అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు.. మరో కేసులో సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది.. అంబటిపై మరో పీటీ వారెంట్ జారీ చేయబడింది. సత్తెనపల్లి పోలీసులు రేపు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ పీటీ వారెంట్ 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా లాటరీకి సంబంధించి జారీ చేశారు. పింఛన్ లబ్ధిదారులలో 200 మందిని మినహాయించి, ఇతరులకు లక్కీ డ్రా టిక్కెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని గాదె వెంకటేశ్వర రావు, జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గతంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణ విధానంపై ఆందోళన కేసులో అంబటికి బెయిల్ మంజూరు అయినప్పటికీ, ఈ కొత్త పీటీ వారెంట్ ద్వారా ఆయనపై మరింత విచారణ కొనసాగుతుంది. మున్సిపల్ సివిల్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రేపు అంబటిని హాజరుపరచనున్నారు, తద్వారా ఆయన విడుదల మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది.
మంత్రుల తీరుపై సీఎం తీవ్ర అసహనం.. ఎన్నిసార్లు చెప్పినా లెక్కలేదా..?
మంత్రులపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత.. మంత్రులతో ఇతర అంశాలపై మాట్లాడిన ఆయన.. మంత్రుల పనితీరు, విధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మీకు ఎన్నిసార్లు చెప్పినా లెక్కలేదా,” అంటూ మంత్రులు తమ బాధ్యతలను గౌరవించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేల కోసం నివాస భవన సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎమ్మెల్యే కోసం ఎత్తైన టవర్స్, మంత్రుల కోసం ప్రత్యేకంగా బంగ్లాలు నిర్మిస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు అన్ని మంత్రులకు నిర్మాణాలను పరిశీలించాలని సూచించగా, ఇప్పటివరకు చాలామంది మంత్రులు ఈ పనిని చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. సమస్త నిర్మాణాలు సమర్థవంతంగా, గడువులో పూర్తి కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ, మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.. మంత్రుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంతో.. మంత్రులు ఇప్పుడు ఆ వైపుగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ప్రతిపక్షం లేదని లైట్ తీసుకోవద్దు.. మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశాలకు హాజరైనా.. రేపటి నుంచి వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు.. ఈ సందర్భంగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అసెంబ్లీకి ప్రతి మంత్రీ సబ్జెక్ట్ ప్రకారం ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రతిపక్షం లేకపోయినా “ఏదో ఒకటి సభలో చెప్పుదాం” అనే తార్కిక ధోరణి వద్దు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రుల పేషీలో ఉండి MLAల సమస్యలను పరిష్కరించాలని అని స్పష్టం చేశారు.. సభలో మంత్రులు చెప్పే సమాధానాలు సంక్షిప్తం, అర్థమయ్యే రీతిలో ఉండాలని అని సూచించారు సీఎం చంద్రబాబు.. ఇక, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మార్చడం. అసైన్ చేసిన భూములను సౌరశక్తి కింద కౌలు ఇవ్వడానికి అనుమతి.. ఒక్కో ఎకరాకు ఏడాదికి 30,000 రూపాయలు, రెండు సంవత్సరాల తరువాత 5 శాతం పెంపు అంశాలపై సూచనలు చేశారు.. మరోవైపు.. శ్రీశైలంలో క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు అనౌన్స్‌మెంట్ చేయాలని సూచించారు.. ఇక, ఏపీకి రావాల్సిన 12,000 కోట్లు కేంద్రం విడుదలకు అంగీకరించింది.. మూడు ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
నా కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు.. కాపాడండి.. హోంమంత్రికి మహిళ విజ్ఞప్తి..
