1 వైసీపీకి కలిసొచ్చిన మూడు రాజధానులు..! ఎన్నికల నినాదం అదే..
అమరావతి అనేది ఓ మాయ.. అదో భ్రమ.. అమరావతి అంటే అంతులేని అవినీతి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ.. మూడు రాజధానులు ముద్దు అంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని.. అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు, కులాలు, వారి ఆశలు, ఆంకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, ఆవిష్కరించిందని.. కాబట్టే తమ ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారు.. ఏ ఎన్నికలు వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారని.. ఏదేమైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.. ఇంతలా వైఎస్ జగన్ ఫిక్స్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? అంటే.. ఆ నినాదం వైసీపీకి బాగా బూస్ట్ ఇచ్చిందట.. అది ఎంతలా అంటే.. వచ్చే ఎన్నికల్లో.. ఆ పార్టీ అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లనుందట.. దానికోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో పడిపోయారు ఆ పార్టీ నేతలు.
2 సీబీఐకి బదిలీ చేయండి.. కేరళ హైకోర్టులో తుషార్ పిటిషన్
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా.. సిట్ నోటీసులు ఇచ్చినవారు కొందరు విచారణకు డుమ్మాకొడుతున్నారు.. అయితే, ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్.. కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని విన్నవించారు..రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్న తుషార్.. ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారని.. అనారోగ్యం కారణంగా.. వైద్యుల సూచనల మేరకు రెండు వారాల గడువు కోరినట్టు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, తన మెయిల్‌కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనని ఆవేదన వ్యక్తం చేశారు తుషార్.. కాగా, ఈ కేసులో తుషార్, జగ్గుస్వామిలకు సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.. వారు దేశం విడిచి పోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు సర్క్యులర్లు పంపిన విషయం విదితమే. ఇప్పుడు తుషార్.. కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈకేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
3 రాజకీయాలపై మాట దాటవేసిన మెగాస్టార్
గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి అత్యంత గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, మురుగన్ చేతుల మీదుగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా మారిన ఆయన జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటికి సినిమాల్లోనే ఉంటాను అంటూ వేదిక సాక్షిగా అభిమానులకు ప్రామిస్ చేశారు. తనను ఇక్కడ నిలబెట్టింది అభిమానులే అని తెలిపి ఆయన ప్రేమను చూపించారు. ఇక అంతా బాగానే ఉన్నా ఆయన రాజకీయాల గురించి దాటివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అవార్డు తీసుకొని కిందకు వెళ్ళడానికి రెడీ అవుతున్న చిరును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆపి.. ఒక ప్రశ్న వేశారు. “మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఉందా..? ప్రజలు మరోసారి మిమ్మల్ని ఆదరిస్తారా..? అని అడుగగా అందుకు చిరు సమాధానాన్ని దాటి వేస్తూ ” మనం తరువాత మాట్లాడుకుందాం సర్” అంటూ వెళ్లిపోయారు.
4 సీఎం సంకల్పం నిరూపితమైంది.. మంత్రి ఆదిమూలపు సురేష్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం సరైనది అనటానికి ఈ స్టే సూచనగా ఉంది.సీఎం జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు.అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేది సీఎం సంకల్పం.రాష్ట్ర ప్రజానీకం అంతా పరిపాలన వికేంద్రికరణకు మద్దతు పలుకుతున్నారు.అమరావతి ని కూడా మేము అభివృద్ధి చేస్తాం.తరచు ముఖ్యమంత్రి అమరావతి అభివృద్ధి పై సమీక్షిస్తున్నారు.మేము అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఇప్పటికి 730 కోట్లు ఇచ్చాం.టీడీపీ నాయకులే గతంలో చెప్పారు. లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తామని. అంత ఖర్చు పెట్టి అభివృద్ధి 6నెలల్లో సాధ్యమా?.కోర్టు తీర్పులు సూచనలు పరిగణన లోకి తీసుకొని ముందుకు వెళతాం.అమరావతి లో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
5తొలిరోజు ముగిసిన విచారణ..మరో 10 మందికి నోటీసులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది.. అయితే, మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల సమన్లు పంపారు.. ఇవాళ్టి విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా 10 మందికి సమన్లు జారీ చేశారు.. డిసెంబర్ 5వ తేదీ వరకూ పలువురిని వరుసగా విచారించనున్నారు.. విచారణలో ప్రధానం మెడికల్ సీట్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు ఐటీ అధికారులు.. రేపు మంత్రి మల్లారెడ్డి తరుఫున ఆడిటర్ విచారణకు హాజరుకాబోతున్నారు.
6అమరావతిలో ఉన్నది రైతులు కాదు.. బ్రోకర్లు, బాబు చుట్టాలు
ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన ప్రస్తావనలను మొదట్నుంచీ తమ ప్రభుత్వం చెప్తోందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులపై కామెంట్ చేయడం భావ్యం కాదని మంత్రి బొత్స అన్నారు.
7యాదాద్రి థర్మల్ ప్లాంట్ దేశ ప్రతిష్టను పెంచుతుంది..
యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని పేర్కొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి పరిశీలించిన ఆయన.. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు.. ఇక, ఆ తర్వాత అధికారులతో సమావేశమైన కేసీఆర్.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు.
8 పాకిస్తాన్ కు బెన్ స్టోక్స్ విరాళం.. ఎంతంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటోంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ముందే బెన్ స్టోక్స్ పాకిస్థాన్ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే తన మ్యాచ్ ఫీజును మొత్తం పాకిస్తాన్‌లో ఈ ఏడాది వరద బాధితులకు అందజేయనున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునర్ నిర్మాణం కోసం ఈ డబ్బును వాడుకోవాలని అతడు ట్వీట్ చేశాడు. ఈ మూడు టెస్టుల సిరీస్ ద్వారా అతడు సుమారు రూ.37 లక్షల నగదును అందుకోనున్నాడు. ఈ మొత్తాన్ని పాకిస్థాన్ ప్రజలకు స్టోక్స్ విరాళంగా ఇవ్వనున్నాడు. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్ట్, డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో రెండో టెస్టు, డిసెంబర్ 17 నుంచి కరాచీలో మూడో టెస్ట్ జరగనున్నాయి.