డేంజర్‌లో తుంగభద్రత డ్యామ్..! పనిచేయని మరో 7 గేట్లు
కర్ణాటక హోస్పెటలోని తుంగభద్ర జలాశయం ఇప్పుడు డేంజర్‌లో పడింది.. జలాయంలోని మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 33 గేట్లలో గతేడాది ఆగస్టు 10వ తేదీన వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అయితే కన్నయ్యనాయుడు సలహాతో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. కొత్తగేటు తయారైనా ఈ ఏడాది ముందస్తు వరదలతో ఆ 19వ గేటును అమర్చలేకపోయారు. మరోవైపు, మొత్తం గేట్ల కాలపరిమితి దాటిపోయిందని, అన్నిటినీ మార్చాల్సిందేనని సూచించారు కన్నయ్యనాయుడు. మిగిలిన 32 గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పుడు 11, 18, 20, 24, 27, 28 నంబర్ గేట్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ 7 గేట్లు ఎంత వరద వచ్చినా ఎత్తకూడదని ఇంజినీర్ల నిర్ణయించారని సమాచారం. 4వ గేటు కూడా పూర్తిగా ఎత్తడం సాధ్యం కాదని, ఒక అడుగు మాత్రమే ఎత్తవచ్చని, ఆ తరువాత మొరాయించే ఉందని గుర్తించారు. ప్రస్తుతం జలాశయానికి 23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద వస్తే అన్ని గేట్లు పైకి ఎత్తి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.. దీంతో జలాశయానికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది..
స్త్రీ శక్తికి శ్రీకారం.. బస్సులో సరదా సంభాషణ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు శుభవార్త చెబుతూ.. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్‌ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కండక్టర్ కు చెప్పారు నారా లోకేష్. అంతేకాదు.. మంగళగిరిలో బస్సు టికెట్ డబ్బులు నేనిచ్చాను.. మీ నుండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకుంటా అంటూ సరదాగా మాట్లాడారు నారా లోకేష్.
ధర్మవరంలో ఉగ్ర లింక్‌ల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో వంట మనిషి..!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి.. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు.. ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలను ఎన్ఐఏ గుర్తించింది. ఓ బిర్యానీ పాయింట్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ను అదుపులోకి తీసుకుని విచారింస్తోంది ఎన్ఐఏ బృందం. ధర్మవరం పట్టణంలోని లోనికోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దీంతో, ఎన్ఐఏ రంగంలోకి దిగింది… నూర్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుంది. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
పోలవరం కాఫర్ డ్యాం వద్ద కుంగిన మట్టి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు.. అయితే, పోలవరం ఎగువ కాఫర్ డ్యాంపై స్వల్పంగా మట్టి కుంగింది.. వెంటనే అప్రమత్తమై అధికారులు.. కుంగిన ప్రాంతాన్ని పటిష్టపరిచారు.. 10 అడుగుల వెడల్పు, 7 నుండి 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు ఎగువన మట్టి కుంగగా.. వెంటనే స్పందించారు అధికారులు.. గతంలో వచ్చిన వరదల కారణంగా కాపర్ డ్యాంపై మరో రెండు మీటర్లు ఎత్తు పెంచారు అధికారులు.. అయితే, ఎత్తు పెంచిన ప్రాంతంలో మాత్రమే మట్టి జారిందని.. వెంటనే దానిని పటిష్టపరిచామని అధికారులు చెబుతున్నారు.. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం పై మట్టి రాళ్లు స్వల్పంగా కుంగాయి. దీంతో ప్రభుత్వమైన అధికారులు వెంటనే కుంగిన ప్రాంతాన్ని పటిష్ట పరిచారు. దీంతో కాఫర్ డ్యాం పటిష్టతకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2022లో వచ్చిన వరదల కారణంగా డ్యాం మరో రెండు మీటర్లు అదనంగా పెంచారు. పెంచిన ప్రాంతంలో మాత్రం కొద్దిగా మట్టి కుంగడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన దాన్ని పటిష్టపరిచారు. కాపర్ డ్యాం పటిష్టతకు తోడు దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈరోజు, రేపు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కమర్ పిల్లలతో రోజు ఆడుకునే వాడు.. బాబుకి బిస్కెట్ల ఆశ చూపించి..!
