వైసీపీపై మంత్రి సత్యకుమార్ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్.. వెళ్లిన ప్రతీసారీ దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి… కొట్లాటలు, రాళ్ల దాడులు చేయడం, వికృతమైన భాష వాడటం.. లేదంటే కార్యకర్తలను కార్లతో తొక్కించి చంపేయడం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు..
ఎంపీ మిథున్‌రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, గతంలో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే తిరస్కరించిందని.. అలాగే దాని అనంతరం దర్యాప్తులో స్పష్టత ఏర్పడిందని గతంలో సిట్ వాదనలు వినిపించిన విషయం విదితమే.. వీటితోపాటు మద్యం అక్రమ కార్యకలాపాల్లో వ్యూహ రచన అమలు మిథున్ రెడ్డిదే అని, ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని.. వేర్వేరు మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు రూ.5 కోట్ల మేర నిధులు చేరాయని గతంలో సిట్ తన కౌంటర్‌లో పేర్కొంది..
భిన్నత్వంలో ఏకత్వం.. జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై పవన్ ఆలోచన అదే..
హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అయితే, దీనిపై జనసేన పార్టీ స్పందించింది.. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానమపి స్పష్టం చేసింది.. మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత.. సమాజంలో మన గుర్తింపుకు మూలం మాతృభాషే అని స్పష్టం చేసింది జనసేన. బాల్యంలో విద్యాభ్యాసానికి, మన సంస్కృతులను కాపాడుకోవడానికి మాతృభాష తప్పనిసరిగా ఉండాలన్నది పవన్ అభిప్రాయమని.. బహుభాషా ప్రావీణ్యం జీవితంలో ఎదిగేందుకు ఒక సాధనం అని పేర్కొన్నారు.. అది జ్ఞానాన్ని అందించడమే కాకుండా, భిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం అయ్యేందుకు, అవకాశాలను మెరుగుపరచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.
రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ
రామాయపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టిసారించింది.. పరిశీలనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.. ఆర్థిక, ఐ అండ్ ఐ, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.. ఆర్ధిక, మౌలిక వసతులు, పెట్టుబడులు, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేశారు.. రామాయపట్నం పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్, అంతర్గత, బాహ్య రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పరిశీలన చేయనుంది మంత్రివర్గ ఉప సంఘం.. ప్రతిపాదనలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక, ఫేజ్ -1 పనులను పూర్తి చేయడానికి సమయం పొడిగింపు అంశాన్నీ పరిశీలించాలని పేర్కొంది ప్రభుత్వం.. తగిన ఏర్పాట్లు చేయాలని మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిని ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..
ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్.. అవి పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదు
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. మా ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పెండింగ్ పవర్ బిల్లుల వన్ టైం సెటిల్మెంట్ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు పౌర సమాజం అంతా కలిసి పని చేద్దాం.. హైదరాబాదులో సృష్టించే సంపదను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్దామని, సంపద సృష్టించడం ఒక సాధన మాత్రమే మన ప్రజల గౌరవాన్ని పెంపొందించడం వారి ఆశయాలను నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కీ వందేళ్ల పైగా అనుభవం ఉందని, హైదరాబాద్ నగరం ఒక వర్తక నగరం నుంచి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే వరకు ప్రతి దశలోనూ FCCI ముందు నడిచిందన్నారు భట్టి విక్రమార్క.
తెలంగాణలో తయారైన కృత్రిమ పాదం… రూ. 20,000కే కొత్త జీవితం
దేశంలో తొలిసారిగా తక్కువ ఖర్చుతో ఉన్న అధునాతన కర్బన్ ఫైబర్ కృత్రిమ కాలుపాదాన్ని భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) మరియు ఎయిమ్స్ బీబీనగర్ సంయుక్తంగా ఈ పాదాన్ని రూపొందించారు. ఈ వినూత్న ఆవిష్కరణను మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ కాలుపాదం, దిగువస్థాయి ఆదాయ గల అమ్ప్యూటీలకు గుణాత్మక ప్రోస్తెటిక్ లభ్యతను పెంచడంతో పాటు, దేశీయంగా తయారీ ఖర్చును భారీగా తగ్గించనుంది. ప్రస్తుతం విదేశీ పాదాలను దిగుమతి చేసుకుంటే దాని ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ దేశీయ పాదం తయారీ ఖర్చు రూ. 20,000 కన్నా తక్కువగా ఉండేలా రూపొందించబడింది. ఈ కృత్రిమ పాదాన్ని బయోమెకానికల్‌గా పరీక్షించి 125 కిలోల బరువును భరిస్తుందని ధృవీకరించారు. అలాగే భిన్న బరువుల గల ఉపయోగదారులకు అనుగుణంగా మూడు వేర్వేరు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేతకు ఛాన్స్! కొనసాగుతున్న మంతనాలు
భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగానే యెమెన్ అధికారులు.. ఉరిశిక్ష అమలును నిలిపివేశారు. అయితే ఉరిశిక్ష నిలిపివేతకు నర్సు కుటుంబం.. స్థానిక అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నష్ట పరిహారంగా బాధిత కుటుంబానికి రూ.8.5 కోట్లు నర్సు కుటుంబం ఆఫర్ చేసింది. కానీ బాధిత కుటుంబం మాత్రం అంగీకరించలేదు. ఒకవేళ నర్సు కుటుంబం విజ్ఞప్తిని అధికారులు పరిగణనలోనికి తీసుకుంటే మాత్రం ఉరిశిక్ష నిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా యెమెన్ అధికారులు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఈ చర్చలేమీ ఫలించకపోతే మాత్రం నిమిషా ప్రియ ఉరి కంభం ఎక్కాల్సిందే.
Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్‌లో ISSకి బయలుదేరారు. భూమి నుండి 28 గంటల ప్రయాణం తర్వాత వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఇక్కడ 18 రోజులు గడిపారు.
ట్రంప్ డెడ్‌లైన్‌లు పట్టించుకోం.. రష్యా సీనియర్ అధికారి వెల్లడి
ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. అయినా కూడా పుతిన్ దారిలోకి రాలేదు. అయితే పుతిన్ పగలు మంచిగా మాట్లాడతాడు.. రాత్రైతే మాత్రం ప్రజలపై బాంబులు వేస్తాడని.. అతని ప్రవర్తన నచ్చట్లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం ఆపకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. తాజాగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుత్తెతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌ను హెచ్చరించారు. 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే.. టారిఫ్‌లతో అధిక వడ్డన వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రష్యా మిత్ర దేశాలపై కూడా 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా దారిలోకి రావాలంటే ఇదే మార్గం అని ట్రంప్ భావిస్తున్నారు.
‘కూలీ’ కోసం లోకేష్ భారీ రెమ్యునరేషన్..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా లోకేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వరుస ప్రమోషన్లు చేసేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. ఈ మూవీ కోసం నేను రూ.50 కోట్లు తీసుకున్నానని.. ఇంత ఎక్కువా అంటూ కొందరు అనుకుంటున్నారు. నా గత సినిమా లియో బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు వసూలు చేసింది.
మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..
స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ చేస్తుంటాం. ప్రతి యాక్షన్ సీక్వెల్స్ లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం. ఆ రోజేఉ స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ ను స్టార్ట్ చేశారు. స్టంట్ మ్యాన్ గా చేస్తున్న మోహన్ రాజ్ కు అలా జరిగింది.