రాజధాని పనులు పరిశీలించి మంత్రి నారాయణ.. కీలక వ్యాఖ్యలు..
రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25 నిర్మాణాలు ఉన్నాయి.. 18 నెలల కాలంలో పూర్తి చెయ్యాలనే దిశగా సూచనలు చేశారు నారాయణ.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం.. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ.. 43 వేల కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచాము. అధికారులు ఎమ్మెల్యే ల భవనాలు.. మంత్రులు.. జడ్జీల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ, గత ప్రభుత్వం ఇదేమి పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి.. ఐఐటీ మద్రాస్ ను పిలిచి బిల్డింగ్ నాణ్యత.. పరిశీలించి కాంట్రాక్టర్లు తో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం.. 90 శాతం పనులు టెండర్లు కంప్లీట్ అయ్యాయి.. మొదట క్లీనింగ్ తో పనులు మొదలు అయ్యాయి.. ఇవాళ సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ బంగళాలు పరిశీలించాం.. 186 బంగాళాలు మంత్రులు జడ్జీలు.. సెక్రెటరీలకు వస్తున్నాయి.. గెజిటెడ్ అధికారులకు 1440.. ఎన్జీవో లకుబ్1995 నిర్మాణాలు వస్తున్నాయి.. హై కోర్టు 16.85 లక్షల చదరవు అడుగులు వస్తుంది.. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తు లో వస్తుంది… పనులు 15 రోజుల్లో మొదలు అవుతాయి. మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని వెల్లడించారు.
మరో మాజీ మంత్రిపై కేసు నమోదు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గనికి సంబంధించి లీజు కాలం ముగియడంతో.. వైసీపీ నేతలు దానిని ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని.. అంతేకాక రాళ్ళను పేల్చేందుకు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశారని.. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైన్ వద్దే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు ఉపయోగించే జిలేటెన్ స్టిక్స్ తో పాటు ఇతర రసాయనాలను అధికారులకు అప్పగించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అక్రమ మైనింగ్ పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి పదిమందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో ఏ1గా.. వైసీపీ నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి.. ఏ2గా వాకాటి శివారెడ్డి. ఏ3 గా వాకాటి శ్రీనివాసులురెడ్డి. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ..
నిరుద్యోగులకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొట్టిగా అమలు చేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కీలక అంశాలను ప్రస్తావించారు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు సదస్సుకు హాజరుకాలేదన్నారు.. అయితే, వచ్చే మూడు నెలలకు ఎలా పని చేయాలో ప్లాన్ చేసుకోవాలని సూచించారు.. ప్రజల్లో ఇంత ప్రేస్టేషన్ ఎప్పుడు రాలేదు.. అందుకే మొన్న ఎన్నికల్లో అంత మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు.. ఇక, ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
కలెక్టర్లుకు సీఎం స్వీట్ వార్నింగ్..
ఏపీ సచివాలయంలో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.. అయితే, కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు… విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు.. సోలార్ పవర్‌లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో కలెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు.. ప్రజల్లో అత్యంత ప్రభావం కలిగించే వ్యక్తి కలెక్టర్.. కెరీర్‌లో కలెక్టర్… చీఫ్ సెక్రెటరీకి ఇవే ముఖ్యం అన్నారు.. ఇక, రొటీన్‌గా ఉంటే ఏడాది అవుతుంది.. మరో నాలుగేళ్లు కూడా గడిచిపోతాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఈ ప్రభుత్వం.. సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన… ఈ మూడు గుర్తుండాలి.. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమం కావాలి.. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది.. కేవలం పెన్షన్ల కోసం ఏడాదికి 33 వేల కోట్లు అవుతోందని వెల్లడించారు. అమరావతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వామ్యం చేయాలన్నారు.. 20 లక్షల మందికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్లు.. సోలార్ రూఫ్ టాప్ పై దృష్టి పెట్టాలన్నారు.. ప్రీ మాన్ సూన్ పోస్ట్ మాన్ సూన్ పై దృష్టి సారించాలి.. ప్రతి జిల్లా కలెక్టరు అరకు కాఫీ పై ఫోకస్ చేయాలన్నారు.. మరోవైపు, మే నెలలో తల్లికి వందనం ఇస్తాం.. త్వరలో విధి విధానాలు వస్తాయని తెలిపారు. 26 జిల్లాల కలెక్టర్ల పెర్ఫామెన్స్ పై సమీక్ష జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047.. వికసిత్ భారత్ పై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు.. అందుకు అనుగుణంగా.. 175 నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్‌లు ఉంటాయన్నారు.. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి చైర్మన్ గా ఉంటారని తెలిపారు సీఎం చంద్రబాబు..
నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు.. బహిరంగంగా వద్దు..!
నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాకరేపుతోంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. జనాభా ప్రతిపాదికన పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టపోనున్నాయి.. దీనిపై ఇప్పటికే చెన్నై వేదిక తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు.. నియోజకవర్గాల పునర్విభజనపై గళమెత్తాలని నిర్ణయించారు.. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్రంతో అంతర్గతంగామాట్లాడుతున్నారన్న ఆయన.. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొన్నారు.. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయి.. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
డిప్యూటీ సీఎంని కలిసిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి.. ఎందుకంటే?
హైదరాబాద్ నగరంలోని ఘాట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై మల్లారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చించిన భట్టి విక్రమార్క, పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
మేడ్చలో క్రికెట్ బెట్టింగ్‌కి యువకుడు బలి..
తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. బెట్టింగ్‌లో డబ్బు కోల్పోయిన ఓ యువకుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో మోజు పడి భారీగా డబ్బును పెట్టుబడి పెట్టాడు. అయితే, కొద్ది రోజులుగా జరిగిన మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోవడంతో రూ.2 లక్షలు కోల్పోయాడు. అప్పులు పెరగడంతో మనస్తాపానికి
గురైన అతను, కుటుంబ సభ్యులకు చెప్పకుండా గౌడవెల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. తాజాగా ఇదే అంశంపై షిండే తొలిసారి స్పందించారు. బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడారు. తనను ‘ద్రోహి’ అని సంభోదించాడంటే కచ్చితంగా ప్రత్యర్థుల దగ్గర సుపారీ తీసుకునే మాట్లాడినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమే.. కానీ ఒకరి ఆదేశం మేరకు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. అయితే కార్యకర్తలు చేసిన విధ్వంసాన్ని సమర్థించనన్నారు. ఈ సందర్భంగా న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తుచేశారు. ‘‘చర్యకు.. ప్రతిచర్య’’ అనేది ఉంటుందని షిండే వ్యాఖ్యానించారు. ఇక ‘‘నా గురించి మరిపోండి.. కునాల్ అనే వ్యక్తి.. ప్రధానమంత్రి మోడీ గురించి.. మాజీ ప్రధాన న్యాయమూర్తి గురించి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురించి? హోంమంత్రి అమిత్ షా గురించి.. పారిశ్రామిక వేత్తల గురించి ఏమన్నాడో తెలిసిందే కదా?.’’ అని పాత విషయాలను షిండే గుర్తుచేశారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది. వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకుంటాం. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఎవరి గురించైనా వ్యతిరేకంగా మాట్లాడటానికి కాంట్రాక్ట్ తీసుకుని ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు.
ఎమర్జెన్సీగా ఢిల్లీ టూర్‌కు పళినిస్వామి.. బీజేపీ అగ్ర నేతలను కలిసే అవకాశం
దక్షిణాదిలో డీలిమిటేషన్ వ్యవహారం కాకరేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటానికి దిగారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో డీఎంకే సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇటీవల చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరై తమ గళాన్ని తెలియజేశారు. డీలిమిటేషన్‌తో ఏర్పడే విపత్తును గురించి ప్రస్తావించారు. తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే డీలిమిటేషన్‌పై ఉద్యమం ఉధృతం అవుతున్న వేళ బీజేపీ అధిష్టానం అప్రమత్తం అయింది. తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాని కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళినిస్వామికి కబురు పంపింది. దీంతో ఆయన ఎమర్జెన్సీగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలను కలిసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ఛాన్సుందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి బీజేపీ-ఏఐడీఎంకే పొత్తు ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఏఐడీఎంకే పార్టీ ఆఫీసును ఈపీఎస్ ప్రారంభించనున్నారు.
స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!
