సూరత్‌లో భూకంపం.. 3.8 తీవ్రతతో కంపించిన భూమి
గుజరాత్ లోని సూరత్ నగరంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) వెల్లడించింది. సూరత్ కు పశ్చిమనైరుతికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని దీనివల్ల సూరత్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం సూరత్ జిల్లా హజీరా ప్రాంతంలోని అరేబియా సముద్రంలో 5.2 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, రాష్ట్రంలో 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లో పెద్ద భూకంపాలు సంభవించాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాలుగా భారతదేశంలో మూడవ అతిపెద్ద మరియు రెండవ అత్యంత విధ్వంసక భూకంపంగా నమోదు అయింది. దీని వల్ల 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.
చల్లపల్లిలో గుప్పుమన్న గంజాయి.. నలుగురి అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, మత్తుపదార్ధాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చల్లపల్లి పోలీసులు. బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన మల్లవోలు ఆదిశేషు అతని భార్య వెంకటేశ్వరమ్మ, చల్లపల్లి కి చెందిన కోట అనిల్ కుమార్, చిలక అజయ్ అను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 3010 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి గంజాయిని తీసుకువచ్చి చల్లపల్లి, రేపల్లె గ్రామాలలో ఉన్న యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్లు అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా తెలిపారు. ఎన్జీవోల సహాయంతో యువతకు జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు అధికారులు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క నడవడికపై ఆరాధిస్తూ వారి అలవాట్లపై నిఘా ఉంచుకోవాలని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా కోరారు. ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడమని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. పిల్లల కదలికలపై, వారి మానసిక స్థితిపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు.
భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి.. మోదీ, మోహన్ భగవత్ లాగే మాకు హక్కుంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాగే భారతదేశం తమకు చెందినది అని జమియత్-ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో మౌలానా మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ, భగవత్ లకు ఈ దేశంపై ఎంత హక్కు ఉందో మహమూద్ మదానీకి కూడా అంతే హక్కు ఉందని అన్నారు. వారి కన్నా తాను దేశం కోసం ఒక్క అంగుళం ముందే ఉంటానని వెల్లడించారు. ఈ దేశంలో ఇస్లాం మతం అతి ప్రాచీనమైనదని, భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి అని స్పష్టం చేశారు. ఇస్లాం బయట నుంచి వచ్చిందని చెప్పడం వాస్తవం కాదని.. ఇస్లాం అన్ని మతాలలో పురాతన మతమని, హిందీ ముస్లింలకు భారత్ ఉత్తమ దేశం అని ఆయన వెల్లడించారు. తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం కాదని, కానీ హిందుత్వను తప్పుగా చూపిస్తున్నారని, ఇటీవల కాలంలో ఇది వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇది భారత స్ఫూర్తికి వ్యతిరేకం అని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు.. 9మందికి గాయాలు
పరిశ్రమల్లో ప్రమాదాలు ఆస్తి, ప్రాణనష్టాలను కలిగిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS -2 లో లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. నలుగురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, 5గురు ఒప్పంద కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం అసకపల్లి సున్నబట్టీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ చింతలపూడి అప్పలరాజు (నూకాలు కుమారుడు), అదే ప్రాంతానికి చెందిన గెడ్డం గంగరాజు, చింతలపూడి అప్పలరాజు (కొండయ్య కుమారుడు)…ముగ్గురూ గురువారం సబ్బవరం మండలం నారపాడు శివారు అమ్ములపాలెం గ్రామంలో గల బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. అక్కడ నుంచి విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భోజనం చేసిన తర్వాత నడక మంచిదేనా?
నడక ఆరోగ్యానికి మంచిదే.. కానీ, ఏ సమయంలో చేయాలి.. ఉదయం మంచిదా? మధ్యాహ్నం బెటరా? సాయంత్రం మంచిదా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి.. ఎంతైనా ఉదయం పూట నడక ఎంతో శ్రేయస్కరం అంటారు.. అయితే, భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయాలా? అది మంచిదేనా? అనే విషయంలోనూ కొందరు అనుమాలున్నాయి.. భోజనం చేసిన తర్వాత నడవాలని చాలా సార్లు విని ఉంటారు.. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమై నిద్ర కూడా బాగుంటుందని కూడా ఎక్కడైనా చదవడమో.. ఎక్కడో వినే ఉంటారు.. అసలు దీనిలో నిజమెంతా? అనే విషయాలను ఓసారీ పరిశీలిద్దాం. క్రమ పద్ధతిలేని జీవనశైలి వల్ల అనేక నష్టాలు ఉంటాయి.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఆహారం తీసుకున్న తర్వాత పడుకోవడం లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం తరచుగా చాలా మంది చేసే పని.. అయితే, ఆహారం తిన్న వెంటనే ఒకే చోట పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల చాలా తీవ్రమైన రోగాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే బరువు పెరగడమే కాకుండా శరీరాన్ని అనేక వ్యాధులు సోకుతాయి. మన శరీరం రోగాల కుప్పగా మారుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.. ఆహారం తీసుకున్న తర్వాత కొంతసేపు నడవాలని.. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని.. ఆహారం సులువుగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు.
