మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ.. లోకాయుక్త కోర్టు సీరియస్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ ఆక్రమణ ఆరోపణలపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగిన ఈ భూ కబ్జా వ్యవహారం తాజాగా అధికారిక నివేదికలు, ఆధారాలతో మరో కీలక మలుపు తిరిగింది.. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు నిర్ధారితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా అనుమానాలు బలపడుతున్నాయి. బి.కె. పల్లి గ్రామంలో సర్వే నంబర్ 8/1 పరిధిలో ఉన్న 2.92 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని దొమ్మలపాటి రమేష్ ఆక్రమించినట్టు ఫిర్యాదు నిర్ధారణకు వచ్చింది. ఈ భూమి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి, ఆయన భార్య సరళ పేరున నకిలీ పట్టాదారుపత్రం ఆధారంగా ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. కలెక్టర్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూసాయి.. అప్పటి తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI), వీఆర్వో (VRO), వీఆర్ఏలు మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారని కలెక్టర్ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. సెలవు రోజైన ఆదివారం నాడు అప్పటి తహశీల్దార్ శివరామిరెడ్డి రికార్డులు మార్చినట్టు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా.. ప్రభుత్వం ఐదుగురు రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, ఆయన భార్యతో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్
నూజివీడు మండలంలోని మంగో బే రిసార్ట్ & క్లబ్‌లో జరుగుతున్న పేకాట/13 కార్డ్స్ పందాలు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 13 కార్డ్స్ లేదా ఇతర డబ్బుకు సంబంధించిన పందాలకు సంబంధించి ఏ ఆటను కొనసాగించవద్దు అని స్పష్టం చేసింది హైకోర్టు.. ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించినప్పుడు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.. ప్రత్యేకించి, కేసు పరిశీలన కోసం క్లబ్ నిర్వాహకులు విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే.. క్లబ్ నిర్వాహకులు పందాలకు సంబంధించిన వార్షిక పనులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అంటూ ప్రచారాలు చేసి.. మరలా పేకాట కార్యకలాపాలను నడిపిన విషయంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. మంగళవారం మాంగో బే క్లబ్‌లో పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. 285 మందిని పేకాట ఆడుతూ పట్టుబడ్డారని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందులో 34 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు.. అదనంగా 128 కార్లు, 40 కి పైగా ద్విచక్రవాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు స్థానికంగా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది.. ఎందుకంటే క్లబ్ నిర్వాహకులు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు పెట్టించి పందాలు నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది.. పందాల నిర్వహణకు నేరానికి సంబంధించిన చట్ట పరిమితులు వర్తిస్తాయని, ఈ క్రమంలో వారి నిర్వాహకులు కూడా బాధ్యతాయుతంగా విచారణలో సహకరించాలని, ముందుగా ఇచ్చిన ఆదేశాలు పాటించాలని.. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. మొత్తంగా హైకోర్టులో నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ నిర్వాహకులకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది..
బెజవాడ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. బెంగళూరు యువతి ఎంట్రీతో..!
బెజవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కొత్త సంవత్సరం వేడుకల వేళ బెజవాడలో వెలుగుచూసిన MDMA డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన వేములపల్లి గ్రీష్మ అనే యువతిని పోలీసులు నిందితురాలిగా చేర్చడంతో వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా MDMA డ్రగ్స్‌ను తీసుకుని విజయవాడకు వచ్చిన ఏ4 నిందితుడు మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాయత్రి నగర్ సమీపంలోని ఓ పబ్‌కు వెళ్తుండగా మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. విచారణలో మహేష్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టాడు. బెంగళూరులో వేములపల్లి గ్రీష్మ వద్ద అతడు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మహేష్‌తో పాటు అతని స్నేహితులకు కూడా గ్రీష్మ గత కొన్నాళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. మహేష్ ఫోన్ ద్వారా గ్రీష్మకు చేసిన డిజిటల్ పేమెంట్స్ స్క్రీన్‌షాట్లు, ట్రాన్సాక్షన్ డేటాను పోలీసులు కీలక ఆధారాలుగా సేకరించారు. దీని ఆధారంగా మహేష్, అతని స్నేహితులకు గ్రీష్మ రెగ్యులర్‌గా డ్రగ్స్ అమ్ముతున్నట్టు నిర్ధారించినట్టు అధికారులు తెలిపారు. అయితే, కేసులో పేరు చేర్చినప్పటి నుంచి గ్రీష్మ పరారీలో ఉంది. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని బెంగళూరుకు పంపినట్టు విజయవాడ పోలీసులు ప్రకటించారు. గ్రీష్మను పట్టుకుని విచారణకు తీసుకొచ్చిన తర్వాతే డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసింది..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం.. చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అలాగే, సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీపై కూడా త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే, గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది.. గత సర్కార్ కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు..
ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ఫ్రీ బస్సు పథకం తీసుకు రావడంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 11000 ఆటో డ్రైవర్లకు అందిస్తామని రెండేళ్లైన ఇవ్వలేదని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ఆటో యూనియన్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆటో యూనియన్ కార్మికుల ముట్టడి పిలుపుతో అసెంబ్లీ బయట పోలీసులు భారీగా మొహరించారు. అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందన్న ఎలాంటి నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. అసెంబ్లీ వద్ద ఎలాంటి నిరసన చేయొద్దని సూచించారు.
మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి కూటమి జోరు.. పోలింగ్‌కు ముందే 68 సీట్లు
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన సత్తా చాటింది. ఈ ఎన్నికలకు జనవరి 15న ఓటింగ్ జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. దీంతో అనేక పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ లేకుండానే విజయాలు దక్కాయి. ఈ 68 ఏకగ్రీవ విజయాల్లో 44 స్థానాలు బీజేపీ ఖాతాలోకి చేరాయి. ఇందులో థానే జిల్లాలోని కల్యాణ్–డొంబివలి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అత్యధిక స్థానాలు వచ్చాయి. అలాగే పుణె, పింప్రి చించ్వాడ్, పన్వేల్, భివండి, ధూలే, జల్గావ్, అహిల్యానగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా బీజేపీకి ఏకగ్రీవ విజయాలు లభించాయి. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 22 స్థానాలు పోటీ లేకుండానే దక్కగా, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (ఎన్‌సీపీ) రెండు స్థానాలు ఏకగ్రీవంగా వచ్చాయి. పుణెలో 35వ వార్డులో బీజేపీ అభ్యర్థులు మంజుషా నాగపురే, శ్రీకాంత్ జగ్తాప్‌లను ప్రత్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించారు. వీరిద్దరూ 2017 నుంచి 2022 వరకు అదే వార్డును ప్రాతినిధ్యం వహించారు.
అభయారణ్యంలో కాల్పుల మోత.. 14 మంది మావోయిస్టులు హతం
అభయారణ్యంలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని కొంటా కిస్తారామ్ అడవుల్లో మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతం అయ్యారు. కొంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మగ్దూ హతమయ్యాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. AK47, INSAS వంటి ఆటోమేటిక్ ఆయుధాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతంసుక్మా DRG సిబ్బంది సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.
మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు రద్దు..? నిజమేంటి..?
భారత్‌లో నోట్ల రద్దు తీవ్ర కలకలమే సృష్టించింది.. ముందుగా.. వెయ్యి రూపాయల నోట్లు, పాత రూ.500 నోట్ల రద్దు చేసిన ఆర్బీఐ.. ఆ తర్వాత రూ.2000 నోట్లను తీసుకొచ్చినా.. వాటిని కూడా రద్దు చేసింది.. అయితే, ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో అతిపెద్ద నోటుగా ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది.. 500 రూపాయల నోటును రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్‌గా మారిపోయింది.. మార్చి 2026 నుండి ప్రభుత్వం 500 రూపాయల నోటును రద్దు చేస్తుందని ఆ సందేశం పేర్కొంది. అయితే, ప్రభుత్వం దీనిపై స్పందించింది. ప్రభుత్వ సంస్థ PIB Xలో ఒక పోస్ట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చింది.. PIB తన ఫ్యాక్ట్-చెక్ నివేదికలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి రూ.500 నోట్లను రద్దు చేసే ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదని పేర్కొంది. ఈ వాదన పూర్తిగా అబద్ధం. రూ.500 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయి.. అంతేకాదు ఏ లావాదేవీకైనా ఉపయోగించవచ్చు. ప్రజలు ఇలాంటి పుకార్లను పట్టించుకోకూడదు అని స్పష్టం చేసింది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నివేదించింది. ఈ వాదన అబద్ధం.. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది.. “ఇటువంటి వార్తలను నమ్మే ముందు, దాని నిజాయితీని ధృవీకరించండి మరియు నకిలీ వార్తలను ఎప్పుడూ ఫార్వార్డ్ చేయవద్దు.. 500 రూపాయల నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి మరియు చెల్లుబాటులో ఉన్నాయి.” అని పేర్కొంది PIB.
యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. ఫీచర్స్ ఇవేనా..?
యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్ మోడల్స్ కోసం.. ఐఫోన్ ప్రేమికులు ఎంతగానో వేచి చూస్తుంటారు.. ఇక, ఫోల్డబుల్ ఫోన్స్ హవా కూడా కొనసాగుతోంది.. ఇతర మొబైల్ కంపెనీలు.. ఇప్పటికే పలు రకాల ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురాగా.. ఇప్పుడు యాపిల్ కూడా తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. యాపిల్ అభిమానులు చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రంగంలో శామ్‌సంగ్ నంబర్ వన్ అయినప్పటికీ, ఈ సంవత్సరం సమీకరణం మారవచ్చు. యాపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ ఫోల్డ్‌ను విడుదల చేయవచ్చు. కంపెనీ ఫోల్డ్ గురించి ఎటువంటి సూచనలు ఇవ్వనప్పటికీ, ఈ సంవత్సరం కంపెనీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 2026 యాపిల్ చరిత్రలో ఒక పెద్ద సంవత్సరం కావచ్చు, ఎందుకంటే ఇది ఫోల్డబుల్‌లను మాత్రమే కాకుండా AI గ్లాసెస్‌ను కూడా విడుదల చేయబోతోంది.. యాపిల్ యొక్క AI గ్లాసెస్ యొక్క ప్రోటోటైప్‌లు ఇంతకు ముందు కనిపించాయి.. కొన్ని లీక్‌లు కూడా బయటపడ్డాయి. ఇక, నివేదికల ప్రకారం, ఐఫోన్ ఫోల్డ్ 5.25-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది, అయితే అంతర్గత డిస్‌ప్లే 7.6 అంగుళాలు ఉంటుంది. రెండూ AMOLED ప్యానెల్‌లు. అయితే, ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫేస్ ఐడి ఉండదని కూడా నివేదించబడుతోంది. కారణం ఏమిటంటే కంపెనీ దానిని సన్నగా చేయాలనుకుంటోంది.
మగువలకు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే…!
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వీకెండ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.380 తగ్గగా.. కిలో వెండిపై రూ. 2,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.380 తగ్గగా.. రూ.1,35,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 తగ్గగా రూ.1,24,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.280 తగ్గగా రూ.1,01,870 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర ఉపశమనం కలిగించింది. ఈరోజు కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,56,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది.
హిందువులపై దాడులు.. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ బౌలర్‌ను ఔట్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తొలగించాలని చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొంతకాలంగా పెరుగుతున్న ప్రజా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొదట బీసీసీఐ వేచి చూసింది. ఇటీవలి పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సైకియా చెప్పారు. ఇది బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న దౌత్య పరిస్థితులు, అక్కడ జరుగుతున్న పౌర అశాంతి, అలాగే భారత్‌లో చోటు చేసుకుంటున్న నిరసనలపై పరోక్ష సూచనగా భావిస్తున్నారు. మరోవైపు.. డిసెంబర్‌లో జరిగిన వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రికార్డు స్థాయిలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా అతను నిలిచాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్‌కు వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ పెద్ద ఎదురుదెబ్బగా మారాడు. రూ.9.20 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ముస్తాఫిజుర్‌ను తీసుకోవడం నిరాశను మిగిల్చింది.. ప్రపంచ స్థాయి మైదానాల్లో మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఈ బౌలర్‌ను జట్టుకు పెద్ద బలంగా కేకేఆర్ భావించింది. ఓ వైపు సీజన్ దగ్గరపడుతుండటం.. మరోవైపు.. ఈ బౌలర్‌ను కోల్పోవడంతో బౌలింగ్ విభాగంలో పెద్ద లోటు ఏర్పడింది. దీంతో చివరి ఓవర్ల భారం పూర్తిగా మతీష పతిరానాపై పడే అవకాశం ఉంది.
ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఒక వినూత్నమైన పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కాస్త మొహమాట పడుతుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం ఆయన ఏకంగా ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ముచ్చటించబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో కేవలం ప్రభాస్, సందీప్ మాత్రమే ఉండరు. ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు, ప్రభాస్ వ్యక్తిగత విషయాలు, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది. ‘రాజా సాబ్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెరవనున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు మరియు ప్రభాస్‌ను కలిపి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ప్రశ్నలు అడగబోతున్నారని సమాచారం. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా చర్చించనున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ‘రాజా సాబ్’ గ్లింప్స్ చూస్తుంటే, డార్లింగ్ ఫ్యాన్స్‌కు ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ కాలం నాటి వింటేజ్ ప్రభాస్ మళ్ళీ కనిపిస్తున్నాడు. అందుకే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా అంతే సరదాగా, సందడిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ఒక వైబ్. మరి వీరిద్దరి మధ్య సాగే ఈ చిట్ చాట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!
షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వైష్ణవే? ఇదిగో ప్రూఫ్!
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న షణ్నూ, తాజాగా తన కొత్త ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే ఆమె పేరును పూర్తిగా వెల్లడించకుండా కేవలం ‘V’ అనే అక్షరంతో హింట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఆ ‘V’ మరెవరో కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వైష్ణవి చోడిశెట్టి అని తెలుస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ తన ఇన్‌స్టాగ్రామ్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ఒక అమ్మాయి చేయి పట్టుకుని, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ “న్యూ బిగినింగ్స్” అంటూ కొన్ని ఎమోజీలను జత చేశాడు. పేరు స్థానంలో కేవలం ‘V’ అని మాత్రమే పేర్కొన్నాడు. దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్నాడు. ఆ మధ్యకాలంలో తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, డిప్రెషన్‌ను పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి కొత్త వ్యక్తి రావడంతో షణ్నూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.