ఉప్పల్‌లో ఐదేళ్ల బాలుడు మనోజ్ పాండే హత్యకు గురయ్యాడు. కుటుంబానికి తెలిసిన కమర్ అనే వ్యక్తి బాలుడిని అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ నెల 12న బాలుడు కనిపించకుండా పోగా.. 15న రాత్రి మృతదేహం లభించింది. నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. బిస్కెట్ల ఆశ చూపించి తమ 5 ఏళ్ల అబ్బాయిని కమర్ అనే వ్యక్తి చంపేశాడని తెలిపారు. కమర్ పిల్లలతో రోజు ఆడుకునే వాడని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము అసలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు.
వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. నితీష్ కుమార్ ప్రకటన
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే… ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎక్స్ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్ల నాటికి యువతకు కోటి ఉద్యోగాలను అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు సహాయపడతామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా నితీష్ కుమార్ పేర్కొన్నారు.
పుతిన్ ఎదుట బీ-2 బాంబర్లు ప్రదర్శన.. దేని కోసం..!
అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగింది. వీరిద్దరి భేటీతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏదొక పరిష్కారం దొరుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూస్తే.. చివరికి ఏమీ లేకుండానే 3 గంటల సమావేశం ముగియడం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్-పుతిన్ భేటీలో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరు దేశాలు ప్రకటించాయి. ఇక సమావేశానికి ముందు అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరానికి ట్రంప్ వచ్చారు. అనంతరం కొద్దిసేపటికి పుతిన్ కూడా చేరుకున్నారు. ట్రంప్ చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా పుతిన్‌కు స్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ.. చిరునవ్వుతో ట్రంప్ స్వాగతం పలికారు. చాలా సేపు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరు పొడియం దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న సమయంలో పుతిన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తల పైనుంచి బీ-2 బాంబర్లు వెళ్లాయి. దీంతో పుతిన్‌కు ఒకింత ఆశ్చర్యానికి గురై.. వాటి వైపు చూస్తూ నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అంతేకాకండా ఎయిర్‌పోర్టులో పలు రకాల ఫైటర్ జెట్లు కూడా ప్రయాణించడం విశేషం. అలాగే కాన్వాయ్ వెళ్లే మార్గంలోనూ యుద్ధ విమానాలు వరుసగా పార్క్ చేసి ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ కావాలనే ఈ ప్రదర్శన చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఇక ట్రంప్-పుతిన్ ఒకే వాహనంలో కూర్చుని మాట్లాడుకోవడం విశేషం.
మహేష్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆఫ్రికాకు జక్కన్న అండ్ టీం!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. కేవలం కొన్ని ప్రెస్ మీట్‌లు లేదా అప్‌డేట్స్ ద్వారా సినిమా కథాంశాన్ని పూర్తిగా వివరించలేమని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమా గురించి అప్పటికప్పుడు ఏది అప్‌డేట్ ఇవ్వాలో అదే ఇస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా అక్కడ ప్లాన్ చేసిన షూటింగ్ వాయిదా పడింది. సెప్టెంబర్ రెండో వారంలో సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మాస్ జాతర రెడీ.. కానీ రిలీజ్ అవుద్దా?
రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే, విడుదల తేదీకి ఇంకా పది రోజులే సమయం ఉండగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఇటీవల విడుదలైన భారీ చిత్రాలైన ‘కింగ్‌డమ్’, ‘వార్ 2’ వంటి సినిమాల వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి కారణంగా ‘మాస్ జాతర’ చిత్రం అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ లాంచ్..
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో–హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మటన్ సూప్’. “విట్‌నెస్ ది రియల్ క్రైమ్” ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాకు రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొన్నారు.