తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సీరియస్\
తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న వ్యవహారాలపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్ పెట్టింది. సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఆయన్ను పరిశీలకుడిగా నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భట్టి విక్రమార్క, ఉత్తర్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ప్రస్తుతం తాను రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో ఉన్నానని, ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తానని, ఇవాళ సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పారు. ఉత్తమ్‌తో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. అధిష్టానం తనని పరిశీలకుడిగా హైదరాబాద్ వెళ్లమని చెప్పిందని, నగరానికి వచ్చాక అందరి అభిప్రాయాలు తీసుకుంటానని, అన్ని విషయాలు చర్చించుకుందామని, హైకమాండ్ తనని నివేదిక ఇవ్వమని కోరిందని ఉత్తమ్‌తో దిగ్విజయ్ అన్నారు. అయితే.. దిగ్విజయ్‌ను పరిశీలకుడిగా నియమించడం పట్ల కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హైకమాండ్ సూచనతోనే సైలెంటయ్యా
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కమిటీల లొల్లి నడుస్తోంది. తమకు ప్రాధాన్యత దక్కలేదని కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట, పదవులు దక్కుతున్నాయన్నారు. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదు. సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. దిగ్విజయ్ ఈ విషయాలపై విచారించాలన్నారు. దిగ్విజయం రావడం హర్షించదగ్గ పరిణామం..ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న నేత దిగ్విజయ సింగ్ అన్నారు ఎంపీ కోమటిరెడ్డి. రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది..హుజురాబాద్ పరిణామాలపై, తనపై వాడిన పదజాలపై దిగ్విజయ్ విచారణ జరపాలన్నారు. ఢిల్లీలో దిగ్విజయ్‌ని కలుస్తానన్నారు. కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు…ఢిల్లీ పెద్దల సూచన మేరకే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాను. ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానం అన్నారు కోమటిరెడ్డి.
సిరిసిల్ల కిడ్నాప్ కేసులో ట్విస్ట్… షాలిని పెళ్లి ఫోటోలు విడుదల
సిరిసిల్ల యువతి శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆ యువతి వీడియోను విడుదల చేసింది. నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నట్లు ఆ యువతి వెల్లడించింది. జానీని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు శాలిని తెలిపింది. వివాహానికి సంబంధించిన వీడియోలను జానీ, శాలినిలు విడుదల చేశారు. తన కోరికపైనే జానీ తనను తీసుకెళ్లాడని శాలిని పేర్కొంది. మా తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తు్న్నారని.. వచ్చి తీసుకెళ్లమని తానే చెప్పినట్లు ఆ యువతి వెల్లడించింది. తీసుకెళ్లే ముందు మాస్క్ ఉండడం వల్ల జానీని గుర్తుపట్టలేదని.. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చూసుకున్నానని శాలిని వెల్లడించింది. ఆమె ఈ వివరాలు వెల్లడించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్లుయింది. గతంలో జానీ, శాలినికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ కేసులో జానీ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జానీ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు.
సిరిసిల్లలో యువతి కిడ్నాప్ ఉదంతంపై మంత్రి కేటీఆర్ సీరియస్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను జ్యోతి కిడ్నాప్ విషయంపై వివరాలు కేటీఆర్ అడిగారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని ఆదేశించారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ & అంతర్‌రాష్ట్ర డ్రగ్ రాకెట్స్ గుట్టు రట్టు చేసిన నేపథ్యంలో.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆ వివరాల్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యూ ఇయర్ సెలబ్రేష్స్ సందర్భంగా డ్రగ్స్ మీద ఎక్కువ తనిఖీలు చేస్తున్నామని.. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్, ఇంటర్‌స్టేట్ డ్రగ్ రాకెట్స్‌ని పట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ కేసులో భాగంగా ఒక నైజీరియన్‌ని, సాయికృష్ణ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ ఇద్దరి వద్ద నుంచి 30 గ్రాముల మెటాపెతమన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నైజీరియన్‌కి నేర చరిత్ర ఉందని.. 2017లో పూణేలో డ్రగ్స్ కేసులో ఒక సంవత్సరం జైలుకి కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. తన వీసా గడువు పూర్తైనప్పటికీ.. దొంగచాటుగా నైజీరియన్ ఇక్కడే ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్, నెరేడ్‌మెట్ పోలీసులు కలిసి.. ఈ డ్రగ్ రాకెట్‌పై దాడి చేశారన్నారు.
బుగ్గన అప్పులు తెస్తేనే.. జగన్ బటన్ నొక్కేది
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. బురఖా వేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుందని.. అప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రామకృష్ణ అన్నారు. మరోవైపు ఏపీలో అప్పుల వివరాలను కేంద్రం పార్లమెంటులో వెల్లడించడంపైనా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులు రూ.4 లక్షల కోట్లు అని లోక్ సభలో కేంద్రం పేర్కొందని వెల్లడించారు. ఏపీ కార్పొరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు.
సమంత సంచలన నిర్ణయం.. సినిమాలకు ఇక గుడ్ బై
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే నిజమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈ పోరాటంలో సమంత గెలుస్తోంది అని అందరు నమ్ముతున్నారు. ఇకపోతే సామ్.. వరుస సినిమాలకు సైన్ చేసి ఉంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో సామ్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట. ఖుషి సినిమాను పూర్తి చేసి సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇక ఈ వ్యాధితో పోరాడుతున్నవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె సైన్ చేసిన సినిమాల నుంచి తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఖుషి చివరి అంకానికి చేరుకోవడంతో ఆ సినిమాను మాత్రం పూర్తిచేసి మిగతావాటికి దూరం కానున్నదట. అయితే సామ్ నిర్ణయాన్ని తెలుగు నిర్మాతలు అంగీకరించినా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం కుదరదని చెప్పినట్లు సమాచారం. సామ్ వెళ్ళిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని ఆమె ఎలాగైనా నటించాలని డిమాండ్ చేస్తున్నారట. మరి సామ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
అర్జెంటీనా గెలిచిందని.. కేరళలో బిర్యానీ పంపిణీ
ఖతార్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కల కూడా నెరవేరింది. అర్జెంటీనా విజయం సాధించడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో మన ఇండియాలోని కేరళ కూడా ఉంది. కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న శింబు అనే వ్యక్తి ఈ ఏడాది ప్రపంచకప్‌లో అర్జెంటీనా కప్పు కొడితే వెయ్యి మందికి ఉచితంగా బిర్యానీ పంచిపెడతానని అందరికీ మాటిచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బ్యానర్ కట్టించాడు. అయితే తాను మాట ఇచ్చిన ప్రకారం ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా ఓడించడంతో శింబు టేస్టీ బిర్యానీ పంచిపెట్టేందుకు రెడీ అయ్యాడు. దీంతో అతడి హోటల్ ముందు కిలోమీటర్ల మేర స్థానికులు బారులు తీరారు. ఇంత మంది రావడంతో మరో 500 బిర్యానీలను అదనంగా పంచిపెట్టినట్లు శింబు చెప్పాడు.