కోడి పందాల్లో అపశృతి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతి
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు వెళ్లాడు పద్మారావు అనే యువకుడు.. అయితే, కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకెళ్లాయి.. ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది.. కోడికి కట్టిన కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లిపోయింది.. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో పద్మారావు అక్కడికక్కడే కన్నుమూశాడు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రికి వచ్చేలోగానే పద్మారావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఇక, కిర్లంపూడి మండలం వేలంకలో మరో ఘటన చోటు చేసుకుంది.. గండే సురేష్ అనే వ్యక్తి కోడి పందాల దగ్గరకు వెళ్లాడు.. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు విడిచాడు..
సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీలు..
సైకో చంద్రబాబు గో బ్యాక్.. గో బ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తూన్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ గూండాల దాడి.. టీడీపీ గూండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్న కొన్ని ఫొటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలకు అన్నమయ్య జిల్లా పీలేరు వేదికైంది.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఈ ఫ్లెక్సీలను పెట్టారు.. పీలేరు సబ్ జైల్‌కు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్న నేపథ్యంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. కాగా, అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు.. ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను.. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయని.. దీంతో.. టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.. కాగా, ఈ ఘటనలో టీడీపీ క్యాడర్ పై హత్యాయత్నం సెక్షన్ సహా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఫైర్ అవుతున్నారు.. అయితే, ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను 10వ తేదీన అరెస్టు చేశారు పోలీసులు.. జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను పీలేరు సబ్ జైలుకు వెళ్లి పరామర్శించనున్నరు టీడీపీ అధినేత చంద్రబాబు.
మీరు కుక్కలు పెంచుతున్నారా..? అయితే ఈ పన్నులు కట్టాల్సిందే..
మీరు కుక్కలను పెంచుకుంటున్నారా..? అయితే మీ జేబు చిల్లు పడడం ఖాయం.. ఎందుకు అంటున్నారా? మీకు పన్ను బాదుడు తప్పదు.. భద్రత, పరిశుభ్రత పన్ను పేరుతో కొత్త పనులు వసూలు చేయనున్నారు.. ఇది ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్‌కు పరిమితం అయ్యింది.. రానురాను అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేషన్లు.. పట్టణాలు.. ఇలా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంటుందేమో చూడాలి మరి.. ఇక, పెంపుడు కుక్కలపై పన్ను వేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది..? ఆ పన్ను వివరాలు ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.. పెంపుడు కుక్కల యజమానుల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది.. ప్రతీ ఒక్కరూ సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది.. అంతేకాదు.. వాటికి టీకాలు వేయించడంతోపాటు పెంపుడు జంతువుల యజమానుల నుంచి భద్రత, పరిశుభ్రత పన్ను కూడా వసూలు చేసేందుకు సిద్ధమైంది.. దీనిపై తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. ఇక, ఈ తీర్మానాన్ని 40 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.. త్వరలోనే చట్టాన్ని రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అయితే, వీధికుక్కల బెడద పెరుగుతుండడంతో.. కుక్కల యజమానులపై పన్ను విధించాలనే నిర్ణయానికి వచ్చిందట ఎస్‌ఎంసీ.. వీధికుక్కలతో పాటు పెంపుడు కుక్కల ద్వారా బహిరంగ ప్రదేశాలు మురికిగా తయారు అవుతున్నాయట.. వీధికుక్కలు, కుక్కలను పెంచే వారి వల్ల సిటీలో చెత్త పెరిగిపోయిందని చెబుతున్నారు.. అంతే కాదు.. మనుషులపై కుక్కలు దాడి చేసిన ఘటలు.. కుక్కలు కరవడంతో ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.. మొత్తంగా పన్ను బాదేసి.. అవి అదుపుచేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.. ఇప్పటికే ఈ రకమైన పన్ను విధించబడే నగరాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఎస్‌ఎంసీ..
వైఎస్ వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణకు బదిలీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో.. బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు..
