ఇదేం చలిరా నాయనా….ఒకరోజు తగ్గుతుంది.. మరొకరోజు చంపేస్తుంది
తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత ఇంతకు ఇంతై నరాలను తెంచే విధంగా పెరుగుతుంది. నిన్నటి తో పోలిస్తే చలి ఇవాళ మరింతగా ఎక్కువైంది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాలు పొగమంచు కమ్ముకున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు భానుడు కనిపించలేదు. రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై దట్టంగా మంచు కురుస్తుండటంతో వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయం, సాయంత్రం చలి తీవ్రత పెరగడంతో ప్రజల రాక తగ్గింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. మంచు తెరల మధ్య సూర్యుడు నిండు చంద్రునిలా కనిపించినా.. చలికి జనం వణికిపోయారు.
ఇవాళ సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర
ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పుల బాధతో మరణించిన 286 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పన ఆర్థిక సాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్. తన పర్యటనలో భాగంగా ఏటుకూరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు జనసేన నాయకులు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే…ప్రభుత్వం బాధితుల కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని విమర్శించారు.మాచర్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కిన వేళ పవన్ యాత్ర పై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటినుంచో ఆర్థికసాయం అందిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ రూ.1 లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారు. పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు.
పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం.. నిరసనల హోరు
పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇదిలా ఉంటే తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పంజాబ్, ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్సుల్లో డిసెంబర్ 23న ప్రభుత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరతీశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకుంటే పాకిస్తాన్ మునిగిపోతుందనని మేమంతా భయపడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామని భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే జాతీయ అసెంబ్లీకి మా 123-125 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించమని అసెంబ్లీలో స్పీకర్ని కోరుతామని అన్నారు.
ఆస్కార్ విన్నింగ్ మూవీ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్.. మద్దతు తెలపడమే పాపమా?
ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక అల్లర్ల కొనసాగుతూనే ఉన్నాయి. వరసగా ఆ దేశం అల్లర్లలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ పలువురికి ఉరిశిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ మూవీలో నటించిన నటిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. 38 ఏళ్ల తరనేహ్ అలిదూస్తీని శనివారం అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తప్పుడు, వక్రీకరించే కంటెంట్ ను ప్రచురించినందుకు, గందరగోళ పరిస్థితులకు కారణం అయినందుకు అలిదూస్తీని ఇరాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. 2016లో ‘ది సేల్స్‌మాన్’ సినిమాలు నటించింది తరనేమ్ అలిదూస్తీ. ఈ సినిమాలో పోషించిన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల మొహ్సేన్ షెకారీ(23) అనే వ్యక్తిన హిజాబ్ నిరసనల్లో పాల్గొనందుకు ఉరితీసింది. అయితే దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ 8న అలీదూస్తీ సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. ‘ఈ రక్తపాతాన్ని చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు మానవత్వానికి అవమానకరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో కామెంట్స్ చేసింది. చిన్న తనం నుంచి సినిమాలో నటిస్తోంది అలీదూస్తి. ఇటీవల ఆమె నటించిన ‘ లీలాస్ బ్రదర్స్’ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
చైనాలో భారీగా కరోనా మరణాలు.. కఠిన ఆంక్షలు
కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కఠిన ఆంక్షలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది. లక్షణాలు లేని కరోనా కేసులను వెల్లడించడం ఆపేసింది. డిసెంబర్ 4 నుంచి ఒక్క కరోనా మరణం కూడా లేదని చెప్తున్నది. అయితే, వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని తెలుస్తున్నది. బీజింగ్‌లోని ఓ స్మశానవాటికలో గతంలో రోజుకు సుమారు 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగ్గా, ప్రస్తుతం 150 వరకు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి చైనాలో ఇప్పటివరకు 5,235 కరోనా మరణాలు సంభవించినట్టు ఆ దేశం ప్రకటించింది. వాస్తవంగా ఇంతకంటే చాలా ఎక్కువ మంది మరణించి ఉంటారన్న వాదనలూ ఉన్నాయి. జనవరి 22న చైనాలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. శీతాకాల సెలవులు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది స్వంత గ్రామాలకు వెళ్లనున్నారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
వైభవంగా నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన
మెస్రం కుటుంబీకుల కల నెరవేరింది. నాగోబా ఆలయాన్ని కొత్తగా సిద్ధం చేశారు. ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు మహా పూజలు చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం నిర్మించిన ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం కులస్తుల ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. గిరిజన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అష్టదీప, ఘాట్ ప్రత్యేక పూజలతో పాటు నవగ్రహ పూజలు నిర్వహించారు. నాగోబా ఆలయ పునర్నిర్మాణం పూర్తికావడంతో వారం రోజులుగా పూజలు కొనసాగుతున్నాయి. నేడు ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెస్రం ప్రజలు హాజరుకానున్నారు. మెస్రం వంశస్థులు సొంత ఖర్చులు, చందాలు వేసుకుని 5 కోట్ల తో గుడి నిర్మాణం చేయించారు మెస్రం వంశీయులు. కేస్లాపూర్ గ్రామం నుంచి నవధాన్యాలు, పూజ సామాగ్రితో వచ్చిన మెస్రం కుటుంబ పెద్ద మెస్రం వెంకట్రావ్ పటేల్ పూజలను ప్రారంభించారు. నవధాయాలతో పాటు నవగ్రహాలను ఏర్పాటు చేసి మధ్యలో ఘాట్‌ను ఏర్పాటు చేసి ఎనిమిది దీపాలు వెలిగించారు. వేదిక వద్ద వెంకటరావు పటేల్ దంపతులు దీపాలు వెలిగించి హారతులతో పూజలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన వేదపండితులు ఆత్రం పురుషోత్తం, కొడప వినాయకరావుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నవగ్రహ పూజలు నిర్వహించారు.
సెకండ్ సింగల్ కోసం ఫాన్స్ వెయిటింగ్
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘తునివు’. బోణీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నస్ హైప్ ని మరింత పెంచుతూ ‘తునివు’ సినిమా నుంచి రీసెంట్ గా ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఘిబ్రాన్ ట్యూన్ ని, అనిరుద్ వాయిస్ కలిసి ‘చిల్లా చిల్లా’ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ బయటకి రానుంది. #KasethanKadavulada అనే పాట ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి రిలీజ్ చేయ్యనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. #KasethanKadavulada సాంగ్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చినప్పటి నుంచి అజిత్ ఫాన్స్, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనీ మనీ అంటూ డబ్బు చుట్టూ తిరిగేలా డిసైన్ చేసిన పాట, అజిత్ కి చాలా ఇష్టమైన పాటని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నారు. మరి అజిత్ కి అంత నచ్చిన సాంగ్, ఆడియన్స్ కి ఎంత వరకూ నచ్చుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ‘తునివు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విడుదల తేదిని ప్రకటించారు.