నా కుమార్తెను కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనితకు మోరపెట్టుకున్నారు ఓ మహిళ.. రెండేళ్లుగా .. తమ కుమార్తె ను వ్యభిచార కూపం లోకి దించారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో బోరున విలపించారు. తమ కూతుర్ని కాపాడాలని హోం మంత్రి అనితను కలిశారు.. ఏపీ సచివాలయం లో హోమ్ మంత్రి అనిత ను కలసి వేడుకున్నారు తిరుపతి కి చెందిన మహిళ… స్థానిక ప్రజా ప్రతినిధులు. పోలీస్ అధికారులు. ఉన్నతాధికారులను కలిసి వేడుకన్నా.. ఎలాంటి స్పందన లేదన్నారు ఆ మహిళ.. రేపు తనను కలవాలన్నారు హోం మంత్రి అనిత.. దర్యాప్తు చేయిస్తా మని హామీ ఇచ్చారు. ఇప్పటికె హోం మంత్రిని మూడు సార్లు కలిసా న్యాయం జరగలేదని బోరున విలపించారు ఆ మహిళ.. అయితే, రేపు తనను కలవాలని హోంమంత్రి అనిత.. సదరు మహిళకు చెప్పడంతో.. రేపు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 24 అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 24 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల విషయానికి వస్తే.. నీటిపారుదల శాఖలోని 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది.. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. ఇక, గాజువాకలో వెయ్యి చదరపు గజాల వరకు ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.. గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన జీఓలో మార్పులు చేసింది కేబినెట్.. పారిశ్రామిక, ఇంధన రంగంలో నిర్ణయాల విషయానికి వస్తే.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్‌కు కేటాయింపు.. నంద్యాల జిల్లా సంజామలలో 1,500 ఎకరాలు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం.. విశాఖ జిల్లా ఆనందపురంలో 18.57 ఎకరాల కేటాయింపుకు అనుమతి.. సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి ఆమోదం తెలిపింది.. తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీకి అనుమతి ఇచ్చింది..
సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న వేళ సంగారెడ్డిలో మాత్రం హైడ్రామా చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు పోలింగ్ స్టేషన్ వద్ద ఈ గొడవ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శివకుమార్ దురుసుగా ప్రవర్తించారని, ఏకంగా ఆయన కాలర్ పట్టుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే, సీఐ ఆయనకు సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అభ్యర్థికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ జగ్గారెడ్డి బలవంతంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రిగ్గింగ్‌కు సహకరించిన సీఐ శివకుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు ఎందుకు? సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం అంటూ ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించింది.
సీసీటీవీ పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ముగింపు.. అక్రమాలపై కఠిన చర్యలు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడేందుకు ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంటర్ బోర్డ్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ (CCR) ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో 5,500 సీసీటీవీ కెమెరాలు, సెక్టార్ కళాశాలల్లో 1,300 కెమెరాలు, ప్రైవేట్ కళాశాలల్లో 7,500 కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని CCRకు అనుసంధానించారు. ఎక్కడైనా అక్రమాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను అమలు చేశారు.
ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 13న ఫలితాలు..!
తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నేడు (బుధవారం) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట టోకెన్లు జారీ చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేస్తారు. పోలీసుల భారీ భద్రత నడుమ వీటిని నిర్దేశించిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 62% పైగా పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం కార్పొరేషన్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 13న ఈ ఫలితాలు వెలబడనున్నాయి.
‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నేతపై ఎదురుదాడికి దిగారు. ‘‘తాను కొన్ని సందర్బాల్లో ప్రతినిధి బృందంలో భాగంగా మాత్రమే కలిశాను. అతడికి ఒక ఇమెయిల్ మాత్రమే చేశాను’’ అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు ఎప్‌స్టీన్‌తో తన సంబంధాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా అధికారిక, ప్రొఫెషనల్ మీటింగ్స్‌లో భాగంగా మాత్రమే ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు తెలిపారు. 2009-17 మధ్య కేవలం 3-4 మీటింగ్స్ లో పాల్గొన్నట్లు చెప్పారు. “నేను న్యూయార్క్‌లోని UNలో భారత రాయబారిగా చేరిన మే 2009 నుండి 2017లో మంత్రి అయ్యే వరకు మూడు మిలియన్ల ఈమెయిల్‌లు విడుదలయ్యాయి. ఈ కాలంలో, మూడు లేదా నాలుగు సమావేశాల గురించి మాత్రమే ప్రస్తావనలు ఉన్నాయి. నా సంభాషణలు పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి, ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీలేటరలిజం , ఇతర అంతర్జాతీయ పనులకు సంబంధించినవి” అని పూరి వెల్లడించారు. 8 ఏళ్ల కాలంలో కేవలం ఒక ఈమెయిల్ మాత్రమే ఎప్‌స్టీన్‌లో పంచుకున్నట్లు తెలిపారు.
థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..
థాయ్‌లాండ్‌లో నేడు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దక్షిణ థాయ్‌లాండ్ లోని సోంగ్‌క్లా ప్రావిన్స్‌లో ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సంఘటనను దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మాస్ షూటింగ్‌లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. ప్రావిన్షియల్ పరిపాలన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక తుపాకీ కలిగిన వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తెలిసిన వెంటనే సాయుధ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భయంతో పాఠశాల నుంచి బయటకు పరుగులు తీస్తూ వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి చేరుకున్నారు.
ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు 16 మిలియన్ల వ్యూస్ (15.9) వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా తెలిపింది. థియేటర్లలో విడుదలై ఇప్పటికే సంచలనం సృష్టించిన ఒక సినిమా ఓటీటీలోను భారీ వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది నాన్-ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చిత్రానికి ఆల్-టైమ్ రికార్డ్ స్టార్ట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ‘ధురంధర్’ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 72 గంటల్లోనే 7.6మిలియన్ల వ్యూస్‌తో గ్లోబల్ టాప్-10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెం.1 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకూ 8.2 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, ఏకంగా 11 దేశాల్లో నం.1 గా ఈ చిత్రం కొనసాగుతుండటం విశేషం. నెక్ట్స్ పార్ట్ కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ధురంధర్2’ సినిమాను ఐదు భాషల్లో ఒకేసారి మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ యాక్షన్, అక్షయ్ కన్నా విలనిజం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఓటీటీలో మరెన్ని రికార్డులు కొళ్లగొడుతుందో వేచిచూడాలి మరి.
గుణశేఖర్ యూఫోరియా సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇదే!
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). ఈ చిత్రంపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. “గుణశేఖర్ గారు తన కథలను తెరపై ఆవిష్కరించే విధానంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. ‘యుఫోరియా’లో సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగడమే కాకుండా, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది” అని మహేష్ బాబు కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు మలిచిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలుస్తోందన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి భూమికా చావ్లా తన నటనతో మరోసారి మెప్పించినట్లు చెప్పారు. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు, నటనలో ఆమె చూపిన పరిణతి సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయన్నారు. మొత్తంగా చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. చైత్ర (సారా అర్జున్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలిచే చైత్రకు ఐఏఎస్ అవ్వాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో పరీక్షలకు సిద్ధమవుతుంటుంది. అయితే ఒక రోజు తన స్నేహితురాలు పబ్‌లో జరిగే పార్టీకి ఆహ్వానించడంతో.. తల్లిదండ్రుల అనుమతితో అక్కడికి వెళ్తుంది. ఆ పార్టీలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి)తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. చైత్ర అందచందాలపై వికాశ్ కన్నేస్తాడు. పార్టీ అనంతరం చైత్రకు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్తాడు. ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేస్తాడు. చైత్ర తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును ఛేదించేందుకు సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) రంగంలోకి దిగుతాడు. బడా నేతల పిల్లలు నిందితులుగా ఉండటంతో.. దర్యాప్తు క్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కమిషనర్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?, కేసులో వింధ్య వేములపల్లి (భూమిక)కి ఉన్న సంబంధం ఏంటి?, తప్పు చేసిన వారికి శిక్ష పడిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.