అవును నేను సంబరాల రాంబాబునే.. అంబటి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ కూడా కాకరేపుతోంది.. పండుగ సమయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇక, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇదే తాజా మాటల యుద్ధానికి కారణమైంది.. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేసిన జనసేన నేత, సినీ నటుడు నాగబాబు.. అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ ”సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు.. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !” అని కామెంట్లూ పెడుతూ ఎద్దేవా చేశారు.. అయితే, నాగబాబు ట్వీట్‌పై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. అవును నేను సంబరాల రాంబాబునే అంటూనే కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. “నువ్వు, మీ తమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డాన్స్ చేయను !” అంటూ ఘాటుగా బదులిచ్చారు.. దీంతో.. మరోసారి సోషల్ మీడియా వేదికగా.. జనసేన వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారిపోయింది.. కొందరు అభిమానులు, జనసేన శ్రేణులు.. పవన్ కల్యాణ్, నాగబాబుకు అనుకూలంగా కామెంట్లు పెడుతూ.. అంబటిపై ఫైర్ అవుతుంటే.. మరికొందరు.. అంబటికి మద్దతుగా నిలిస్తూ మెగా బ్రదర్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాగా, రణస్థలం వేదికగా జనసేన నిర్వహించిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తర్వాత.. ట్విట్టర్‌లో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసిన సంగతి విదితమే.. PK అంటే పిచ్చి కుక్క అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆయన.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్ వి ! అంటూ మరో ట్వీట్ చేశారు.. రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్ వి ! అంటూ మరో ట్వీట్‌తో మంత్రి రోజాపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే..
10/10 GPA రాకుంటే.. టీచర్లతో బాండ్ రాయించుకున్న కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు కావాల్సిన మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోంది. అయితే.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుతా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది అధికార యంత్రాంగం. అయితే.. ఈ నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 10/10 జీపీఏ తీసుకువచ్చి విధంగా ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అయితే.. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత రావాలని.. ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 GPA రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుతో మీటింగ్ పెట్టి షరతులు పెట్టారు కలెక్టర్ శరత్. అంతేకాకుండా.. స్కూల్ నుంచి ఎంత మంది విద్యార్థులతో 10/10 GPA తెప్పిస్తారో తెలపాలంటూ టీచర్లకు బాండ్ పేపర్లు ఇచ్చింది జిల్లా విద్యాశాఖ. బాండ్ పేపర్ లో ఇచ్చినంత మంది విద్యార్థులకు 10/10 GPA రాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని బాండ్ సారాంశం. అయితే.. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రైవేటు స్కూళ్లల్లోనే ఓవరాల్ గా 10/10 GPA ఎక్కడ రాలేదు అంటున్న టీచర్లు.. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామంటున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంకా గాంధీ భారీ కటౌట్లు
కర్ణాటకలో ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బెంగళూరు మైదానంలో జరుగుతున్న నా నాయకి అనే మహిళా సమావేశాన్ని (ఉమెన్స్ కన్వెన్షన్) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రియాంకా గాంధీ భారీ కటౌట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తే.. 200 యూనిట్‌ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మహిళల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల కోసం ప్రియాంకా గాంధీ బెంగళూరుకు రానున్నారు. నా నాయకి సమావేశంలో కర్ణాటకలో ఎక్కువ మంది మహిళా ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో మహిళల కోసం ప్రత్యేక ప్రణాళికను కాంగ్రెస్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ మహిళల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల కానుంది. గ్రామ పంచాయతీ, సహకార సంఘాలలో మహిళా నాయకురాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు 1 లక్షల మంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా సంఘం ఈ సమావేశాన్ని నిర్వహింస్తోంది. వివిధ పంచాయతీల సహకార సంఘాలకు పోటీ చేసిన మహిళలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రతి బూత్ లేదా సంఘం నుండి 3 నుండి 10 మంది మహిళల సమావేశానికి హాజరుకావడానికి పిలుపునిచ్చారు.
తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్ అయ్యేది..
