సెక్స్ వర్కర్లలో ఏపీ టాప్..
సెక్స్ వర్కర్ల విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాకాంలు ఆందోళన కలిగిస్తున్నాయి.. సెక్స్ వర్కర్లను రెండు కేటగిరీలుగా విభజించి గణాంకాలు విడుదల చేసింది కేంద్రం.. అయితే, ఓ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అనూహ్యకంగా టాప్ స్పాట్‌కు దూసుకొచ్చింది.. ఇంకో జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఇక, ఆ జాబితాల విషానికి వస్తే.. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను, స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అంటూ.. రెండు కేటగిరీలుగా విభజించింది కేంద్రం.. అందులో.. స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో.. అగ్రస్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్.. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం స్థానిక సెక్స్ వర్కర్లు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉండగా.. 1.16 లక్షల మంది సెక్స్ వర్కర్లతో కర్ణాటక రెండో స్థానంలో.. లక్ష మంది సెక్స్ వర్కర్లతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.. ఇక, అత్యధికంగా సెక్స్‌వర్లు ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. మహారాష్ట్రను విడిచిపెట్టి 6.6 లక్షల మంది వలస సెక్స్ వర్కర్లు దేశంలో నివసిస్తుంటే.. గుజరాత్‌లో 2.3 లక్షల మంది.. ఢిల్లీలో 2.3 లక్షల మంది.. ఇలా వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి.. అయితే, ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం..
దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది అని మండిపడ్డారు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ.. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ఈనెల 29న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విజయవాడలోని రాజ్ భవన్ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపడతామన్న ఆయన.. సీబీఐ, ఈడీ వ్యవస్థలు బ్లాక్ మెయిల్స్ గా మారాయని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో ఉంటే ఎటువంటి ఈడీ దాడులు ఉండవని మండిపడ్డారు.. ఇక, రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుకులకు గురవుతున్నారు.. ఆర్బీకే సెంటర్లలో రైతులకు సంచులు ఇచ్చే గతి కూడా లేదని ఆరోపించారు.. సీఎం వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల కోసమే ఆలోచిస్తున్నాడు.. సీఎం జగన్ గడప గడపకు కాదు.. పొలాలకు వెళ్లాలని సూచించారు రామకృష్ణ.
తెలంగాణ సర్కార్‌కు భారీ జరిమానా..
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో 900 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటి విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణపై 300 కోట్ల జరిమానా విధించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 528 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. డిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92.8 కోట్ల నష్టం జరిమానా, ఈ జరిమానాలన్నీ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద జమ చేయాలని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇక అక్టోబర్ 3, 2022న తెలంగాణ సర్కార్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు.. తీర్పులు అమలు చేయకపోవడంపై 3,800 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని స్పెషల్ అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణపై చర్యలు తీసుకుని, పురోగతి తెలుపాలని సూచించింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య , వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎన్.జీ.టీకి బదిలీ చేసింది. దీంతో పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మరోసారి భూముల వేలానికి సిద్ధమైన సర్కార్.. నోటిఫికేషన్ విడుదల
ఆదాయం సమకూర్చునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేసి ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్లాట్లను వేలం వేయాలని HMDA నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ, గండిపేటలోని 366 సర్వే నెంబర్‌లో ఉన్న 41 వేల 971 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు విక్రయానికి ఉండగా.. వాటి ధర గజానికి 60 వేలు, 35వేలు, లక్షా 10 వేలుగా ఒక్కో చోట ఒక్కో విధంగా ధరను నిర్ణయించారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, ఆర్‌సీపురం, అమీన్‌పూర్, జిన్నారం ప్రాంతాల్లో 41 వేల 38 గజాలు…. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్, కూకట్‌పల్లి, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్‌లో 25 వేల 228 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లను విక్రయించనున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది HMDA. ప్రాంతాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు వేలాలకు సంబంధించి ప్రీ బిడ్ సమావేశం… జనవరి 4న రంగారెడ్డి, 5న సంగారెడ్డి, 6న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించనున్నారు. ప్లాట్ల వేలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజుకు జనవరి 16 వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఈఎండీ చెల్లింపునుకు జనవరి 17 వరకు గడువు విధించింది. ఇక, జనవరి 18 భూముల వేలం ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి జనవరి 4,5,6 తేదీల్లో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా హెచ్‌ఎండీఏ తెలిపింది. ఇక, గతంలో కూడా ప్రభుత్వ భూముల వేలం ద్వారా కేసీఆర్ సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరిన విషయం విదితమే.
