ఏనుగుల గుంపు దాడిలో ఐదుగురు భక్తులు మృతి..
అన్నమయ్య జిల్లాలో విషాదయం చోటు చేసుకుంది.. ఓబులవారిపల్లి మండలం వై కోట గుండాల కోన సిద్దేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.. అయితే, క్షేత్రానికి వెళ్తున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరు రైల్వే కోడూరు మండలం కన్యగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు.. గుండాల కోనమీదుగా నడుచుకుంటూ తలకోనకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.. మొత్తం 14 మంది భక్తులు తలకోనకు వెళ్తుండగా.. దాడి చేసింది ఏనుగుల గుంపు.. ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.. వీరిలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు.. మరో 8 మంది సురక్షితం తప్పించుకున్నారు.. గాయపడ్డ క్షత గాత్రులను చికిత్స కోసం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు..
ఏనుగుల దాడిలో భక్తుల మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్..
జగన్ తీరుపై స్పీకర్ అసహనం
మాజీ సీఎం జగన్ తీరు పై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచి సంప్రదాయం కాదన్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అని స్పష్టం.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం పై వైసీపీకి అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు.. సభకు వచ్చి మాట్లాడచ్చు.. కానీ, ప్రసంగానికి ఆటంకం కలిగించడం మాత్రం మంచి పద్దతి కాదన్నారు.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కావొద్దన్నారు.. నిన్న పరిణామాలు చాలా బాధ అనిపించిందన్నారు స్పీకర్. అసెంబ్లీకి గవర్నర్ అతిధిగా వచ్చారు.. గవర్నర్‌ను అందరూ గౌరవించాలని అని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది.. ఒక ముఖ్యమంత్రి గా పని చేసి.. పార్టీ అధ్యక్షుడుగా ఉండి.. సభ్యత మర్చిపోయి ప్రవర్తించారని వైఎస్ జగన్‌పై మండిపడ్డారు.. కూర్చుని జగన్ నవ్వుకుంటున్నారు.. పైగా వారి సభ్యులను ఎంకరేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.. కాగితాలు చింపి పోడియం పై విసిరారు.. ఇది పద్ధతి కాదు.. సంప్రదాయం కాదని హితవుచెప్పారు.. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు.. పక్కన ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా తోడ్పాటు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.. వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో నలుగురు నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండడంతో.. వర్చువల్ గా నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, మార్చి 11వ తేదీ వరకు వల్లభనేని వంశీ సహా నిందితుల రిమార్డ్ పొడిగించారు.. మరోవైపు.. వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. మొదట నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.. మూడు రోజుల పాటు వల్లభనేని వంశీతో పాటు ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు..
ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్.. ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన వైపు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగలబోతోంది.. వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలో చేరగా.. బాలినేని ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరరేందుకు సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు.. పవన్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో- ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.. గత కొద్దికాలంగా జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్ల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం పలుసార్లు వాయిదా పడిందని నేతలు చెబుతున్నారు.. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీలో ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచారు పలువురు వైసీపీ నేతలు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన పార్టీలో చేరడంతో.. ఆయన వెంటనే నడుస్తామని ప్రకటించారు వైసీపీ కార్పొరేటర్లు.. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను తమ చేతుల్లోకి తీసుకుంది టీడీపీ.. తాజాగా, 23 మంది సభ్యులు జనసేనలో చేరితే ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం మారతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా, వైసీపీ కార్పొరేటర్లు జనసేన వైపు చూసినా.. వారిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి.. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి షాక్ ఇస్తూ.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు ఒంగోలు కార్పొరేటర్లు..
రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం!
రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్‌లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో మిగతా రాష్ట్రాల కంటే మనం ముందున్నాం అని.. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు 2025 జరుగుతోంది. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బయో ఆసియా సదస్సు 2025లో సీఎం రేవంత్ మాట్లాడుతూ… ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారింది. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోంది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్ మరియు బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయి. ముందునుంచీ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మేం ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టాం. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశాం. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.
