అందుకే బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం.. బరితెగిస్తాం అంటే చర్యలు తప్పవు..
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. విపక్షాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.. అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దానిని చీకటి జీవో అనటంలో అర్ధంలేదన్నారు.. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు వైసీపీకి కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు అస్సలే నిర్వహించకూడదు అనలేదు కదా? అని ఎదురుప్రశ్నించిన సజ్జల.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్స్‌లో సభలు నిర్వహించుకోవచ్చు అని సూచించారు.
ఆ తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలి..!
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన తెలంగాణ సీఎం, గులాబా పార్టీ బాస్ కేసీఆర్.. ఏపీలోనూ పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు.. అయితే, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.. ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు? అని ప్రశ్నించారు జీవీఎల్.. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్‌కు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఇక, తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరన్న ఆయన.. అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని తెలిపారు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికోసం నీళ్లను సముద్రంపాలు చేశారు.. ఇలాంటి చర్యలతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుంది.. కానీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు.
పోలీస్ శాఖలో ప్రక్షాళన… వారందరికీ స్థాన చలనం
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరగబోతోంది.. మూడేళ్లకు మించి ఒకే చోట పని చేసినవారికి స్థాన చలనం తప్పదు.. ఈ మేరకు యూనిట్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. అయితే, చాలా చోట్ల కొందరు పోలీసులు ఐదేళ్లకు మించి ఒకే చోట పని చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది… దీంతో, మూడేళ్లకు మించి ఒకే చోట పని చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.. మూడేళ్లు ఒకే చోట పని చేసే వాళ్లను బదిలీ చేసి.. ఆ వివరాలను తెలపాలని యూనిట్ ఆఫీసర్లకు జారీ చేసిన మెమోల్లో పేర్కొన్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. దీని ప్రకారం.. ఏపీలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది..
సుప్రీం కీలక తీర్పు
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా ఎలాంటి అదనపు ఆంక్షలను పౌరుడు ఎవరైనా సరే విధించరాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. సమిష్టి బాధ్యత సూత్రాలను ప్రయోగించడం ద్వారా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని.. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కు దృష్ట్యా ఈ తీర్పు వెల్లడిస్తున్నామని ధర్మాసనం తీర్పు చెప్పింది.. పౌరుల హక్కులకు విరుద్ధంగా ఒక మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ హింసగా పరిగణించబడదని పేర్కొంది.. అలాగే ఆ మంత్రి చేసిన ప్రకటనను మొత్తానికి ప్రభుత్వానికి కూడా ఆపాదించలేమని తెలిపింది.
జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనుండగా.. మొదటిసెషన్ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకు జరుగుతుంది. రెండో సెషన్ మార్చి 6నుంచి ఏప్రిల్ 6వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు సూచన ప్రాయంగా పేర్కొన్నాయి. ఈ సమావేశాల తొలిరోజునే ఆర్థికసర్వే నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెడతారని తెలిపారు.
మరో రష్యన్ మృతి
ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్ట్ నుంచి పారాదీప్ మీదుగా ముంబైకి వెళ్తున్న ఓడకు చీఫ్ ఇంజినీర్ ఎంబీ అల్ద్నా(51)గా గుర్తించారు. అతను తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తన షిప్ ఛాంబర్‌లో శవమై కనిపించాడు. మృతికి గల కారణాలను పోలీసులు వెంటనే గుర్తించలేకపోయారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ పీఎల్ హరానంద్ రష్యా ఇంజినీర్ మరణాన్ని ధృవీకరించారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. డిసెంబరు చివరి వారంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ పట్టణంలో ఒక చట్టసభ సభ్యుడు సహా ఇద్దరు రష్యన్ పర్యాటకులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. రష్యాలోని చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్ (65) డిసెంబరు 24న హోటల్ మూడవ అంతస్తు నుంచి పడి మరణించారు. అతని స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్ (61) డిసెంబరు 22న అతని గదిలో శవమై కనిపించాడు. ఈ రెండు కేసులను ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శిక్ష
డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ
అమెరికాలోని డల్లాస్‌లో బాలయ్య, చిరంజీవి అభిమానులు ఓ రేంజ్‌లో గొడవ పడ్డారు. బాహాబాహీకి కూడా దిగారంటే.. పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. తొలుత జై బాలయ్య, జై చిరంజీవా అంటూ నినాదాలతో ఈ గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే.. ఈసారి సంక్రాంతి పోటీలో వీరసింహారెడ్డినే విజయం సాధిస్తుందని, వాల్తేరు వీరయ్య ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. టీడీపీ మద్దతు లేనిదే పవన్ రాజకీయాల్లోకి రాణించలేదని, అందుకే ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి పవన్ టీడీపీ పంచన చేరుతున్నాడంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలతో మెగాఫ్యాన్స్ హర్ట్ అవ్వడంతో, కౌంటర్ ఎటాక్‌కి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, బాహాబాహీకి దిగడం జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న డల్లాస్ పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఈ గొడవకి కారణమైన కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే.. చివరికి అమెరికాలోనూ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టి, తెలుగోళ్ల పరువుని గంగలో కలుపుతున్నారు.
చిత్రసీమలో విషాదం… గీత రచయిత కన్నుమూత!!
