కొండగట్టు అంజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్.. పూర్ణకుంభంతో స్వాగతం
సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకున్నారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ విచ్చేశారు. అయితే.. కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కొండగట్టు ఆలయంలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
మాజీ మంత్రి కుతూహలమ్మ ఇక లేరు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆమె వయస్సు 73 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో కన్నుమూశారు.. 1949 జూన్ 1వ తేదీన ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించిన ఆమె.. ఎంబీబీఎస్ పూర్తి చేశారు.. అనంతరం కొంతకాలం వైద్య వృత్తిలో కొనసాగారు.. 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పనిచేసిన ఆమె.. రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు.. 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుతూహలమ్మ.. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు.. ఇక, 1980 – 1985లో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా సేవలందించారు.. మరోవైపు.. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం 20214లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కుతూహలమ్మ.. టీడీపీలో చేరారు.. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు..
జగన్ సీఎంగా రాష్ట్రం ఆర్ధికంగా పుంజుకుంది..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని.. అనేక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే అవసరం వైసీపీ నాయకులకు లేదు.. గడిచిన మూడున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన వాస్తవ అభివృద్ధి మాత్రమే మేం ప్రజలకు చెప్పదలుచుకున్నాం అన్నారు. త్వరలో వైజాగ్ లో మెగా పారిశ్రామిక సమ్మిట్ పెడుతున్నాం.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి.. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు.. పారిశ్రామిక, నిరుద్యోగ, ఉపాధి ,వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు సీఎం జగన్ సాధించారని ప్రశంసలు కురిపించిన ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి గణనీయంగా పెరిగింది.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వెల్లడించారు. జగన్ సీఎంగా రాష్ట్రం ఆర్ధికంగా బలం పుంజుకుంది.. తలసరి ఆదాయాన్ని పెంచుకుందున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. గతం కంటే తలసరి ఆదాయంలో 38 శాతం అభివృద్ధి సాధించాం.. కరోనా వంటి విపత్తును ఎదుర్కొని రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు.. టీడీపీ ప్రభుత్వంలో మైనస్ 6.2గా ఉన్న వ్యవసాయ అభివృద్ధిని గాడిలో పెట్టి +8.2 శాతంగా మలచిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నిలిచారాని ప్రశంసించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం.. ఇక, 2 లక్షల 93 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి సాగిస్తోంది.. పరిశ్రమలు అభివృద్ధి జరగాలి అంటే ప్రభుత్వాలు చొరవ చూపాలి.. అదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు.. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్టం మంచి పొజిషన్‌లో ఉంది.. మన రాష్ట్రం విద్యపై పెడుతున్న పెట్టుబడి మన రాష్ట్ర ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది.. మన యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.
వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు..
మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. పవన్ కళ్యాణ్ చాలా పచ్చబొట్లు వేసుకోవాలి.. వారాహి ఏది.. ఎక్కడ..? ఆ సినిమా ఆపారా? అంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలి.. మమ్మల్నే ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్ కే ఉందంటూ వ్యాఖ్యానించారు.. ఇక, లోకేష్, పవన్ లకు నిబద్ధత లేదని మండిపడ్డారు.. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడు.. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అన్నాడు అని సెటైర్లు వేశారు.. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా..? ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని ఎద్దేవా చేశారు.. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా? అని తలలు పట్టుకుంటున్నారన్నారు. ఇక, 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయి.. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో విజయవాడలో ఏర్పాటు చేసిన భూగర్భ జనవనరుల డేటా సెంటర్‌లోని ల్యాబ్ నిర్ణయిస్తుందన్నారు.. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని.. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖలలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని.. రూ. 16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఉంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా పెంపుడు కుక్క..! ఎలాన్ మస్క్‌పై నెటిజన్ల ఫైర్
టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లు ఓవైపు హాస్యం పంచుతున్నా.. మరో వైపు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. ముఖ్యంగా భారతీయులు తీవ్రస్థాయిలో ట్విట్టర్ చీఫ్‌పై ఫైర్ అవుతున్నారు.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా చీఫ్.. ఇప్పుడు చేసిన ట్వీట్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్ సీఈవో కుర్చీపై ఓ కుక్కను కూర్చోబెట్టి దాని మెడలో సీఈవో అని తగిలించి.. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.. అయితే, ట్విట్టర్ చీఫ్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాన్ మస్క్ ఈ తిక్క పనులు ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. ప్రపంచ కుబేరుడవు అయి ఉండవచ్చు. కానీ, అతనికి కనీస సంస్కారం లేదంటూ మండిపడుతున్నారు.. ట్విట్టర్ ఒప్పందం సందర్భంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో ఎలాన్ మస్క్ కు అనేక వివాదాలు తలెత్తిన విషయం విదితమే కాగా.. ఒక దశలో పరాగ్ అగర్వాల్.. మస్క్ ట్విట్టర్ డీల్ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే, అప్పటి వరకు సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది.. అయితే, మరోసారి దానిని గెలికే ప్రయత్నం చేశారు మస్క్.. తన పెంపుడు కుక్క ఫ్లోకి ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ యొక్క కొత్త సీఈవో అని ప్రకటించారు. Floki మునుపటి సీఈవో కంటే మెరుగైనది అంటూ ఆయన జోడించిన వికృత వ్యాఖ్య.. ఇప్పుడు చాలా మంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది..
