1″టెర్రరిజం” కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిందని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడాలని కోరామని..కానీ వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్రం చాలా కాలంగా ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉందని.. సూరత్, అహ్మదాబాద్ లలో జరిగిన పేలుళ్లలో చాలా మంది గుజరాత్ ప్రజలు చనిపోయారని.. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. మేము ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని అడిగితే..వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ప్రధాని కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దేశంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.
2 ఈడీ, ఐటీ దాడులతో అధికారంలోకి రావాలనేది బీజేపీ కల
తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు, రాబోయే ఎన్నికల్లో వ్యూహాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు హరీష్ రావు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో వుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కావాలని ఇబ్బంది పెడుతోంది. ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో అంతా రివర్స్ అయింది. శుద్ధి చేసిన మంచినీరు అందిస్తోంది.
తెలంగాణలో వడ్లు దిగుమతి బాగా పెరుగుతోంది. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారనేది విమర్శలు మాత్రమే. ప్రతి పైసా సద్వినియోగం చేస్తున్నాం. ఆనాడు తెలంగాణలో నీరు లేదు. పంటలు లేవు. కానీ ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. మాకు ధాన్యం ఇవ్వమని కర్నాటక, తమిళనాడులు మనల్ని కోరుతున్నాయి. పంట విస్తీర్ణం పెరిగింది. కేంద్రం వల్ల కూడా అప్పులు బాగా పెరిగాయి. దేశంలో కంటే నిష్పత్తిలో తెలంగాణ అప్పులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు. ఆలస్యం వల్ల భారీగా వ్యయం పెరిగిపోతోంది. కేంద్రమంత్రి గడ్కరీ తెలంగాణ ప్రాజెక్టుల్ని ప్రశంసించారు. కాళేశ్వరం ఘనత మాదే. మేమే చేశాం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం అవుతుందని వారు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగింది. మీకు నచ్చితే చాలా గొప్పవాడన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించారు. రాజకీయం కోసం బీజేపీ నేతలు బాగా దిగజారతారని హరీష్ రావు మండిపడ్డారు.
3 హైటెక్ నగరం రూపు మార్చనున్న మరో మెట్రో
హైదరాబాద్ పేరు చెబితే ఒకప్పుడు చార్మినార్, బిర్లామందిర్,గోల్కొండ వినిపించేవి. ఇప్పుడేమో హైటెక్ సిటీ, హైదరాబాద్ మెట్రో, అంతర్జాతీయ కంపెనీల మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగర వాసులకు అందమైన, అద్భుతమయిన, ఆహ్లాదకరమయిన అనుభూతిని అందిస్తోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పుడు మరో దశ మెట్రోకు బీజం పడింది. హైదరాబాద్ హైటెక్ సిటీకి తలమానికంగా భావించే మైండ్ స్పేస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ హాయిగా మెట్రలో ఏసీలో హాయిగా సేదతీరుతూ ప్రయాణం చేసే రోజు రాబోతోంది. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9 న సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాలల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.
4 గడువులోగా కొత్త సచివాలయం నిర్మాణం
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఆకస్మికంగా పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మూడు షిఫ్టుల్లో వర్కర్స్ ను పెంచి పనులు వేగిరం చేయాలని మంత్రి ఆదేశించారు. అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలన్నారు మంత్రి వేముల. డా.బి. ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాడు ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం సూచనల మేరకు…పనులన్నీ సమాంతరంగా నాణ్యతగా జరగాలని వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు వేగిరంగా జరిగేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.
5 ‘శాసనసభ’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన మంత్రి రోజా
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఈ మూవీలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్‌ను ఏపీ మంత్రి రోజా ఆవిష్కరించారు. అటు కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు, నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను ‘నాంది’ సతీష్ విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు.
6 అర్థరాత్రి టెక్ట్స్ మెసేజ్.. 2700 మంది ఉద్యోగాలు ఉఫ్
ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్భనం, కొనుగోలు శక్తి క్షీణించడం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు పొదుపు చేసే పనిలో ఉన్నారు. ఫలితంగా వ్యాపారాలు తగ్గుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో అమెరికాలోని పలు టెక్ దిగ్గజాలు ఖర్చును తగ్గించుకునే పనిలో ఉద్యోగులను తొలగించుకున్నాయి. తాజాగా ఓ అమెరికన్ కంపెనీ తమ ఉద్యోగులను కేవలం ఓ టెక్ట్స్ మెసేజ్ చేసి తొలగించింది. మిస్సిస్సిప్పికి చెందిన ఓ ఫర్నీచర్ కంపెనీ నవంబర్ 21 అర్థరాత్రి ముందు దాదాపుగా 2700 మంది ఉద్యోగులను తొలగించిందని దిగార్డియన్ తెలిపింది. కంపెనీ ఉద్యోగులకు టెక్ట్స్ మెసేజులు, ఈమెయిళ్లు పంపి రేపటి నుంచి పనికి రావద్దని తెలిపింది. మిస్సిస్సిప్పిలోని యునైటెడ్ ఫర్నీచర్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను తొలగించింది.
7 అప్పుడు మోర్బి వంతెన.. ఇప్పుడు చంద్రపూర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి
గుజరాత్ లో మోర్చి వంతెన కూలిన ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 140 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. చంద్రపూర్ /జిల్లాలోని బల్హార్షా రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 60 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రయాణికులు రైల్వే ట్రాకుపై పడిపోయారు. పుట్ ఓవర్ బ్రిడ్జ్ లోని కొంత భాగం కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కాజీపేట-పూణే ఎక్స్ ప్రెస్ అందుకోవడానికి ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
8.గిన్నిస్ రికార్డుల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..?
ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ మరే లీగ్‌కు ఉండదు. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది మే నెలలో ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 ఫైనల్‌లో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏకంగా 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డును కూడా అందజేశారు.