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ గీత రచయిత పెద్దాడ మూర్తి మంగళవారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. భీముని పట్నంలో జన్మించిన పెద్దాడ మూర్తికి తండ్రి పెద్దాడ వీరభద్రరావు నుండి సాహితీ వాసనలు అబ్బాయి. కాళీపట్నం రామారావు వంటి ప్రముఖుల రచనలతో స్ఫూర్తి పొందిన పెద్దాడ మూర్తి విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ‘పతంజలి’ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ సినీ గీత రచయిత వేటూరి వారి స్ఫూర్తితో హైదరాబాద్ వచ్చారు. సూపర్ హిట్ సినీ వార పత్రికలో పలు సంవత్సరాలు పాత్రికేయునిగా పనిచేశారు. అప్పుడు సినిమా దర్శకులతో ఏర్పడిన పరిచయాలతో గీత రచయితగా మారారు. తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘కూతురు’ సినిమాకు తొలి గీతాన్ని రాశారు. కృష్ణవంశీ ‘చందమామ’ చిత్రానికి రాసిన పాటకూ పెద్దాడ మూర్తికి మంచి గుర్తింపు లభించింది. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రానికి పెద్దాడ మూర్తి పాట రాశారు. పలు టీవీ సీరియల్స్ కూ ఆయన రాసిన పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భరత్ మూవీ ‘నాగలి’కి పెద్దాడ మూర్తి మాటలు, పాటలు అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాడ మూర్తి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని, బుధవారం హైదరాబాద్ రాజీవ్ నగర్ లో శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దాడ మూర్తి సోదరుడు పివిడిఎస్ ప్రకాశ్ కూడా పాత్రికేయుడు, రచయిత. ఆయన గత యేడాది కన్నుమూశారు.
ఆమిర్, ప్రభాస్ రికార్డులని బ్రేక్ చేసిన పుష్ప, నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్
2021 సంవత్సరంలో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ‘పుష్ప ది రైజ్’. స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండియాకి పరిచయం ఉన్న అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చి పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయం చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేశాడు. పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప ది రైజ్ సినిమా ఏడాదిన్నర అవుతున్నా రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. ఇండియాలో దాదాపు 450 కోట్ల గ్రాస్ ని రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా ఇటివలే రష్యాలో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ కూడా రష్యా వెళ్లి ప్రెస్ మీట్స్, ఆడియన్స్ మీట్లలో పాల్గొన్నారు. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ స్వయంగా రష్యా వెళ్లి చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు ‘పుష్ప ది రైజ్’ కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అవుతున్నాయి. 25 రోజులుగా రష్యా థియేటర్స్ లో రన్ అవుతున్న ‘పుష్ప ది రైజ్’ సినిమా ఇప్పటివరకూ 137K అమెరికన్ డాలర్స్ ని రాబట్టింది. ఇది ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3, ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాల కన్నా ఎక్కువ కావడం విశేషం. రష్యాలో ప్రభాస్, ఆమిర్ ఖాన్ రికార్డులని బ్రేక్ చేసిన ‘పుష్ప ది రైజ్’ మరో 20K డాలర్స్ ని కలెక్ట్ చేస్తే షారుఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసినట్లు అవుతుంది. రష్యాలో ‘ఢిల్లీ సఫారి’ అనే సినిమా 854K డాలర్స్ ని రాబట్టి గత పదేళ్లలో అత్యధిక వసూళ్లు సాదించిన భారతీయ చిత్రంగా రష్యాలో టాప్ ప్లేస్ లో ఉంది. 2012 లో రిలీజ్ అయిన ‘ఢిల్లీ సఫారీ’ సినిమాలో ‘గోవింద’ హీరోగా నటించాడు. ‘పుష్ప ది రైజ్’ సినిమాకి ‘ఢిల్లీ సఫారీ’ సినిమాకి మధ్య కలెక్షన్స్ ని చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి టాప్ ప్లేస్ లోకి పుష్ప వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది.
రవితేజ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేసాడు… వంద కోట్లు…
మాస్ మహారాజ రవితేజకే కాదు కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఆక్సిజన్ లాంటి హిట్ ఇచ్చిన ‘క్రాక్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర 70కోట్లు రాబట్టింది. ఏడాది తిరగకుండానే ‘ధమాకా’ సినిమాతో ‘క్రాక్’ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. క్రాక్ సినిమా ఓవరాల్ గా క్రాక్ రాబట్టిన 70 కోట్ల మార్క్ ని ధమాకా సినిమా బ్రేక్ చెయ్యడానికి టైం దగ్గర పడింది. పది రోజుల్లో ధమాకా సినిమా 94 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూనే ఉంది. ధమాకా సినిమా అనౌన్స్ అయినప్పుడు, ఈ మూవీపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అప్పటికే రవితేజ నటించిన రెండు సినిమాలూ ఫ్లాప్ అవ్వడంతో ధమాకా కూడా పోతుందేమో అని అంతా అనుకున్నారు. అలా అనుకున్న ప్రతి ఒక్కరి అంచనాలని తలకిందులు చేస్తూ ధమాకా సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ థియేటర్ రన్ ని కంటిన్యు చేస్తోంది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్న ధమాకా సినిమా, ఇప్పటివరకూ 550K డాలర్స్ ని వసూల్ చేసింది. ఇది రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్ గా నిలిచింది. దీంతో క్రాక్ రికార్డుని ధమాకా సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ చేసినట్లు అయ్యింది. రాబోయే రోజుల్లో ధమాకా సినిమా మరిన్ని వండర్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జనవరి ఫస్ట్ వీక్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. సంక్రాంతి వరకూ టాలీవుడ్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావట్లేదు కాబట్టి ధమాకా సినిమా థియేటర్ రన్ కంటిన్యు అవుతుంది. ప్రస్తుతం ధమాకా మైంటైన్ చేస్తున్న థియేటర్ కౌంట్ లో డ్రాప్ కనిపించకపోతే, కలెక్షన్స్ లో కూడా డ్రాప్ కనిపించే అవకాశం లేదు. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ ని బట్టి చూస్తే ఫుల్ రన్ లో ధమాకా సినిమా ఈరోజుతో వంద కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ అవనుంది. రవితేజ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రసర్ గా హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి ధమాకా సినిమా సిద్ధంగా ఉంది.