సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3) సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్ని, చారిత్రక కృషిని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసారని అన్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదనదని, నేటి తరానికి స్పూర్తిదాయకమని అన్నారు సీఎం కేసీఆర్. బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని సిఎం అన్నారు.
కేంద్రం నిధులు ఇవ్వకపోయినా సంక్షేమం ఆపలేదు

నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో 30 పడకల సిహెచ్సి ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగించారు. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు తగ్గడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరాసరి కంటే తక్కువ సరాసరి నల్లగొండ జిల్లాలో నమోదు కావడంపై డీఎంహెచ్‌వోపై మంత్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్లు పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఒక జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్‌లదేనన్నారు మంత్రి హరీష్ రావు. శివన్న గూడెం, చర్ల గూడెం, లక్ష్మణపురం ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేంద్రం నిధుల విడుదల చేయకపోయినా సంక్షేమం ఆపలేదన్నారు. కేంద్రం నుండి రావలసిన నిధులు సకాలంలో రావడం లేదని ఆయన వెల్లడించారు. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతీకారం తీర్చుకున్న ఉక్రెయిన్.. 63మంది రష్యన్ సైనికులు మృతి

గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నం అయింది. అయినా ఆ దేశం కిందకు వెళ్లేది లేదని.. చివరి వరకు పోరాడుతామని ఉక్రెయిన్ అంటోంది. దాయాది దేశాల మద్దతుతో రష్యాతో పోరాడుతోనే ఉంది. ఈ క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. రష్యా డొనెట్స్క్పై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 63 మంది సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన క్షిపణి దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. రష్యా సైన్యం ఆక్రమించిన తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై ఉక్రెయిన్ దాడి చేసింది. న్యూ ఇయర్ రోజు ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ నాలుగు రాకెట్లతో దాడి చేసిందని, అందులో తమ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం (జనవరి 1) ఉక్రెయిన్ సైన్యం నూతన సంవత్సర పండుగ సందర్భంగా మాస్కో డొనెట్స్క్పై కనీసం 25 రాకెట్లను ప్రయోగించింది. నూతన సంవత్సరం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ కేంద్రం ఉండటంతో రాకెట్ దాడివల్ల అన్ని సైనిక పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయి.
జగన్ కు జనంలో తిరిగే ధైర్యం లేదు.. సోమిరెడ్డి ఫైర్

ఏపీలో బహిరంగ సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆంక్షలు విధిస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయమని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఇవే ఆంక్షలు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ప్రభుత్వ తీరుపై రోడ్ల మీద కాకుండా పొలాల్లో, గుంటల్లో, చెరువుల్లో నిరసనలు తెలపాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నిరసనలు, సభలు, ర్యాలీలు చేసే హక్కు ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనల వెనుక కుట్ర దాగుందన్న అనుమానం కలుగుతుందన్నారు. జగన్ నిర్ణయాలు చూస్తుంటే మన దేశంలో ఏపీ ఒక భాగమో.. కాదో అనే డౌట్ వస్తోందని సోమిరెడ్డి అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో వేలాది మంది మధ్య సెక్యూరిటీని ప్రక్కన పెట్టి ఓటేసిన ప్రధాని కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అని నిలదీశారు.
జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మికి వన్ ప్లస్ వన్ గన్ మెన్ కేటాయింపు

దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కోడలు, జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మికి భారీ భద్రత కల్పించారు పోలీసులు. ఆమెకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ కేటాయించారు జిల్లా ఎస్పీ. అవుకులో చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విబేధాలు వీధికెక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చల్లా కుటుంబంలో విబేధాల నేపథ్యంలో సీఎం జగన్ వద్ద పంచాయతీ పెట్టిన చల్లా శ్రీలక్ష్మి అసలు పరిస్థితుల్ని ఆయనకు వివరించిన సంగతి తెలిసిందే. సీఎం ను కలసిన కొన్ని గంటలకే గన్ మెన్స్ కేటాయించింది ప్రభుత్వం. చల్లా కుటుంబంలో వివాదాల పరిష్కారానికి అధిష్టానం ఆదేశంతో రంగంలోకి దిగారు కాటసాని రామిరెడ్డి.అవుకులో ఆసక్తికర పరిణామాలు నిశితంగా గమనిస్తున్నారు స్థానిక ప్రజలు.నంద్యాల జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ విభేదాలు చల్లా సమాధి సాక్షిగా వీధిలో కెక్కి రచ్చ రచ్చగా మారాయి.చల్లా కుటుంబ విభేదాల పంచాయతీ సాక్షాత్తు సీఎం జగన్ వద్దకు చేరడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది .ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి సీఎంను కలిసిన కొద్ది గంటల్లోనే ఆమెకు రక్షణ కవచంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గన్ మెన్ల ను నియమించారు.
నుమాయిష్ విజిటర్లకు మెట్రో రైల్ గుడ్ న్యూస్
హైదరాబాద్ లోని నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ విజిటర్లకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. నుమాయిష్ ఎక్సిబిషన్ సందర్బంగా హైద్రాబాద్ మెట్రో ట్రైన్స్ టైమింగ్స్ పెంచుతూ HMR నిర్ణయం తీసుకుంది. మొదటి కారిడార్ రెడ్ లైన్ మియాపూర్ టు ఎల్బీనగర్ , మూడో కారిడార్ బ్లూ లైన్ నాగోల్ టు రాయదుర్గం రూట్లలో అర్థ రాత్రి వరకు సర్వీస్ లు నడపనుంది హైదరాబాద్ మెట్రో రైల్, టర్మినల్ నుండి అర్థ రాత్రి 12 గంటలు బయలు దేరి 1 గంట వరకు చివరి స్టేషన్ కు చేరుకుంటాయి. నుమాయిష్ రష్ ను దృష్టిలో పెట్టుకొని గాంధీభవన్ మెట్రో స్టేషన్ లో 4 టికెట్ కౌంటర్లు ను 6 కు పెంచారు అధికారులు. నుమాయిష్ కి మరింతగా విజిటర్స్ రావడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారుు.
పవన్ ఎపిసోడ్ కు ముందు ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. ఏ టాక్ షోకు లేని రికార్డ్ ను అన్ స్టాపబుల్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. స్టార్లు, పొలిటికల్ లీడర్స్, హీరోయిన్స్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ జనవరిలో ఈ షో సంచలనాలు కాదు ప్రకంపనలు సృష్టించడం ఖాయం.. ఎందుకంటే.. ఈ నెల స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ ల లిస్ట్ ను ఆహా రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేసున్నట్లు ప్రకటించిన ఆహా.. రెండో పార్ట్ ను జనవరి 6 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక సంక్రాంతికి పవన్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తారు అనుకున్నారు అభిమానులు.. కానీ పవన్ ఎపిసోడ్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలొస్తే పథకాలు.. అయిపోగానే కోతలు.. కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ ఫైర్

ఎన్నికలొస్తే పథకాలు.. అయిపోగానే కోతలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునుగోడు ఎన్నికల్లో గొర్రెల పంపిణీకి నిధులు అకౌంట్లో వేశారని, కానీ ఎన్నికలు అయ్యేవరకు ఆ నిధుల్ని ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు అయ్యే వరకు ఓమాట.. తర్వాత ఇంకో మాట మారుస్తారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనేదే కేసీఆర్ యావ అని, మంత్రులేమో వేల కోట్లు వెనక్కి వేసుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్రాన్ని నడుపుతున్నారన్నారు. ఉద్యమంలో ఆంధ్ర నేతలను తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాడని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ సూచన మేరకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మహేశ్ గౌడ్ తెలిపారు.
వైరస్‌లను తినే జీవి వైరోవోర్.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ

Virus
ప్రపంచంలో చైనా వంటి దేశాలు ఎన్ని వైరసులను సృష్టించినా ఏం భయపడాల్సిన పని లేదు. కరోనా కాదు కాదా వాళ్ల అమ్మలాంటి వైరస్ వచ్చిన పరపర నమిలి పారేసే కొత్త జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ జాన్ డెలాంగ్, అతని బృందం ఈ జీవిని కనుగొనడంతో పురోగతిని సాధించింది. వైరస్‌లను తినే మొట్టమొదటి ‘వైరోవోర్’ను కనిపెట్టారు. న్యూట్లాస్ అనే సైన్స్ మ్యాగజైన్ ప్రకారం, నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు జాన్ డెలాంగ్, ఏదైనా సూక్ష్మజీవులు వైరస్‌లను చురుకుగా తింటున్నాయో లేదో తెలుసుకోవాలనుకున్నారు.. అలాంటి ఆహారం వాటి శారీరక పెరుగుదలకు తోడ్పడుతుందా లేదా అని కనుగొనాలనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచినీటినిలో ఉండే మైక్రోస్కోపిక్ సిలియేట్‌లు – హాల్టేరియా జాతికి చెందిన జీవులు అధిక సంఖ్యలో ఇన్ఫెక్షియస్ క్లోరోవైరస్‌లను తింటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరోవోర్లు కేవలం వైరస్ లనే ఆహారంగా తీసుకుంటున్నాయని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. వీటి శరీరంలో న్యూక్లియిక్ ఆమ్లాలు, చాలా వరకు నైట్రోజన్, ఫాస్పరస్ ఉంటాయని చెప్పారు. ఈ వైరోవర్ ఇప్పుడు శాకాహారం, మాంసాహారాల్లో ఉంటుందని గుర్తించారు. దాని జీవిత చక్రం, కార్బన్ సైకిల్ పై పూర్తిస్థాయిలో ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్లాన్ చేస్తున్నారు