విజయసాయి రెడ్డికి షాక్..! మరోసారి సీఐడీ నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు.. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. మార్చి 12వ తేదీన అంటే.. ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి.. ఆ నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (b), రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించింది సీఐడీ… కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే, కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయ సాయిరెడ్డిపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కాకినాడ సీ పోర్టు షేర్ల వ్యవహారంలో మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీఐడీ.. ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు..
సీఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్ష.. ప్రధాని మోడీ పర్యటనపై చర్చ..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. దానికి కేబినెట్ సమావేశ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఇవాళ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన.. రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సీఎం ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన ముహూర్తం ఖరారు చేయడంతో పాటు.. రాజధాని శంఖుస్థాపన అనే అంశం కాకుండా నిర్మాణ పనులు ప్రారంభం అని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. రాజధాని పనుల రీ లాంచ్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచే ప్రతిపాదనలపై కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది..
థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? పోసానిని ప్రశ్నించిన జడ్జి
థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు జడ్జి.. విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించగా.. జడ్జి ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోసాని.. థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు, లాయర్ల సమక్షంలోనే విచారణ జరిగిందని తెలిపారు.. ఇక, గుంటూరు కోర్టులో విచారణ ముగిసిన తర్వాత.. గుంటూరు సబ్ జైల్‌కు పోసాని కృష్ణమురళిని తరలించారు పోలీసులు.. కాగా, పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు ప్రశ్నించారు.. నాలుగు గంటలపాటు పోసానిని విచారించారు పోలీసులు.. విచారణలో అనేక అంశాలపై పోసాని ప్రశ్నించారు.. అయితే, సమయం సరిపోకపోవడంతో మరోసారి పోలీసుల విచారణకు అడిగే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు, పోసాని కృష్ణమురళి పై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.. అయితే, సీఐడీ పోలీసుల విచారణ అనంతరం మరో సారి గుంటూరు జీజీహెచ్‌కు పోసాని కృష్ణ మురళిని తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించారు.. వైద్య పరీక్షలు అనంతరం పోసానిని గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు సీఐడీ పోలీసులు..
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసులో ఏప్రిల్ 1 వరకు రిమాండ్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు.. కాగా, కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్‌పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.. విజయవాడ సబ్‌జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని.. గన్నవరం తరలించిన ఆత్మకూరు పోలీసులు.. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపరిచారు.. అయితే, ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు.. అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకు వంశీని తరలించారు పోలీసులు.. ఇప్పటికే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీకి.. తాజా రిమాండ్‌తో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. అంటే.. రిమాండ్‌లో ఉండగానే.. మరో రిమాండ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది..
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్ రియాక్షన్!
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ.. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మనం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు అప్పట్లో సుప్రీం నోటీసులు ఇచ్చింది.. దాంతో మనం సీనియర్ అడ్వకేట్ నీ పెట్టాం. వర్గీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పాం.. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే మేము స్పందించాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం వేసి ప్రక్రియ మొదలు పెట్టాం.. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. పారదర్శకంగా ఎవరికి అన్యాయం జరగకూడదు.. అనుమానం ఉండొద్దని కమిషన్ సూచన చేసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది..
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ.. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరా గాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు అని ఆరోపించింది. ఇక విపి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు.. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదు అని పేర్కొన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని వాదించారు.. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించింది.. కానీ, ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చింది.
సినీ నటులైనా వాళ్ళను వదలం!
బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు. సినీ నటులు, టీవీ యాంకర్లు ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, “ఎవరు ఏ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నాం. సినీ నటులు, యాంకర్లు ఇలాంటి ప్రచారాల్లో పాల్గొనడం వల్ల బెట్టింగ్ ఆడిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నాం. ఈ కార్యకలాపాల్లో భాగమైన వారందరినీ విచారణకు పిలిచి, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపకుండా, ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. “బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసిన వారిని ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సమాజంలో బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, టీవీ వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో భాగమైనట్లు తెలుస్తోంది. వీరి ప్రమోషన్‌ల వల్ల యువత బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారని, దీనివల్ల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నమోదైన 11 మంది మీద కేసులతో పాటు, మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని వెస్ట్‌జోన్ డీసీపీ మరోసారి హెచ్చరించారు.