ఆ ఊళ్ళో ఇంటికో ఫ్లైట్ ఉంటుంది
ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విభిన్నమైన, అద్భుతమైన, విచిత్రమైన, ఫన్నీ, విషయాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ మీకో విచిత్రమైన ప్రాంతం గురించి చెప్పాలి. ఓ గ్రామం ఉంది దాని ప్రత్యేకత ఏంటంటే.. అక్కడ ఇంటికో విమానం ఉంటుంది..అవును ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక పట్టణం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరి ఇంటి ముందు విమానం కనిపిస్తుంటుంది. వారు ఎక్కడికి రెస్టారెంట్లకు, పబ్ లకు, పార్టీలు, పార్కులకు వెళ్లాలనుకున్నా విమానంలోనే ప్రయాణిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామం వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని కామెరాన్ ఎయిర్ పార్క్ అనే ఈ ప్రదేశం సాధారణ గ్రామాల కంటే భిన్నంగా ఉంటుంది. విమానాశ్రయానికి చేరుకోవడానికి రన్‌వేలుగా ఉపయోగించేందుకు ఇక్కడ విశాలమైన రోడ్లు నిర్మించారు. ఈ పట్టణంలోని ప్రతి ఇంటి వెలుపల గ్యారేజీ లాంటి హాంగర్లు ఉన్నాయి. అక్కడ వారు తమ విమానాలను పార్క్ చేస్తారు. ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే విమానంలో వెళ్తుంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ నివసించే చాలా మంది ప్రజలు పైలట్లు, వారి స్వంత విమానాలను నడుపుతారు. ప్రతి శనివారం ఇక్కడి ప్రజలు గుమిగూడి స్థానిక విమానాశ్రయానికి కలిసి వెళతారు.
మేకప్ లు, నగలు వేసుకుని ఆస్పత్రికి రావద్దు..హర్యానాలో న్యూ రూల్
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి సిబ్బందికి నూతన డ్రెస్‌కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. వైద్యులు, ఇతర సిబ్బంది ఇక నుంచి రకరకాల నగలు, మేకప్, విచిత్రమైన హెయిర్‌స్టైల్ వంటివి వేసుకుని ఆస్పత్రిలో విధులు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. అలా వస్తే విధులకు అనుమతించబోమని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్ కోడ్ పాలసీని రూపొందించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు విధులు నిర్వహించే సిబ్బంది పనివేళల్లో విచిత్రమైన హెయిర్ స్టైళ్లు, భారీ నగలు, మేకప్, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించడాన్ని అనుమతించబోమని మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. పురుషులు అసాధారణ హెయిర్ స్టైళ్లు, మోడర్న్ హెయిర్ కట్ చేసుకుని రావద్దని పేర్కొన్నారు. ప్రొఫెషనల్‌గా కనిపించే ఫార్మల్ దుస్తులనే ధరించాలని ఆయన తెలిపారు. నర్సింగ్ క్యాడర్ మినహా ట్రైనీలు తప్పనిసరిగా నల్ల ప్యాంట్, తెల్ల షర్ట్ ధరించాలని అనిల్ విజ్ పేర్కొన్నారు. ఈ డ్రెస్ కోడ్‌ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని మంత్రి తెలిపారు. వారాంతాలు, నైట్ షిప్టుల్లోనే ఉన్న సిబ్బందికి కూడా వస్త్రధారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రెస్ కోడ్ పాటించని ఉద్యోగిని ఆ రోజు గైర్హాజరిగా పరిగణిస్తామని మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.
కోహ్లీని దాటేసిన షమీ..స్టార్ బ్యాటర్లనూ వెనక్కునెట్టి…
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డు సృష్టించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 37 రన్స్‌తో అదరగొట్టిన షమీ ఓ ఘనతనూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన షమీ తన సిక్స్‌ల సంఖ్యను 25కు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(24)ని దాటేశాడు. ఈ ఫార్మాట్‌లో 22 సిక్స్‌లు కొట్టిన రవిశాస్త్రి, ఉమేశ్ యాదవ్, యువరాజ్ సింగ్‌లను కూడా షమీ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 రన్స్‌కు ఆలౌటవగా.. భారత్ 400 రన్స్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 223 రన్స్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రెచ్చిపోగా అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) సూపర్ బ్యాటింగ్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కనీసం పోరాట చేయలేకపోయింది. అశ్విన్ (5), జడేజా (2) దెబ్బకు 91 రన్స్‌కే చాటచుట్టేసింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.