నాన్నగారి కల నిజం అవుతుంది.. ఈ ప్రాంతమంతా అభివృద్ధి..!
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం కడప జిల్లాయే కాదు ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా సున్నపురాళ్ళ పల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు ఇవాళ భూమి పూజ చేశారు సీఎం వైఎస్ జగన్, జిందాల్ చైర్మన్ సజ్జన్ జిందాల్.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఓ చిన్న కార్యక్రమంలా పరిశ్రమ భూమి పూజ నిర్వహిస్తున్నాం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ ఎన్నో కలలు కన్నారు.. అనాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారు.. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.. అయితే, దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు సీఎం జగన్. మూడు దశల్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని.. 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ.. మరో ఐదేళ్ల మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకోనుందని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. మూడు మిలియన్ టన్నుల తో కాదు ఇంకా పెరుగు తుందనే ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డాం.. మంచి రోజులు వచ్చాయి. 4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి, 700 కోట్ల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇక, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం.. లక్ష మందికి ఉపాధి లభిస్తుంది.. జగనన్న ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చేస్తోందన్నారు.. స్థానికులకు 74 శాతం కల్పన దిశగా చట్టం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులకు అనుకూల మైన రాష్ట్రంగా నిలిచింది.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ముందుకు వస్తున్నారని.. జిందాల్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
ఢిల్లీ శివారు నజాఫ్‌గఢ్‌లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పరుపులోని నింపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. నలసోపరాలోని నివాసంలో తన 35 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్ఘర్ జిల్లాలోని తులింజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హార్దిక్ షా మేఘా ధన్ సింగ్ తోర్వితో కలిసి నలసోపరాలోని సీతా సదన్ సొసైటీలో నివాసం ఉన్నాడు. ఈ జంట తమ రియల్ ఎస్టేట్ ఏజెంట్, యజమాని, ఇతర పొరుగువారికి తాము వివాహం చేసుకున్నట్లు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. నలసోపరాలోని విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ నుంచి కుళ్లిపోయిన మేఘా మృతదేహాన్ని వెలికితీయడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నిందితుడు పరుపులో పెట్టి కుట్టేశాడు. ఆమె గత వారంలో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ తెలిపారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌పై దాడి.. చీర, జాకెట్టు చింపేసి దాష్టీకం
త్రిపుర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్‌నగర్‌లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. పొరుగువారిని కలవడానికి వెళ్లిన తనపై దాదాపు 200 మంది మహిళలు, పురుషులు దాడి చేశారని స్వయంగా బీజేపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామి తెలిపారు. ఈ దాడిలో తాను గాయపడ్డానని, దాడి చేసినవారు చీర, ఇతర దుస్తులను చింపేశారని.. అనేక ఫోన్ కాల్స్ చేసినప్పటికీ పోలీసులు కూడా సహాయం చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా సంఘం చీఫ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు కూడా సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడిలో ఆమె సహచరులలో ఒకరు, అంగరక్షకుడు కూడా గాయపడ్డారు. బర్నాలీ గోస్వామికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించిన తరువాత, ఆమె ధమ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన బిస్వా బంధు సేన్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించిందని బీజేపీ అంతర్గత సమాచారం. ప్రచారానికి సహకరించలేదనే అక్కసుతోనే బీజేపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడికి గురైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్ ఛైర్మన్ అయిన తనపై ఇంత దాడికి ఒడిగట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
‘కెప్టెన్సీపై కోహ్లీ అబద్ధం చెప్పాడు..గంగూలీపై అనవసర నిందలు’
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మపై ఓ మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ పెను వివాదానికి దారితీస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్ల గురించి ప్రైవేటు సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కెప్టెన్సీ విషయంలో విరాట్ అబద్ధం చెప్పాడని ఈ సంభాషణలో భాగంగా చేతన్ అన్నాడు. పూర్తి ఫిట్‌గా లేని కొందరు భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతారని చేతన్ వ్యాఖ్యానించడం గమనార్హం. స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన టీవీ ఛానెల్ ప్రకారం చేతన్.. బీసీసీఐ, టీమిండియా, భారత ఆటగాళ్ల గురించి ఏమన్నాడంటే..? “భారత క్రికెటర్లు 80 శాతం ఫిట్‌గా ఉన్నా సరే.. ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌నెస్ సాధిస్తారు. అవి నొప్పి మందులు కావు. డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులను వాడతారు. సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడించారు. అతను ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు.” “భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే, మరొకటి కోహ్లీ నేతృత్వంలో నడుస్తుంది. అయితే కోహ్లీ, రోహిత్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్ అండగా నిలిచాడు. రోహిత్, కోహ్లీ మధ్య అహం సమస్యగా మారినా.. అది అమితాబ్, ధర్మేంధ్ర మధ్య ఉన్నట్లుగానే ఉంటుంది. రోహిత్, హార్దిక్ నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ తరచుగా నన్ను కలుస్తాడు.”
ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పాలనను విశాఖపట్నం రాజధానిగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని ఇప్పటికే పలువురు మంత్రులు స్పష్టం చేశారు.. అయితే, ఇదే సమయంలో.. ఇతర సంస్థల సైతం విశాఖకు తరలివస్తున్నాయి.. ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. అయితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు చేశారు.. మే 31వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు దిగ్గజ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ ప్రకటించింది.. 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌లో తన కార్యకలాపాలను ఆరంభించనుంది.. ఋషికొండ సిగ్నటివ్ టవర్స్ లో కార్యకలాపాలు ప్రారంభం కానుండగా.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉన్న ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్‌లో ప్రాధాన్యత ఇస్తోంది ఇన్ఫోసిస్.
ఇలా అప్పట్లో కనిపించి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదేమో…
హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కొందరు తారలు. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి… ఎక్కువ సినిమాలు చెయ్యాలంటే యాక్టింగ్ స్కిల్స్, అదృష్టం తోడవటంతో పాటు గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ కి ఎలా మౌల్డ్ అవ్వాలి… ఏ సీన్ కోసం ఎంత నటించాలి అనేది లెక్కలు వేసుకుంటారు కానీ ఏపాత్రకి ఎంత గ్లామర్ గా కనిపించాలి? ఎలాంటి లుక్ లో కనిపించాలి? అనే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోరు. అలా జాగ్రత్తలు తీసుకున్న వారు ఎక్కువ కాలం కెరీర్ కొనసాగిస్తారు. అలా అని కేవలం స్కిన్ షోతోనే స్టార్ హీరోయిన్ అయిపోలేరు. ముందు చెప్పినట్లు యాక్టింగ్ టాలెంట్ తో పాటు పిసరంత అదృష్టం కూడా ఉండాలి. సింపుల్ గా చెప్పాలి అంటే యాక్టింగ్ అండ్ గ్లామర్ బాలన్స్ చేసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాల కెరీర్ ఉంటుంది. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా లైమ్ లైట్ లో ఉండడం కష్టం. ఈ విషయాన్ని మీరా జాస్మిన్ వంటి వాళ్లని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న యాక్టింగ్ టాలెంట్ ఉన్న ఈ మలయాళ బ్యూటీ తెలుగులో ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన కూడా నటించింది. హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న మీరా జాస్మిన్ అక్కడే ఆగిపోయింది.
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘లేడీ గాగా’ పోస్టర్…
జోకర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ అనేది జోక్విన్ ఫీనిక్స్ నటించిన 2019 బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి క్విన్‌గా ‘లేడీ గాగా’ ఫస్ట్ లుక్ ని టాడ్ ఫిలిప్స్ రిలీజ్ చేశాడు. 2022 ఆగస్టులోనే జోకర్ సీక్వెల్‌లో నటిస్తున్నానని ‘గాగా’ అనౌన్స్ చేసింది కానీ ఇప్పటివరకూ ఆమె లుక్ ఏంటి? జోకర్ 2లో ‘గాగా’ ఎలా కనిపించబోతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఆ వెయిటింగ్ ని బ్రేక్ చేస్తూ… ఈ మూవీలో గాగా ఎలా కనిపించబోతుందో రివీల్ చేసేసాడు టాడ్ ఫిలిప్స్. డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ అప్‌లోడ్ చేసిన ఫోటోలో జోక్విన్ ఫీనిక్స్ ప్లే చేసిన ‘జోకర్’తో పాటు గాగా ఒక వాల్ కి ఆనుకుని నిలబడి ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఆమె చేతులు అతని చెంపలపై ఉన్నాయి. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ, ఫిలిప్స్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. హార్లే యొక్క మూల కథలో “హర్లీన్ క్వింజెల్” అనే థెరపిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలో గాగా మొదటిసారిగా జోకర్‌ను కలుసుకోవడాన్ని ఈ పోస్టర్ ఇమ్పర్సోనేట్ చేస్తుంది. ఫిలిప్స్ లేడీ గాగాతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. వీరిద్దరు గతంలో ఎ స్టార్ ఈజ్ బోర్న్ చిత్రంలో కలిసి పనిచేశారు. మరి పార్ట్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జోకర్ ఫిల్మ్ యూనిట్, జోకర్ 2తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.