నేహా కక్కర్… బాలీవుడ్ సింగర్. ప్రముఖ గాయకులు టోనీ కక్కర్, సోను కక్కర్‌ల చెల్లెలు. నేహా కక్కర్ చిన్న వయసులోనే మతపరమైన కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ పాపులారిటీ సంపాదించింది. ఇక నేహా ‘మీరాబాయి నాటౌట్’ సినిమాతో నేపథ్య గాయనిగా హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘‘ఇండియన్ ఐడల్’’ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఒక గుర్తింపు సింగర్‌గా కొనసాగుతోంది. అయితే ఇటీవల మెల్‌బోర్న్‌లో నేహా కక్కర్ కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. స్టేడియం అంతా సందడి సందడిగా ఉంది. అయితే ఎంత ఎదురుచూసినా నేహా కార్యక్రమం ప్రారంభం కాలేదు. గంట.. రెండు.. మూడు గంటలైంది. అయినా కూడా కచేరీ ప్రారంభం కాలేదు. నేహా కోసం అభిమానులంతా అలా ఎదురుచూస్తూనే ఉన్నారు. చూసి.. చూసి ఒకింత ప్రేక్షకుల్లో కోపం చెలరేగింది. మొత్తానికి 3 గంటలు ఆలస్యంగా స్టేజ్‌పైకి వచ్చింది. దీన్ని గమనించిన నేహా.. స్టేజ్‌పైకి వచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. మూడు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు తనను క్షమించాలంటూ అభ్యర్థించింది. ఇంత ఆలస్యంగా వచ్చినా.. తన కోసం ఇంత ఓపికగా వేచి ఉన్న ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ శిరసు వంచి అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
కబడ్డీ మాజీ ప్లేయర్ దీపక్ హుడాను చితకబాదిన భార్య స్వీటీ బూరా (వీడియో)
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వాస్తవానికి.. హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మోసం, దాడి, వరకట్న వేధింపుల కేసులో ఇరువర్గాలను విచారణకు పిలిచారు. అంతర్జాతీయ బాక్సర్ అయిన స్వీటీ, ఆమె మామ, తండ్రితో కలిసి తనను కొట్టారని దీపక్ ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు ఆధారంగా, సదర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25న స్వీటీ తనపై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. “ఈ విషయంలో విచారణ కోసం మార్చి 15న నన్ను హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. స్వీటీ, ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సమయంలో, నాకు, స్వీటీకి మధ్య గొడవ జరిగింది. అది తీవ్రం కావడంతో, స్వీటీ నాపై దాడి చేసింది. ఆమె తండ్రి, మామ కూడా చేరారు. నాకు గాయాలు అయ్యాయి. నేరుగా హిసార్‌లోని సివిల్ ఆసుపత్రికి వెళ్లాను. చికిత్స పొందిన తర్వాత, మార్చి 16న సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.” అని దీపక్ పేర్కొన్నారు.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలోకి టాల్ బ్యూటీ
సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలకు ఎప్పుడూ డిమాండే. గతంలో కొత్త వాళ్ళను, కాస్త ఎస్టాబ్లీష్ అవుతున్న ముద్దుగుమ్మలను తెచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లను చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్‌లో ఫేమస్ హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు. ఇక ఇదే అదును అనుకుని ముంబయి ముద్దుగుమ్మలు కోర్కెల చిట్టా విప్పేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా లేనంత రెమ్యునరేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల మోజులో ఉన్న సౌత్ కూడా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు భామలు అడిగనంత ముట్ట చెబుతున్నారు ఫిల్మ్ మేకర్స్.. దేవర కోసం జాన్వీకి రూ. 5 కోట్లు ఇచ్చారని టాక్. అలాగే కల్కిలో సుమతి పాత్ర కోసం దీపికా పదుకొనే రూ. 20 కోట్లు చార్జ్ చేసింది. ఇక టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబీ కోసం ప్రియాంక ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే వీరందరి కన్నా సౌత్ ఇండస్ట్రీలోకి నేనే ముందొచ్చా నేనేందుకు డిమాండ్ చేయకూడదు అనుకుందే ఏమో కియారా అద్వానీ కూడా రెమ్యునరేషన్ పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ కోసం రూ. 7 నుండి రూ. 8 కోట్లు తీసుకున్న కియారా.. ఇప్పుడు టాక్సిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు అంటే డబుల్ చార్జ్ చేస్తుందని గట్టిగా బజ్ నడుస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ప్రియాంక, దీపికా, కంగనాలాంటి హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది కియారా. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తార సుతారియా లాంటి ముద్దుగుమ్మలు ఆడిపాడుతున్నారు. వీరిందరిలో కియారాకు క్రేజ్ ఎక్కువున్న నేపథ్యంలోనే ఆమెకు రూ. 15 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు టాక్. మేడమ్ చేతిలో టాక్సిక్ మాత్రమే కాకుండా హృతిక్-తారక్ వార్ 2 కూడా ఉంది.