీపం పథకం రెండో విడత ప్రారంభం అవుతుందన్నారు.. ఈ కేవైసీ నమోదు తప్పనిసరి.. క్యూలో నిలుచునే అవసరం లేకుండా ఈ పాస్ నుంచి కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు.. కోటి మందికి పైగా దీపం పథకం లబ్ధిదారులు అవుతారని భావిస్తున్నాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. స్కూళ్లు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్..
సెంటు భూమి ఇవ్వని బీజేపీ దొంగనాటకాలు ఆడుతుంది
ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పక్కన ఉన్న సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పోరాటం చేసి సాధించారని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, న్యాయపరమైన మార్గంలోనే భూమిని రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ఈ భూమిని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
‘‘మోడీ తర్వాత ప్రధాని యోగి ఆదిత్య నాథ్.?’’ ఆయన ఏమన్నారంటే..
బీజేపీలో 75 ఏళ్ల వయో పరిమితి పదవులకు అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్‌లో రిటైర్ అవబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ వాదనలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను యోగి తోసిపుచ్చారు. ఒక వేళ విభేదాలే ఉంటే యూపీ సీఎంగా ఇన్నాళ్లు ఉండేవాడిని కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భవిష్యత్ ప్రధాన మంత్రి అనే వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు తన పూర్తికాల ఉద్యోగం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను యూపీ సీఎంని, పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం ఇక్కడ ఉంచింది. రాజకీయాలు నాకు పూర్తికాల ఉద్యోగం కాదు. ప్రస్తుతం మేము యూపీలో పని చేస్తున్నాము, కానీ వాస్తవానికి నేను ఒక యోగిని’’ అని ఆయన అన్నారు.
‘‘బంగ్లాదేశ్‌ని విచ్ఛిన్నం చేయడమే మంచిది’’.. యూనస్‌పై ఈశాన్య నేతలు ఫైర్..
బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ‘‘ఈశాన్య రాష్ట్రాల’’ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చైనాను బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూనే, భారతదేశానికి చెందిన ఏడు సిస్టర్ స్టేట్స్(ఈశాన్య రాష్ట్రాలు) ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, వాటికి సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ సముద్రానికి రక్షకుడిగా ఉంటుందని వ్యాఖ్యానించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ పెట్టుబడులకు, ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, మహ్మద్ యూనస్ భారత్ ప్రధాన భూభాగాలను, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ‘‘సిలిగురి కారిడార్’’ లేదా ‘‘చికెన్స్ నెక్’’ దుర్భలత్వాన్ని గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అభినయ వాచస్పతి’ సాయి కుమార్
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటనకు, గంభీరమైన డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైన ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ ఇండస్ట్రీలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అర్హతను గుర్తించిన పూణెలోని ప్రతిష్ఠాత్మక ఆంధ్ర సంఘం, ఆయనను ఘనంగా సత్కరించి గౌరవప్రదమైన క్షణాలను అందించింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కుమార్‌తో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్‌ను ‘అభినయ వాచస్పతి’ అవార్డుతో సత్కరించారు, ఇది ఆయన కళాసేవకు అర్పితమైన ఒక అమూల్య గుర్తింపు. ఈ గౌరవం గురించి మాట్లాడుతూ సాయి కుమార్, “ఆంధ్ర సంఘం లాంటి చారిత్రక సంస్థ నన్ను ఇలా సత్కరించడం ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది. ఈ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి,” అని ఉద్వేగభరితంగా అన్నారు. సాయి కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు గడిచినా, ఆయన కళాప్రస్థానంలో ఉత్సాహం, నటనా నైపుణ్యం ఏమాత్రం తగ్గలేదు. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘సరిపోదా శనివారం’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు కేవలం నటన కాదు, ఒక శక్తివంతమైన అనుభూతిని పంచాయి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లోనూ ఆయన తన నటనా ప్రతిభను చాటుతూ, బహుభాషా నటుడిగా దూసుకుపోతున్నారు.
నాగవంశీ కోపానికి ‘అసలు’ కారణమిదే!
నాగ వంశీ, తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉన్న వ్యక్తి, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాగ వంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే, ఒక వర్గం మీడియాని తూర్పారపట్టాడు. సినిమా రివ్యూ ఇవ్వడం ఆ వ్యక్తి సొంత అభిప్రాయం. ఎలక్షన్ లాగా ఒక పదివేల మంది అభిప్రాయం లేక మరొకటో కాదు, అతని మూడ్‌ని బట్టి, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రేటింగ్, రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఒక సందర్భంలో భార్య తిట్టినా కూడా ఆ కోపంతో సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు నాకు తెలుసు అంటూ ఆయన రివ్యూ రైటర్ల గురించి కామెంట్స్ చేశాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, రివ్యూ నెగిటివ్‌గా ఇవ్వడంలో తప్పులేదు కానీ, ఆ నెగిటివ్ ఇచ్చిన రివ్యూను ఇంకా సమర్థించుకోవడం కోసం “వేరే సినిమాలు బాలేదు కాబట్టి మాడ్ స్క్వేర్ ఆడుతోంది, మాడ్ స్క్వేర్‌కి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ వంశీ చెప్పినట్టుగా భారీ కలెక్షన్స్ రావడం లేదు” అంటూ ఇంకా నెగిటివ్ ప్రొపగాండా చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యాడు. అంతేకాక, “వీళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు, యాడ్స్ వంటివి ఇస్తూ మేము వారిని పోషిస్తుంటే, వారు మాత్రం ఇంకా విషం కక్కుతున్నారని” అర్థం వచ్చేలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కచ్చితంగా సినిమాని చంపేసే ప్రయత్నం అని ఆయన చెప్పవచ్చు. ఒకపక్క కలెక్షన్స్ కనిపిస్తున్నా సరే, “ఎందుకు ఈ సినిమా హిట్ అని ఒప్పుకోవడం లేదు?” అని ఆయన అన్నారు. “తాను ఇంటర్వ్యూస్ ఇచ్చి, యాడ్స్ ఇస్తేనే మీ వెబ్‌సైట్స్ నడిపిస్తున్నాయి. మా మీద బతికే మీరు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మీదట తమను బ్యాన్ చేయాలని కోరాడు. “మా సినిమాల గురించి వార్తలు గానీ, మా సినిమాల రివ్యూలు గానీ రాయకండి” అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. కళ్ల ముందు కనిపిస్తున్న సరే కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆయన ఫైర్ అయ్యాడు.