త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. 81.1 శాతం పోలింగ్ నమోదు
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ముఖ్య ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ దినకర్రావు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 81.1శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని.. వెంటనే వాటిని మార్చేసినట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా జరిగిన త్రిపుర ఎన్నికలతో మినీ సార్వత్రికం ప్రారంభమైనట్లైంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఐపీఎఫ్‌టీతో కలిసి పోటీ చేస్తుండగా… సీపీఎం-కాంగ్రెస్‌తో జట్టు కట్టి బరిలో నిలిచింది. ప్రద్యోత్ బిక్రమ్ మానిక్య దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో తలపడుతోంది.
రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జిలో ఉపన్యాసం
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. “భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోబోతుండటం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తిరిగి స్వాగతించడం ఆనందంగా ఉందని కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ ఓ ట్వీట్ లో పేర్కొంది. ప్రజాస్వామ్యం, భారత్-చైనా సంబంధాలపై ఆయన ప్రసంగిస్తారని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఈ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించనున్నారు.
గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని జగన్ కి ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు వినని వారుండరు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు. ఏ టీవీలో చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఆయన అందరికీ చిరపరిచితం. ఉదయాన్నే ఆయన అందరినీ నిద్రలేపేస్తుంటారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. చాగంటిని ఘనంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కే.ఐ. వరప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించిన చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్ రెడ్డి. గోశాలను ఆసాంతం పరిశీలించారు చాగంటి కోటేశ్వరరావు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు చాగంటి కోటేశ్వరరావు.
చంద్రబాబు, లోకేష్ లు ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు, లోకేష్ లు జాతర లలో పాల్గొంటూ జనం రావడం లేరన్న ఫ్రస్టేషన్ వల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..అంబోతులా లోకేష్ మహిళను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు. జగన్ పాదయాత్ర చేసినపుడు.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు… రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. చంద్రబాబు సొంత ఊరు వదిలి తిరుగుతున్నారు.. మీరు బూతులు మాట్లాడితే మేమూ మాట్లాడుతాము..మా సహనాన్ని మీరు పరీక్షిస్తే మేమూ మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త..రాయలసీమకు ఏమీ చేయకుండా మాట్లాడటం సరైంది కాదు..మీరు చేసిన ఆరోపణల పై నిజాయితీగా మా ఎమ్మెల్యే రాచమల్లు సీబీఐ విచారణకు వెళ్ళారు .. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..సాధికార వ్యవస్థ పెడతామంటే వాలంటీర్లు వ్యవస్థను మీరు అంగీకరించినట్టే. కనీసం కౌన్సిలర్ కూడా కాని లోకేష్ పదవీ కాంక్ష తోనే జనంలోకి వచ్చి దుర్భాష లాడుతున్నాయి. అధికారంలో ఉండగా ఏమీ చేయక పోగా ఇప్పుడు ఏం చేస్తారో చేప్పకుండా తిట్ల దండకం తప్ప పాదయాత్రలో ఏముంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పై మంచి చెడ్డలు మాట్లాడ కుండా కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏమీ చెప్పుకోలేని వాళ్ళు కేడర్ ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ ఆరోపిస్తూ బురద జల్లుతున్నారు..నేరుగా జనం ఖాతాల్లోకి రెండు లక్షలు జమ చేసిన వైసిపిని విమర్శించే లోకేష్ సంస్కార వంతంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు.
పోలవరం ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పాలి?
ఏపీ జనం పాలిట వరం పోలవరం.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు పోలవరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడారు. నాలుగు నెలల నుండి సోమశిల జలాశయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితి పై కేంద్ర జల వనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ కు నివేదిక అందజేస్తాం..ఎన్నికల దృష్ట్యా కర్ణాటక జలాశయాలకు నిధులు ఇస్తూ .ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది. రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన తన కడుపులో ఉన్నది ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా మోసంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థలపై కూడా గౌరవం లేదు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని చేసినా అమరావతి రాజధానిగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు రామకృష్ణ.
