టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.. ఇక, ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ మానిటరింగ్ చేస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశాం.. భక్తుల సౌకర్యార్థం అదనంగా 8 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. కర్నాటక రాష్ర్టం బెల్గాంలో ఏడు ఏకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం లభించింది.. గుంటూరు జిల్లా తుల్లురు మండలం అనంతవరం గ్రామంలో ఆలయ అభివృద్ధి పనులకు 7.2 కోట్ల రూపాయలు కేటాయించింది టీటీడీ.. గుంటూరు జిల్లా ఖాజా గ్రామంలో దాతలు ఇచ్చిన 89 లక్షల విలువైన స్థలం స్వీకరణకు ఆమోదం తెలిపింది పాలకమండలి.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దళితవాడలో వెయ్యి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు..
వివేకా కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్‌లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.. అయితే, ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫైనల్ ఛార్జిషీట్ ఫైల్ చేసింది… నిందితుల బెయిల్ రద్దు విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. అయితే, తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్‌కు సూచించింది సుప్రీంకోర్టు. ఇక, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు.. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అన్నారు. వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై స్పందిస్తూ. మీరు బస్ మిస్సయ్యారు.. ఛార్జిషీట్ ఇప్పటికే దాఖలైంది.. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలను ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది.. కోర్టులో ఇలాగే అప్లికేషన్స్ వేస్తూ వెళ్తే.. ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్ద సమయం పడుతుందన్నారు.. ఈ దశలో మేం చేసేది ఏముంది ?.. నిందితులపై ఇప్పటికే హత్యా నేరారోపణలు నమోదు చేశారు కదా? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
‘విజయవాడ ఉత్సవ్’కు హైకోర్టు షాక్..!
ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు విజయవాడ ఉత్సవ్ పేరుతో కృష్ణానది తీరంలో భారీ ఈవెంట్స్, ఎగ్జిబిషన్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా.. నిర్వహకులకు షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది.. అయితే, ఈ భూములను ఇప్పటికే 56 రోజుల పాటు లీజుకు ఇచ్చింది దేవాదాయశాఖ.. ఇక, లీజు మొత్తాన్ని కూడా గొడుగుపేట దేవస్థానానికి ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెల్లించారు.. కానీ, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. కాగా, సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కృష్ణా నది తీరంతో పాటుగా నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. మరోవైపు, కృష్ణానదిలో పడవల పోటీలు, డ్రోన్ షో, ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.. దేవీ నవరాత్రుల సందర్భంగా బెజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలిరానుంగా.. వారిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పుడు హైకోర్టు వారికి షాక్ ఇచ్చినట్టు అయ్యింది..
రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. కలెక్టర్లకు దిశానిర్దేశం.
రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం అనేది ఓ అరుదైన జాతి వృక్షంగా పేర్కొన్నారు.. ఇక, మోటారు వాహనాల పన్నులపై కలెక్టర్లు దృష్టి సారించాలి.. మున్సిపల్ విభాగం శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించేలా ప్రక్రియ చేపట్టాలి.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి.. కొత్త లేఔట్లలో డ్రైన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు..
అర్ధరాత్రి నుండి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. డిమాండ్స్ ఇలా!
తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి (సెప్టెంబర్ 16) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్ వదిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక ఆసుపత్రుల ప్రధాన డిమాండ్లు చూస్తే.. ఆసుపత్రులకు సంబంధించిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే ఆరోగ్యశ్రీ సేవల బిల్లులను 40 రోజుల్లోగా చెల్లించాలని కోరారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కోర్ కమిటీలో వైద్యులను చేర్చాలని.. తద్వారా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా చర్చించి పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించే అవకాశం లేదని డాక్టర్ రాకేష్ తేల్చి చెప్పారు. ఈ పరిణామం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కేరళలో దారుణం.. గే డేటింగ్ యాప్‌లో పరిచమైన బాలుడిపై 14 మంది అత్యాచారం..
కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్‌లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది. కాసర్ గోడ్ పోలీస్ చీఫ్ విజయ భరత్ రెడ్డి ఈ సంఘటన గురించి మీడియాకు వెల్లడించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 2 ఏళ్లుగా ఈ అఘాయిత్యం జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గే డేటింగ్ యాప్‌ను బాలుడు డౌన్‌లోడ్ చేసున్నట్లు తెలుస్తోందని, కాసర్ గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం లోని 14 మంది వ్యక్తులు రెండుళ్లుగా అతడిపై లైంగిక దాడి చేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ..
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ లో తీవ్రమైన వరదలు, ఖతార్ పై ఇజ్రాయిల్ దాడి మొదలైన అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తతు కూడా ఈ సమావేశంలో పరిష్కరించబడుతాయని నివేదిక తెలిపింది. అయితే, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐసీసీ), వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే ఆసిమ్ మునీర్ రెండు సార్లు అమెరికాలో పర్యటించారు. దీని తర్వాత, పాక్ ప్రధాని భేటీపై వార్తలు వచ్చాయి.
లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా! అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుంది..