సునీతా విలియమ్స్‌కి ప్రధాని మోడీ లేఖ.. ఏమన్నారంటే..
దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాజాగా, వీరిద్దరు నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 ద్వారా ఐఎస్ఎస్ నుంచి భూమి మీకు వచ్చేందుకు 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మేరకు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి ప్రధాని నరేంద్రమోడీ లేఖ రాశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రధాని లేఖను పంచుకున్నారు. ఈ లేఖని మార్చి 1న ప్రధాని మోడీ రాశారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్‌ని కలిసినప్పుడు సునీతా విలియమ్స్ శ్రేయస్సు గురించి విచారించినట్లు ప్రధాని చెప్పారు. ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన మీటింగ్‌లో కూడా ప్రస్తావన వచ్చినట్లు లేఖలో మోడీ గుర్తు చేసుకున్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ప్రభుత్వ అధిపతి, ఉన్నతాధికారులు మృతి..
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత రెండు నెలల కాల్పుల విరమణను దెబ్బతీసిన విషయం తెలిసిందే. హమాస్ బందీలను విడుదల చేయడానికి నిరాకరించడం, కాల్పుల విరమణ ప్రతిపాదనలను తిరస్కరించడం ద్వారా ఇజ్రాయెల్ దళాలు సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో చేరారు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని చూపుడు వేలుకు గాయమైంది. దీంతో.. క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌కు దూరమవుతాడని భావించినప్పటికీ.. గత నెలలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో తన జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ వారి అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో.. శాంసన్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వద్ద ప్రాక్టీస్ కోసం జట్టుతో చేరినట్లు కనిపించాడు. 2024లో టీ20 మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన సంజు శాంసన్.. 13 మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 436 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై మూడు సెంచరీలు చేశాడు. అయితే.. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని ఫామ్ కాస్త పడిపోయింది. 10.20 సగటుతో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 51 పరుగులు చేశాడు. సంజు శాంసన్ గత కొన్ని సంవత్సరాలుగా రాజస్థాన్ రాయల్స్ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో అతను జట్టులో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 15 ఇన్నింగ్స్‌లలో 48.27 సగటుతో 531 పరుగులు, 153.46 స్ట్రైక్ రేట్‌తో 5 హాఫ్ సెంచరీలతో 86 పరుగుల అత్యుత్తమ స్కోరు సాధించాడు.
క్రికెట్ చరిత్రలో మార్చి 18 ‘స్పెషల్ డే’.. పాకిస్తాన్‌కు మాత్రం..!
మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. సచిన్ టెండూల్కర్ మార్చి 18, 2012న తన చివరి వన్డే ఆడాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే 2015లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ చివరి వన్డేలు ఆడారు. ఈ ముగ్గురు క్రికెటర్లు 45,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. మార్చి 18 టీమిండియాకు ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే 2018లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ ఆ రోజు జరిగింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. ఈ టోర్నమెంట్ శ్రీలంక స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించారు.