పోలీసుల అదుపులో మావోయిస్ట్ జలుమూరి శ్రీనివాస్
పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ఉన్నట్టు తెలుస్తోంది. జాయింట్ ఆపరేషన్ బలగాలు జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో ని అరెస్ట్ చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది. 2018 అరకు మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో రైనో నిందితుడుగా ఉన్నాడు. NIA ఛార్జ్ షీటులో రైనో పేరు ఉంది. మల్కన్ గిరి జిల్లా కోటియ బ్లాక్ లో ఆంధ్ర,ఒరిస్సా,ఛత్తీస్ గడ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి రైనో ను పట్టుకున్నారు. రైనోను వెంటనే కోర్టులో హాజరు పరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రైనో ప్రాణానికి హాని జరిగితే పోలీసులు,స్థానిక నాయకులదే బాధ్యత అని హెచ్చరించింది. ఈమేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి జగబంధు ప్రకటన విడుదల చేశారు.2018లో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కలకలం రేపింది. ఈ హత్యలకు సంబంధించి కొందరు నేతలు మావోయిస్టులకు సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పలువురు టీడీపీ నేతల కాల్ డేటాను విశ్లేషించారు. అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో, ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపి విచారించింది.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఘరానా మోసం
విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..? అక్కడ డాలర్లలో సంపాదించి, ఇక్కడ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. చిన్న ఉద్యోగాలు దొరికినా సరే, విదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. యూరప్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. 150 మందికి పైగా హైదరాబాదీ యువకుల్ని మోసం చేశాడు. ఆ యువకుల వద్ద నుంచి ఏకంగా రెండున్నర కోట్లు కాజేశాడు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన ఆ నిరుద్యోగులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి ఫ్యాబ్రల్ ఓవర్సీస్ పేరుతో యూరోపియన్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇది చూసిన కొందరు నిరుద్యోగ యువకులు బషీర్‌ని సంప్రదించారు. యూరప్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, జీతం అద్భుతంగా వస్తుందని, ఆ జీతంతో ఎంతో విలాసవంతంగా జీవించవచ్చని వారికి ఎర వేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. ఇలా 150 మంది యువకుల నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నాడు. వాళ్లందరికీ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి.. త్వరలోనే మీకు కాల్స్ వస్తాయని నమ్మించాడు. అయితే.. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. చివరికి అతడిచ్చిన ఆఫర్ లెట్స్ ఫేక్ అని తేలడంతో.. తాము మోసపోయామని యువకులు గ్రహించారు. ఇంతలోనే బషీర్ ఆఫీస్ బోర్డు తిప్పేశాడు.
టాటా హారియర్ 2023 బుకింగ్స్ ఓపెన్.. ధర, ఫీచర్స్ వివరాలివే..
దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా తన హారియర్ ను మరింత గ్రాండ్ గా తీసుకురాబోతోంది. 2023 టాటా హారియర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అధునాతన అడాస్( అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కొత్త హారియర్ లో టాటా తీసుకురాబోతోంది. న్యూ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లతో రాబోతోంది. పాత హారియర్ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి రూ. 22.60 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండగా.. కొత్త హారియర్ ధర రూ. 15.50 లక్షల నుంచి రూ. 24 లక్షల(ఎక్స్ షోరూం) వరకు ఉండవచ్చు. టాటా హారియర్ 2023, ఎంజీ హెక్టార్ 2023, జీప్ కంపాస్ కు పోటీ ఇవ్వను8ంది. కొత్త హారియర్ ఓమెగా ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఎస్ యూ వీ హెచ్ఐడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు హారియర్ లో ఉండనున్నాయి. ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్ గా రూపుదిద్దుకుంటోంది. డాష్ బోర్డ్ గతంలో పోలిస్తే మరింత ఆధునికంగా ఉండనుంది. 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ఏ కనెక్ట్ కార్ టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది సెక్యూరిటీ, వెహికిల్ డయాగ్నోసిస్, లొకేషన్ సర్వీస్, ఓవర్ ది ఎయిర్(ఓటీఏ) వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తోంది. 7 ఇంచెస్ డిజిటల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త హారియర్ లో ఉండనుంది.
జూకెర్ బర్గ్ కు భారీ స్థాయిలో భద్రత పెంపు.. అందుకేనా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగాల కోత పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను భారీగా పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.115 కోట్లు) చేసింది. ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ దక్కనున్నాయి. అయితే. ఓ వైపు ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జుకర్‌బర్గ్ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకోసమే జుకర్‌బర్గ్ సెక్యూరిటీని పెంచినట్లు సమాచారం.