సైకోగా మారిన యువకుడు.. ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు
కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడు సైకోగా మారి మారణహోమం సృష్టించాడు. ప్రియురాలి సహా ఆమె కుటుంబ సభ్యులను దారుణాతీదారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం వెంజరమూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపేసినట్టుగా పోలీసులకు చెప్పి నిందితుడు అఫాన్ (23) విషం తాగి లొంగిపోయాడు. దీంతో అఫాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అఫాన్ అనే యువకుడు.. ఒక అమ్మాయిను ప్రేమించాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. అఫాన్.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రియురాలి కుటుంబ సభ్యులను సుత్తి, కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే నిందితుడు.. తన తల్లిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె కేన్సర్ పేషెంట్. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటోంది. ప్రియురాలి ఫర్షానా, ఆమె సోదరుడు అహ్సాన్, అమ్మమ్మ సల్మా బివి, మామ లతీఫ్, అత్త షాహిదా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నిందితుడిపై రెండు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. హస్తానికి బై చెప్పినట్టేనా..!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. హస్తానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేకపోతే చెప్పాలని.. తన ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో దిగిన ఫొటోను శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్-యూకే మధ్య వాణిజ్య ఒప్పందం మెరుగుపడడం శుభపరిణామం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్, కేంద్రమంత్రి గోయల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటో తర్వాత శశిథరూర్ కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో ఉండగా ట్రంప్‌తో భేటీని కొనియడారు. అలాగే కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. దీంతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని సంకేతాలు ఇచ్చారు. తాజా పరిణామం మరింత బలపడుతోంది.
మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం.. 49 బిలియన్ యూరోల ముడి చమురుకొన్న భారత్
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడేళ్లు పూర్తి చేసుకుంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు.. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించి దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. వాటిలో ముడి చమురు ఎగుమతి కూడా ఉంది. అయితే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారు అయిన భారతదేశం, రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించింది. గత ఏడాది కాలంలో భారతదేశం రష్యా నుంచి 49 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. ఈ సమాచారాన్ని గ్లోబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందించింది. భారతదేశం ఎప్పటి నుంచో పశ్చిమాసియా నుండి చమురు కొనుగోలు చేస్తోంది. అయితే, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. పాశ్చాత్య ఆంక్షలు, కొన్ని యూరోపియన్ దేశాలు కొనుగోలు చేయకుండా ఉండడం వలన, రష్యన్ చమురు ఇతర అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే భారీ తగ్గింపుతో లభించింది. దీని ఫలితంగా భారతదేశం రష్యన్ చమురు దిగుమతులు పెరిగాయి. మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఒక శాతం నుండి 40 శాతానికి పెరిగాయి.
90శాతం మంది భారతీయుల్లో ఆ వైరస్.. దాని గురించి తెలియని వాళ్లు 56.6% మంది
మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇటీవలి సర్వే ప్రకారం.. ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 56.6శాతం మందికి దాని గురించి తెలియదు. ఈ వైరస్ వరిసెల్లా-జోస్టర్. ఇది ఒకప్పుడు చికెన్‌పాక్స్‌కు కారణమైంది. ఇప్పుడు శరీరంలో క్రియారహితంగా ఉంది. వరిసెల్లా-జోస్టర్ వైరస్ (VZV) అనేది బాల్య చికెన్‌పాక్స్‌కు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ మన శరీరంలోని నాడీ వ్యవస్థలో నిద్రాణంగా ఉంటుంది. కానీ వృద్ధాప్యం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతో ఇది మళ్లీ చురుగ్గా మారవచ్చు. దీని కారణంగా షింగిల్స్ అనే వ్యాధి వస్తుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. షింగిల్స్ అనేది ఒక చర్మ వ్యాధి. దీని వల్ల శరీరంపై ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. కానీ ఇది చర్మానికి మాత్రమే పరిమితం కాదు. ఇది తీవ్రమైన మంట, జలదరింపు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి దీర్ఘకాలిక పోస్ట్-హెర్పెటిక్ న్యూరల్జియా (PHN)గా మారవచ్చు.
‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం.. బుల్డోజర్‌తో షాప్ కూల్చివేత
మహారాష్ట్రలోని మల్వన్ పట్టణంలో ఓ స్క్రాప్ షాప్ యజమాని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సోమవారం మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం తక్షణ చర్యగా ఆ నినాదం చేసిన వ్యక్తి స్క్రాప్ షాప్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను శివసేన నేత నిలేష్ రాణే తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ.. మల్వన్‌లో ఓ ముస్లిం వలసదారు, స్క్రాప్ వ్యాపారి భారత వ్యతిరేక నినాదాలు చేశాడని, అతడిని మల్వన్ నుండి బహిష్కరించడమే కాకుండా, అతని వ్యాపారాన్ని తక్షణమే ధ్వంసం చేశామని చెప్పుకొచ్చాడు. ఈ చర్యలో సహకరించిన మల్వన్ మున్సిపల్ కౌన్సిల్, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో బుల్డోజర్‌తో స్క్రాప్ షాప్‌ను కూల్చివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతిఘటనగా, స్థానికులు సోమవారం ఒక బైక్ ర్యాలీ నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం.. ఆదివారం మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా మల్వన్‌లో ఇద్దరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేయడంతో.. వారిని స్థానికులు వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో మల్వన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
మరో కొత్త వ్యాపారం మొదలు పెట్టిన రానా..
అప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన హీరో రానా కెరీర్ ‘బాహుబలి’ తర్వాత మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.పాన్ ఇండియా లెవెల్ లో తన విలనిజంతో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ఫేమ్ తనకు అంతగా వర్కౌంట్ అవ్వలేదు అని చెప్పాలి. బాహుబలి తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అరణ్య’, ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’, ‘బెట్టియాన్’ వంటి వరుస సినిమాలతో వచ్చాడు. వీటిలో కేవలం ‘భీమ్లా నాయక్’ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రజంట్ చాలా సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక పోతే రానా కేవలం సినిమాల్లోనే కాదు అతను వ్యాపారాల్లో కూడా తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రానాకి ఫుడ్ రెస్టారెంట్స్, బార్స్, కాఫీ షాప్స్ ఉండగా.. రీసెంట్ ఆయన తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో మరో ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేసాడు. దీని డైరెక్టర్ రాజమౌళి సతీసమేతంగా వచ్చి ఓపెన్ చేశాడు. ఇక వీరికి ఎన్ని వ్యాపారాలు ఉంటే ఏం లాభం చెప్పండి.. వారు మొదలేటిన వ్యాపారాలు కూడా వారి స్టేటస్ కి తగ్గట్టు గానే ఉంటున్నాయి. ఇప్పుడు స్టార్ చేసిన ఈ ఫుడ్ కోర్ట్ లో ఐటమ్స్ కొనాలంటే కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే సాధ్యం, సామాన్యులు ఫుడ్ కోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఒక్క దాని రేటు చూస్తే మతి పోవాల్సిందే నట. ఇక ఈ వార్త తెలిసిన జనాలు మూతి మీద వేలేసుకుంటున్నారు.
ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. డే 1 నుండి భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తున్నా చావా కొద్దిలో సెన్సేషన్ రికార్డు మిస్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 350 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం నిన్న రెండో సోమవారం వర్కింగ్ డే అంతే స్ట్రాంగ్ హోల్డ్ చేసింది. అయితే ఈ సినిమా నిన్న సోమవారం 19.10 కోట్లకి నెట్ వసూళ్లు రాబట్టి త్రుటిలో పుష్ప రికార్డును అందుకోలేక వెనుకబడింది. పుష్ప 2 వరుసగా 12 రోజులు రూ. 20 కోట్లు కలెక్ట్ చేయగా, చావా 10 రోజులతో సరిపెట్టుకుంది. 11 రోజులకు గాను చావా వరల్డ్ వైడ్ గా రూ. 353 .61 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ గా రూ. 400 కోట్ల మార్క్ ని అందుకునేందుకు చావా పరుగులు పెడుతుంది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేసి ఉంటె మరింత కలెక్షన్ వచ్చేదని ట్రేడ్ భావించింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రాన్నిమాడాక్ నిర్మాణ సంస్థ నిర్మించింది.