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన లిఫ్ట్ ప్రమాదం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ తృటిలో తప్పించుకున్నారు. నగరంలోని హార్దికర్ హాస్పిటల్‌లోని నాల్గవ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోయినప్పుడు ఎన్‌సీపీ నాయకుడు, మరో ముగ్గురితో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు మరియు ఎలాంటి గాయాలు కాకుండా లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు. అయితే, ఆ విషయం కాస్త ఆలస్యంగా ఆజిత్ పవార్ బయటపెట్టారు.. ఆదివారం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ, పుణెలోని ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. ఆ సమయంలో నాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ రెడీ కర్ కూడా లిఫ్ట్‌లో ఉన్నారని.. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్‌లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది.. చిమ్మచీకటి.. ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు.. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ కిందికి పడిపోయిందన్నారు.. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు.. ఆ తర్వాత డాక్టర్‌ను కాపాడాం.. ఈ ప్రమాదంలో నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్ హార్దికర్‌కు స్వల్ప గాయాలు అయినట్టు వెల్లడించారు.. అయితే, ఇదేదో కథ కాదు.. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజు ఇది శ్రద్ధాంజలి కార్యక్రమంగా ఉండేదన్నారు.. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ చమత్కరించారు.. ఈ విషయాన్ని ఇంట్లో తన భార్యకు, తల్లికి సైతం చెప్పలేదన్నారు. ముందే, ఈ విషయం అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదన్నారు.. ఈ ఘటన జనవరి 14వ తేదీన పుణెలో జరిగినట్లు తెలిపారు అజిత్ పవార్.
చేతులు, కాళ్లు కాదండి కాస్త మొహం చూపించండి గురువు గారు
వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్ లీక్ కాకుండా సెట్స్ లో షూటింగ్ ని చెయ్యడం అనేది మాములు విషయం కాదు. రాజమౌళి అంతటి వాడికే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల సమయంలో లీకుల బెడద తప్పలేదు. సలార్ సినిమా విషయంలో కూడా లీకులు బాగానే బయటకి వచ్చాయి, రీసెంట్ గా మొదలైన మారుతీ-ప్రభాస్ సినిమా షూటింగ్ నుంచి కూడా ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఇలా లీక్ అనేది సర్వ సాధారణం అయిపోయిన రోజుల్లో ‘ప్రాజెక్ట్ K’ సెట్స్ నుంచి లీక్ బయటకి రాకుండా నాగ్ అశ్విన్ తీసుకుంటున్న జాగ్రత్తలని అభినందించాల్సిందే. అయితే లీకుల విషయంలో జాగ్రత్తలు ఒకే కానీ ఒక్క అప్డేట్ లో కనీసం సైడ్ ఫేస్ అయినా చూపిస్తే ప్రభాస్ ఫాన్స్ కాస్త హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటివరకూ చేతులు, కాళ్లు, నీడలు, టైర్లు మాత్రమే చూపిస్తున్నారు. ఇదే లిస్టులో సంక్రాంతి అప్డేట్ కూడా చేరింది.
పవన్ కళ్యాణ్‌తో చచ్చినా చేయను.. ప్రియాంకా బాంబ్
పవన్ కళ్యాణ్‌తో నటించే ఆఫర్ వస్తే.. ఎవ్వరైనా వదులుకుంటారా? స్టార్ భామలు సైతం ఎగిరి గెంతులేస్తారు. ఆయనతో కలిసి వెండితెర పంచుకునే అవకాశం వచ్చిందని, డేట్స్ సర్దుబాటు చేస్తారు. అలాంటిది.. తనకు ఛాన్స్ వస్తే మాత్రం చచ్చినా చేయనంటూ యంగ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ బాంబ్ పేల్చింది. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం ఉందని ఈ అమ్మడు చెబుతోంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని, ఆయనంటే పడి చస్తానని తెలిపింది. పవన్ ‘తమ్ముడు’ సినిమాను తాను 20 సార్లు చూశానని.. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ గుర్తుందని పేర్కొంది. తాను పవన్‌కి వీరాభిమానినని.. దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోవాలని ఉందని చెప్పింది. అంతకుమించి తానేం కోరుకోవడం లేదని.. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చినా చేయనని వెల్లడించింది. పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావట్లేదని చెప్పింది.