అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి.. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయినట్టు అయ్యింది.. అయితే, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురియడంతో రైతులకు భారీగా పంటనష్టం జరిగింది.. దీంతో, లబో దిబో అంటున్నారు రైతులు.. ఇక, రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఈ రోజు ఉదయం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉందని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. అవి స్మార్ట్ మీటర్లు కాదు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా అధికార, ప్రతిక్షాల మధ్య సభలో సవాళ్ల పర్వం చోటు చేసుకుంది.. మూడు ఎమ్మెల్సీల్లో ఓటమి పాలైనందుకు వైసీపీ సభ్యుల మైండ్ బ్లాంక్ అయ్యిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి సిదిరి అప్పలరాజు.. ధైర్యం ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.. మరోవైపు.. వ్యవసాయ మోటార్లకు బిగించిన మీటర్లపై క్లారిటీ ఇచ్చారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదు డిజిటల్ మీటర్లు మాత్రమేనన్న ఆయన.. పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించాం.. మీటర్లు బిగించటం వల్ల దాదాపు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అయ్యిందన్నారు.. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అయినట్టు తేలిందని స్పష్టం చేశారు. అయితే, టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో 10 వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.. రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నాం.. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు అని ఎద్దేవా చేశారు.. ఇక, వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల అంశం పై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాడులను వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు వైసీపీ సభ్యులు.. ఎఫ్ఆర్బీఎమ్ లో రుణ పరిమితి పెంచుకోవడానికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టడం దారుణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నారు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్ బాగ్ లో రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదన్న ఆయన.. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు.. అంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో మళ్లీ సేమ్ సీన్.. ఈ రోజు కూడా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రతీ రోజూ అసెంబ్లీకి రావడం.. ఏదో విషయంపై చర్చకు పట్టుబట్టడం లేదా సభను అడ్డుకోవడంతో ఈ సస్పెన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేశారు.. విద్యుత్ మీటర్ల అంశంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి నిరసనకు దిగారు.. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల, జోగేశ్వర రావు, గద్దె , భవాని, మంతెన రామరాజు, సాంబశివరావు, డోల శ్రీబాల వీరాంజనేయులు స్వామి, గోరెంట్ల, వెలగపూడి, గణ వెంకట రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. సస్పెండ్ చేసుకుని వెళ్లి పోవాలని ముందస్తు ప్రణాళికతోనే టీడీపీ సభ్యులు సభకు వస్తున్నారని విమర్శించారు. ఇదే తంతు కొనసాగిస్తున్నారు. సభలో గొడవ సృష్టించాలని వస్తున్నారు. చంద్రబాబు.. స్పీకర్ పై కాగితాలు వేయండి అని డైరెక్షన్ ఇచ్చి పంపిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇవాళ వచ్చింది 11 మంది టీడీపీ సభ్యులే.. మిగిలిన వాళ్లు ఏమయ్యారో తెలియదు అన్నారు.. ఏది జరిగినా చర్చ జగరకుండా సభను అడ్డుకుంటున్నారని.. వీరి తీరుకు నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను.. మిగిలిన మూడు నాలుగు రోజులైనా సభ జరిగేటట్లు సహకరించండి అంటూ టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. ఇలా స్పందించిన విష్ణువర్ధన్‌రెడ్డి..
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగినంత స్థాయిలో ప్రభావితం చూపించలేకపోయింది.. చెల్లని ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లే తక్కువ అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. ఈ ఫలితాలపై విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో శాసన మండలి ఎన్నికల్లో ఐదు చోట్ల బీజేపీ, బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు పోటీ చేశారని తెలిపారు.. కానీ, వైసీపీ గెలిస్తే ఒక విధంగా, వేరే పార్టీవాళ్లు గెలిస్తే మరో విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చిన ఆయన.. 11.56 శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సాధించిందని తెలిపారు.. ఓట్లు తక్కువ వచ్చాయి.. దీనిపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది తప్ప వెనుకడుగు వేయలేదన్నారు.. ప్రజా తీర్పును ఒప్పుకుని సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు విష్ణువర్ధన్‌రెడ్డి.
పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి
రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. మీరు ఇవ్వాళ వస్తారు పోతారు, మాకు అండగా ఉండేది మంత్రి కేటీఆర్ మాత్రమే అని బాధిత కుటుంబీకులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మల్సీ జీవన్ రెడ్డి వెనుతిరిగారు. ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్‌కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామని నవీన్ తండ్రి నాగభూషణరావుకు ధైర్యం చెప్పారు. నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతోపాటు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అయితే సాయంత్రం నగరంలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రశాంతి నగర్, గాజులరామారం ప్రాంతాల్లో వడగళ్ల వాన కురియడంతో హైదరాబాదీలు ఆశ్చర్యానికి గురయ్యారు. జేఎన్‌టీయూ, మణికొండ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి ఆఫీసులకు వెళ్లేవారిని పరుగులు పెట్టించింది. చాలా మంది ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే.. ఈ వడగళ్ల వానతో జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేయడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాలలోని వివిధ గ్రామాలలో అకాల వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
భయపెడుతోన్న కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో పాటు భారత్‌తోనూ భయానక పరిస్థితులను చూపించింది.. వైరస్ బారిన పడితే చాలు.. అయినవారు కూడా ఆదరించని పరిస్థితులను చూపించింది.. కడసారి చూపుకు కూడా నోచుకోని స్థితికి తీసుకెళ్లింది.. ఇప్పటికే భారత్‌లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో కోట్లాది మందిపై ఎటాక్ చేసింది.. లక్షలాది మంది ప్రాణాలు తీసింది.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం పేర్కొంది.. ఈ మధ్య క్రమంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావొచ్చని అంటుంది.. కాగా, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ భారతదేశంలో జనవరి నెలలో 2 శాంపిళ్లలో వెలుగు చూసింది.. ఫిబ్రవరిలో 59కి చేరుకుంది.. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడినట్టు ఇన్సాకాగ్ తెలిపింది.. ఇప్పుడు 76 శాంపిల్స్‌లో కొత్త వేరియంట్ బయటపడింది.. వీటిలో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని సూచించింది.. అయితే, మరోసారి కొత్త వేరియంట్ రూపంలో కరోనా విరుచుకుపడనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట వెల్లడించారు.. ఈ వేరియంట్ మూంగా దేశంలో గత రెండు వారాల్లోనే 281 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయని.. 17 శాతం మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.. ఇక, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి.. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం ఆందోళన కలిగించే అంశం.. కోవిడ్-19 కేసుల్లో ఇటీవలి పెరుగుదల ఈ వేరియంట్‌కు కారణమని కొందరు నిపుణులు పేర్కొన్నారు. జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహించిన మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, కోవిడ్ కేసుల పెరుగుదల XBB 1.16 వేరియంట్‌తో మళ్లీ విస్తరిస్తోన్నట్టు అనిపిస్తోంది, అయితే ఇన్ఫ్లుఎంజా కేసులు H3N2 కారణంగా కూడా ఉన్నాయన్నారు. “ఈ రెండింటికీ, కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించడం వలన ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే చాలా కేసులు తీవ్రంగా లేవు, కాబట్టి ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు” అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ చైర్మన్, రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్, డైరెక్టర్-మెడికల్ ఎడ్యుకేషన్ మెదంతా మరియు మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. దీంతో.. మరోసారి కరోనా విరుచుకుపడుతుందా? ఫోర్త్ వేవ్ తప్పదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 16మంది మృతి, 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు. మృతుల వివరాలు వెంటనే తెలియరాలేదు. కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఢాకాకు వెళ్లే బస్సు అప్రోచ్ రోడ్డు నుంచి అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు స్థానికులతో కలిసి రెస్క్యూ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. గాయపడిన ప్రయాణికులను వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు మదరిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎండీ మసూద్ ఆలం తెలిపారు.
మాస్ కా దాస్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సొంత దర్శకత్వంలో తనే నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మార్చ్ 22న ఉగాది పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్టుగా రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాపై విశ్వక్ సేన్ ఫాన్స్ భారి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన విశ్వక్ సేన్, ఎలాంటి హింట్ కూడా ఇవ్వకుండా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ‘విశ్వక్ సేన్ 10’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని SRT మూవీస్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. SRT మూవీస్ బ్యానర్ లో రూపొందనున్న ప్రొడక్షన్ నెం. 7 గా విశ్వక్ సేన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ‘హిట్ 2’ ఫేమ్ ‘మీనాక్షీ చౌదరి’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారి బడ్జట్ సినిమా చేస్తున్న బ్యానర్ లో సినిమా చెయ్యడం విశ్వక్ సేన్ కి కలిసొచ్చే విషయమే.
శింబు కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది, నానికి కష్టాలు తప్పేలా లేవు
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమా ‘మఫ్టీ’ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో శింబు. ఈ సూపర్ హిట్ సినిమాలో శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. డైరెక్ట్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ సినిమాకి ‘పత్తు తల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘పత్తు తల’ సినిమా మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన పత్తు తల చిత్ర యూనిట్, ఈ మాస్ యాక్షన్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, పత్తు తల సినిమా ట్రైలర్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం, ట్రైలర్ కి రెహమాన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. శింబు లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ సినిమాతో శింబు సాలిడ్ హిట్ కొట్టినట్లే అనే నమ్మకంలో ఫాన్స్ లో ఉన్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని పత్తు తల ట్రైలర్ మరింత పెంచేసింది. ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ తోడైనా నాని నటిస్తున్న దసరా సినిమాకి తమిళనాడులో కష్టాలు తప్పవు. మార్చ్ 30నే దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే శింబు సినిమా హిట్ టాక్ వస్తే నాని సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరికే అవకాశం లేదు.