ఉపాధి హామీ పనులపై కేంద్ర దుష్ప్రచారం
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు ఆందోళన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు. గ్రామాలలో కొవిడ్ కష్టకాలం తర్వతా ఉపాది అవకాశాలు తగ్గాయని, గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
న్యూయార్క్ అబ్బాయి, తెలుగమ్మాయి… హైదరాబాద్‌లో ఒక్కటయ్యారు..
ప్రేమకు కులం, మతం, రంగు, రూపమే కాదు.. దూరం కూడా భారం కాదు.. ఇప్పటికే ఎంతోమంది ప్రేమికులు సప్తసముద్రాలు దాడి ఏడు అడుగులు వేసినవారు ఉన్నారు.. ఖండాంతరాలు దాటి ఒక్కటైన వారు ఉన్నారు.. తాజాగా.. ఓ జంట ఈ కోవలో చేరింది.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అబ్బాయిని.. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంది.. 26 సవత్సరాల పరిచయం ప్రేమగా మారి ఒక్కటైన సంబరానికి హైదరాబాద్ శివారు ప్రాంతం వేదికైంది.. ప్రాంతాలు వేరైనా ఒకరి సంస్కృతి అంటే ఒకరికి అభిమానం.. న్యూయార్క్ కు చెందిన గ్రేగారీ (అబ్బాయి), హైదరాబాద్ కు చెందిన మేఘన(అమ్మాయి) ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయమై 26 ఏళ్లు గడిచింది.. తొలి పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమకు దారితీసింది.. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు.. వివాహం చేసుకోవాలని అనుకున్నారు.. ఇరువురి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమ అర్థం చేసుకున్నారు.. దీంతో, హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైభంగా వీరి వివాహం జరిగింది.. బంధుమిత్రులు, ఈ ప్రేమ జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ ప్రేమ పెళ్లి చేయడం వారికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రేగారీ లాంటి అబ్బాయి దొరకటం తమ అమ్మాయి చేసుకున్న అదృష్టమని వధువులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నా ప్రియుడు మంచి వ్యక్తి అంటే.. నా ప్రియురాలు చాలా మంచిదంటూ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు ఈ కొత్త జంట.
‘బాబూజీ’గా జగజ్జీవన్ రామ్ బయోపిక్!
మాజీ ఉప ప్రధాని, స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దిలీప్ రాజా. గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన ఆయన ప్రస్తుతం ‘బాబూజీ’ పేరుతో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ ను రూపొందిస్తున్నారు. మాజీ ఐఎయస్ అధికారి డాక్టర్ బి. రామాంజనేయులు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. జగజ్జీవన్ రామ్ కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తుండగా టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ అనుచరుడిగా బాబూ జగజ్జీవన్ రామ్ సత్యాగ్రహల్లో పాల్గొని బ్రిటీష్ జైళ్లల్లో గడిపిన రోజుల్లో జరిగిన సంఘటనలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నామని, ఇందులో సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాలవీయ, జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, భగత్ సింగ్ , ఇందిరా గాంధీ పాత్రలు కీలకంగా వుంటాయని దర్శకుడు చెప్పారు. రెండవ షెడ్యూలును బీహార్ లోని చాంద్వ గ్రామంలో చిత్రీకించనున్నట్లు తెలిపారు. జగజ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారత్ – పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను కాశ్మీర్ బోర్డర్ లో చిత్రీకరిస్తామని, ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి కోరినట్లు చెప్పారు. పసుపులేటి నాగేశ్వర రావు, మహమ్మద్ రహంతుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దిలీప్ రాజా.