నేపాల్ నిరసనల నుంచి ప్రపంచం దృష్టి ఒక్కసారిగా లండన్ వైపు మళ్లింది. ఎందుకంటే ఇటీవల లండన్ వీధుల్లోకి వేలాది మంది బ్రిటన్ పౌరులు వచ్చి నిరసనలు తెలపడం దీనికి కారణం. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుందని ఆందోళనగా చూస్తున్నాయి. లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా.. ఎందుకని అక్కడి పౌరులు లెబనాన్‌తో బ్రిటన్‌ను పోల్చుతున్నారు.. ఇంతకీ బ్రిటన్ నిరసనలకు అసలు కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. నేడు బ్రిటన్ తెలియని భయం నీడలో జీవిస్తోంది. అక్కడి స్థానికులు బానిసలుగా మారడానికి భయపడుతున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వలసదారుల సంఖ్య తమ స్వేచ్ఛను హరిస్తోందని బ్రిటన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా లక్షలాది మంది బ్రిటన్ పౌరులు లండన్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పెరుగుతున్న వలసదారుల సంఖ్యకు వ్యతిరేకంగా లండన్ వీధుల్లో యునైట్ ది కింగ్‌డమ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ఆగ్రహానికి కారణం బ్రిటన్‌లో స్థానిక పౌరుల సంఖ్య తగ్గడమే అని పలు నివేదికలు చెబుతున్నాయి. పలు నివేదిక ప్రకారం.. ప్రస్తుతం బ్రిటన్ జనాభాలో 73 శాతం మంది స్థానిక బ్రిటిష్ పౌరులు ఉన్నారు. వీరు 2050 నాటికి 57 శాతానికి తగ్గనున్నారు. ఈ నివేదికల ప్రకారం 2063 నాటికి బ్రిటన్ స్థానికులు తమ సొంత దేశంలో మైనారిటీ కానున్నారు. ఎందుకంటే అప్పుడు వారి జనాభా 50% కంటే తక్కువగా ఉంటుంది. నేడు బ్రిటన్ లెబనాన్ లాంటి పరిస్థితిని తమ దేశంలో వస్తుందని భయపడుతుంది. లెబనాన్‌లో ఒకప్పుడు క్రైస్తవులు మెజారిటీగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్లు తమ సొంత దేశంలో మైనారిటీగా మారారు. ఈ పశ్చిమాసియా దేశంలో ఇప్పుడు..
Royal Enfield లవర్స్‌కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బైకుల ధరలు..!
భారత ప్రభుత్వం జీఎస్టీ నిబంధనలను సవరించిన తర్వాత, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ మోడళ్ల ధరలను సవరించింది. ఈ సవరణల ప్రకారం.. 350cc మోడళ్ల ధరలు తగ్గినప్పటికీ.. 450cc, 650cc బైక్‌ల ధరలు పెరిగాయి. కొన్ని మోడళ్ల ధరలు రూ. 29,500 వరకు పెరిగాయి. జీఎస్టీ సవరణ తర్వాత 440cc, 450cc, 650cc బైక్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 440cc విభాగంలో ఉన్న ఏకైక మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440. దీని ధర రూ. 15,641 వరకు పెరిగింది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 2,23,131 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 2,30,641 (ఎక్స్-షోరూమ్)కు పెరిగింది. జీఎస్టీ మార్పుల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ధర రూ. 21,682 పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 3,05,736 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. గెరిల్లా 450 ధరలు రూ. 18,479 వరకు పెరిగాయి. దీని ప్రారంభ ధర రూ. 2,56,387 (ఎక్స్-షోరూమ్) కాగా, ఎల్లో రిబ్బన్, బ్రావా బ్లూ వేరియంట్ల ధర రూ. 2,72,479 వరకు చేరింది.
రాహల్ గాంధీపై షాహీద్ అఫ్రిది ప్రశంసలు, మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇది జరగాల్సిందే అని భారత ప్రజలు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్ మీద ఎప్పుడూ పడిఏడ్చే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడంపై స్పందించారు. భారత్‌ను విమర్శించారు. ఇదిలా ఉంటే, షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూ, మోడీ ప్రభుత్వాన్ని ‘‘హిందూ – ముస్లిం కార్డు ప్లే చేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ మోడీ ప్రభుత్వం మతం కార్డును ప్లే చేస్తోంది. అధికారంలోకి రావడానికి హిందూ-ముస్లిం కార్డు ప్లే చేస్తోందని నేను పదే పదే చెబుతున్నాను. ఇది చాలా చెడు మనస్తత్వం’’ అని ఆరోపించారు.
జై షాకు భయపడ్డ పాకిస్తాన్.. ఐసీసీ ఆంక్షలు విధిస్తుందని పీసీబీ యూ-టర్న్.!
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాక్ మాజీ క్రికెటర్లు, భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ అవమానంతో పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి వైదొలగుతామని బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ ఆలోచనపై యూ-టర్న్ తీసుకుంది. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే, అందుకు ఐసీసీ ఒప్పుకోలేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడంలో రిఫరీ కీలకంగా వ్యవహరించారని పాకిస్తాన్ కీలక ఆరోపణ. ఆయనను తొలగించకుంటే యూఏఈతో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఐసీసీ పాక్ బెదిరింపుల్ని కనీసం పట్టించుకోలేదు.
అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్!
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ అన్ని టెరిటరీల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. నిన్నటికే ఈ మైలురాయిని చేరుకున్న ఈ సినిమా, సోమవారం కూడా బలమైన ప్రదర్శన కనబరిచి, ఈరోజు కూడా అదే మొమెంటమ్‌ను కొనసాగిస్తోంది. దీంతో ఈ చిత్రం నిర్మాత సాహు గారపాటి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు విజయవంతమైన ప్రాజెక్టుగా మారింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి స్థిరమైన కలెక్షన్లు సాధిస్తున్న ‘కిష్కింధపురి’, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో ముందుకు సాగుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో, ఈ చిత్రం మేజర్ మైలుస్టోన్ల వైపు దూసుకుపోతోంది. థియేటర్లలో ఇంకా మంచి ఆక్యుపెన్సీ నమోదవుతుండటం విశేషం. ఈ సినిమా నిర్మాణంలో సాహు గారపాటి భారీగా పెట్టుబడి పెట్టారు. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఈ విజయం వారికి మరిన్ని అవకాశాలు తెరిచి పెట్టనుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా, ‘కిష్కింధపురి’ ఈ సీజన్‌లో ఒక సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలిచింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.