గేమ్ ఛేంజర్ సాంగ్స్ ఫెయిల్యూర్ కు వాళ్లే కారణం.. తమన్ సెన్సేషన్
గేమ్ ఛేంజర్ పాటల మీద తమన్ సంచలన కామెంట్లు చేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ భారీ సినిమాలో సాంగ్స్ కోసం వేసిన సెట్స్ బాగా హైలెట్ అయ్యాయి. కేవలం పాటల కోసమే రూ.70 కోట్ల దాకా ఖర్చు చేశామంటూ దిల్ రాజు పదే పదే చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ అనుకున్న స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాటల ఫెయిల్యూర్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘చాలా మంది గేమ్ ఛేంజర్ పాటల ఫెయిల్యూర్ కు నాదే కారణం అనుకుంటున్నారు. కానీ అసలు కారణం నేను కాదు. ఎందుకంటే ఈ సాంగ్స్ లో ఒక్క హుక్ స్టెప్ కూడా లేదు. ఒక పాటకు తగ్గట్టు అందులో ఆకట్టుకునే స్టెప్పులు ఉన్నప్పుడే అది బాగా వైరల్ అవుతుంది. గతంలో నేను సాంగ్స్ చేసిన చాలా సినిమాల్లో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అందుకే అవి బాగా వైరల్ అయ్యాయి. అల వైకుంఠపురంలో పాటలు బాగా హిట్ అవ్వడానికి మ్యూజిక్ తో పాటు హుక్ స్టెప్స్ కారణం. కానీ గేమ్ ఛేంజర్ లో అది మిస్ అయింది. నేను మ్యూజిక్ ద్వారా ప్రతి పాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ తీసుకురాగలను. కానీ అంతకు మించి ఆడాలంటే అదిరిపోయే స్టెప్పులు ఉండాలి. ఆ స్టెప్పు మీద సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు వస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అది కొరియోగ్రాఫర్ మీదనే ఆధారపడి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. ఇంతకీ తమన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశాడా అని అంతా ఆరా తీస్తున్నారు.
చైతు ఙ్ఞాపకాలు చెరిపేస్తున్న సమంత?
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు మూడేళ్లు గడిచాయి. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, వారి వ్యక్తిగత జీవితాలపై అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంది. తాజాగా సమంత నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే, సమంత తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు గతాన్ని వదిలేసే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె గతంలో చైతన్యతో సంబంధం ఉన్న వస్తువులను, గుర్తులను ఒక్కొక్కటిగా మార్చుకుంటూ, తొలగిస్తూ వస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంగేజ్మెంట్ రింగ్‌లోని డైమండ్‌ను తీసి, దాన్ని లాకెట్‌గా మార్చుకున్న సమంత, ఈసారి మరో అడుగు ముందుకేసింది. నాగచైతన్యతో కలిసి వేయించుకున్న టాటూను తాజాగా తొలగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా బయటపడింది. ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు, నెటిజన్లు దీనిపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. సమంత శరీరంపై ఉన్న టాటూ, ఆమెకు చైతన్యతో ఉన్న సాన్నిహిత్యానికి గుర్తుగా భావించేవారు. దాన్ని తొలగించడం ద్వారా ఆమె ఆ సంబంధాన్ని పూర్తిగా మరచిపోవాలని నిశ్చయించుకున్నట్లు అనిపిస్తోంది. సమంత గత కొంత కాలంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే, తన కెరీర్‌ను బలంగా ముందుకు తీసుకెళ్తోంది. సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడితో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
యానిమల్ ‘ధోనీ’ వెర్షన్.. భలే సెట్ అయిందే!
ఐపీఎల్ 18వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ దీనికి ముందే, ఎంఎస్ ధోని లోపల ఉన్న ‘యానిమల్’ మేల్కొంది. అదేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఇటీవల ధోని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక ఫన్నీ యాడ్ చేశాడు, అందులో ధోనీ రణబీర్ కపూర్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఈ ప్రకటనలో ధోని – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి కనిపిస్తున్నారు. ఈ ప్రకటన ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ EMotorad కోసం షూట్ చేశారు. ఈ యాడ్ లో ధోని రణబీర్ రణవిజయ్ సింగ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మొత్తం ఎలక్ట్రిక్ సైకిల్ యాడ్ లో, ధోని ‘యానిమల్’ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్ తన కారు నుంచి ప్రమాదకరమైన రీతిలో దిగి తన స్నేహితులతో కలిసి రోడ్డు దాటుతున్న దృశ్యం షూట్ చేశారు. కానీ తమాషా ఏమిటంటే ఈ ప్రకటనలో ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌తో రోడ్డు దాటుతున్నట్లు చూపించారు. ఇక ఈ యాడ్ లో వంగా, ధోనీ మధ్య సంభాషణ కూడా ఉంది. ఇక ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో తన 18వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ధోని త్వరలో తన జట్టు CSK తో మైదానంలోకి దిగబోతున్నాడు. వారి తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో జరగనుంది.