ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..!
మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనుంది ఎయిరిండియా విమానం. ఇంత వరకు బాగానే ఉన్న ఎయిరిండియా చేసిన పొరపాటు ఇప్పుడు ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది. విజయవాడ నుంచి కువైట్‌కు విమానసర్వీసులు ప్రారంభమైన తొలిరోజు ఎయిరిండియా నిర్లక్ష్యంతో 11 మందికి పైగా ప్రయాణికులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.. విమానం ఉదయం 9.55కు బయల్దేరాల్సి ఉండగా.. వారికి ఇష్యూ చేసిన టికెట్లలో మాత్రం మధ్యాహ్నం 1.10 గంటలకు అని పేర్కొంది ఎయిరిండియా.. టికెట్లపై మధ్యాహ్నం 1.10 గంటలకు విమానం అంటూ ముద్రించారు.. గన్నవరం నుండి కువైట్‌కు 85 మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోగా.. విమానం బయల్దేరే సమయానికి 67 మంది ప్రయాణికులు మాత్రమే గన్నవరం చేరుకుని కువైట్ వెళ్లిపోయారు.. టికెట్‌పై మధ్యాహ్నం 1.10 అని ఉండడంతో ఆలస్యంగా 11 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.. మరికొంత మంది ప్రయాణికులు కూడా గన్నవరం చేరుకుంటున్నారు.. విమానం వెళ్లిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ప్రయాణికులు ఎయిరిండియా తప్పదంపై ప్రశ్నించగా డబ్బులు రీఫండ్ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు..
అచ్చెన్న హత్యపై రాజకీయం తగదు.. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది..!
కడప జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ చిన్న అచ్చెన్న అదృశ్యం.. ఆ తర్వాత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది.. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం సరికాదని హితవుపలికారు ఎంపీ నందిగం సురేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డాక్టర్ అచ్చెన్న హత్య వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా తెలిపారు.. దీనిని రాజకీయం చేయటం కరెక్ట్ కాదన ఆయన.. లోతుగా విచారణ చేస్తున్నాం.. దోషులు ఎలాంటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.. టీడీపీ నాయకులు దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదమని కొట్టిపారేశారు.. ఎవరైనా దళాతుడిగా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పటి వరకు దళితులను క్షమాపణ చెప్పలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ నందిగం సురేష్.
ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి..! టీడీపీకి ఇదే నా సవాల్
ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇక చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ చెప్పుకొస్తుందే.. అయితే, టీడీపీ నేతలకు సవాల్ చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. దాదాపు 40 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆంబోతు అచ్చెన్నాయుడుకు మెదడులో తెలివి లేదు.. కానీ, మోకాల్లో ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న 40 మంది వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు.. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు.. చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు అంటూ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఇక, మాది రాజకీయ కుటుంబమైనా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచానని పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
రైతులకు అంతేనా పరిహారం..! అది ఎలా సరిపోతుంది?
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే రైతులకు ఎలా సరిపోతుంది? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల వాన తో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రైతులను మేము కలిసామని, సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చెయ్యలేదు, 50 వేలు మాత్రమే రైతులకు రుణ మాఫీ అయ్యిందని అన్నారు. కొన్ని చోట్ల 25 వేలు మాత్రమే మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు భువనగిరిలో 4 వేల దరఖాస్తులు, 2300 దరఖాస్తులు అనర్హులుగా తేల్చారు. దానిలో అర్హులు లేరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదనంగా పేదలకు 2000 ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. కేంద్రంపై గుత్తా సీరియస్
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగలపై ఎలాంటి విచారణలు ఉండవు కానీ లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దూరాలోచన చేసి, ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ మీద కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పై కూడా పేపర్ లీకేజీలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. టీఆఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ నిజాయితీ పరుడని, ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు గుత్తా సుఖేందర్. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లుకు అసత్యాలు ప్రచారం చేయడమే వారి పని ఆరోపించారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ కు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవుని, రాష్ట్రంను ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకుంది కేంద్రం అంటూ నిప్పులు చేరిగారు. గవర్నర్ వ్యవస్థ కూడా బ్రష్టు పట్టించారు బీజేపీ వాళ్ళు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో బిల్లులను పెండింగ్ లో పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు గవర్నర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎంఆర్ షా.. అయితే, తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సీబీఐ.. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది.. కాగా, రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎం ఆర్ షా.. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు.. మరోవైపు, విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5గా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని కోరారు తులశమ్మ.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.. ఇక, ఏప్రిల్ 15వ తేదీకల్లా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది సీబీఐ. అయితే, కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలల సమయం అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాల్సింది తులశమ్మ తరపు న్యాయవాది విన్నవించారు. అయితే, ఈ కేసులో మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
లక్షద్వీప్ ఎంపీకి భారీ ఊరట.. ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత
ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురైన ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన అనర్హతను లోక్‌సభ వెనక్కి తీసుకుంది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాహుల్ గాంధీ వ్యవహారంపై దుమారం రేగుతున్న వేళ, లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన మహమ్మద్ ఫైజల్‌కు కవరత్తి సెషన్స్ కోర్టు 10ఏళ్ల శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని జనవరి 13న దిగువ సభ రద్దు చేసింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేరళ హైకోర్టు నుంచి జనవరి 25న సస్పెన్షన్ ఆదేశాలను తెచ్చుకున్నారు. కానీ లోక్‌సభ సచివాలయం ఆయన సభ్వత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా. అంతకు ముందే లోక్‌సభ సెక్రెటేరియట్ తాజా నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటకలో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఈసీ కల్పించింది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం వెలువడుతుందని ప్రకటించింది. మే 24తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్టు సీఈసీ తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
-నోటిఫికేషన్ విడుదల తేదీ- 13 ఏప్రిల్, 2023
-నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- 20 ఏప్రిల్,2023
-నామినేషన్ల పరిశీలన- 21 ఏప్రిల్, 2023
-నామినేషన్ల ఉపసంహరణ- 24 ఏప్రిల్, 2023
-కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్- మే 10, 2023
-కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- మే 13, 2023
-కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గాలు – 224
-కర్ణాటక ఓటర్ల సంఖ్య – 5, 21,73, 579 మంది.
-పోలింగ్ కేంద్రాల సంఖ్య – 58,282
-మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలు – 1,320
వయనాడ్ ఉపఎన్నికపై స్పందించిన సీఈసీ.. అప్పుడే ఎన్నికలు!
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అనే అంశం చర్చకు వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఉపఎన్నికపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చిందని.. కోర్టు తీర్పు తర్వాత ఉపఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ సీటుకు ప్రజాప్రాతినిధ్యం చట్టం-2015లోని సెక్షన్ 151ఏ కింద ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరపాల్సి ఉంటుంది. దోషిగా నిరూపణపై కనీసం రెండేళ్ల పాటు శిక్ష పడిన ఎంపీ ఎవరైనా సరే అనర్హత వేటుకు అర్హుడని సెక్షన్ 8(3) చెబుతోంది. ఇదే సెక్షన్ కింద రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నాడు అనర్హత వేటు వేసింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తన తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. రాహుల్ అభ్యర్థనపై వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ కూడా మంజురు చేసింది.
రూ.2 వేలు దాటితే యూపీఐ పేమెంట్స్‌పై అదనపు బాదుడు..! నిజమేంటి..?
ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల మయం.. వీధిలో ఉండే టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు.. కిల్లీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్ పే.. ఇలా రకరకాల యూపీఐ యాప్స్ నుంచే పేమెంట్లు చేస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్‌తో పనిలేదు అన్నట్టుగా అంతా వాటిపై ఆధారపడిపోయారు. అయితే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తారన్న వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.. రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తన ఉత్తర్వుల్లో పేర్కొంది.. దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.. అందరికీ ఈ చార్జీల బాదుడు తప్పదా? అనే ఆందోళన మొదలైంది. అయితే, ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్‌చేంజ్ రుసుము విధించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతిపాదనలు చేసింది.. కానీ, ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు.. వారికా భారం కావు.. ఎందుకంటే.. ఇంటర్‌చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్ పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము ఇదన్నమాట.. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్‌చేంజ్ రుసుము వర్తింప జేస్తారు.. అంటే యూపీఐ పేపెంట్స్ చేసే యూజర్లపై ఎలాంటి అదనపు భారం ఉండబోదు అనేది స్పష్టం..