నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి కథలు వినిపిస్తున్న మేటి రచయిత ఎవరంటే ఇప్పట్లో విజయేంద్రప్రసాద్ పేరునే చెబుతారు జనం. తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన బాహుబలి
సీరిస్ విజయేంద్రప్రసాద్ కలం నుండే చాలువారింది. ఆయన రచనలతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ విజయేంద్రప్రసాద్ రచనలు జనాన్ని మెప్పించాయి. విజయేంద్రప్రసాద్ రచనలతో తెరకెక్కే సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.
విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాద్. 1941 పిబ్రవరి 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విజయేంద్రప్రసాద్ జన్మించారు. వారి కన్నవారికి విజయేంద్రప్రసాద్ కనిష్ఠ పుత్రుడు. అన్నలు ఎంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచీ తన పెద్దన్న శివశక్తి దత్తతో చనువుగా తిరుగుతూ ఆయన సాన్నిహిత్యంలో కళల పట్ల, రచనల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. శివశక్తి దత్త తన తమ్ముళ్ళతో కలసి కర్ణాటకలో వ్యవసాయం చేసేవారు. ఆ తరువాత తమ రచనలతో సినిమా రంగంలో రాణించాలని అన్నదమ్ములు బయలు దేరారు. తొలుత దత్త బ్రదర్స్ పేరుతో రచనలు చేశారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి
చిత్రరచనలో ఆ పేరుతోనే పాలు పంచుకున్నారు. పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి కథలు అల్లడంలో దిట్ట అనిపించుకున్నారు. అలా అక్కినేని మూగమనసులు
కథకు మెరుగులు దిద్ది వారు అందించిన కథతోనే జానకి రాముడు
రూపొంది ఆకట్టుకుంది. బొబ్బిలి సింహం, ఘరానాబుల్లోడు, బంగారు కుటుంబం, సమరసింహారెడ్డి
చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథలు అందించారు. సదరు చిత్రాలన్నీ విజయపథంలో పయనించాయి. ముఖ్యంగా సమరసింహారెడ్డి
ఘనవిజయంతో విజయేంద్రప్రసాద్ స్టార్ రైటర్ అయిపోయారు. ఆయన తనయుడు రాజమౌళి, తండ్రి వద్దనే స్క్రిప్ట్ రాయడంలో సహాయకునిగా పనిచేశారు. అలా రాజమౌళి ఒక్కోమెట్టూ ఎక్కుతూ దర్శకునిగా నేడు అగ్రస్థానంలో నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి, సై, ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర, బాహుబలి, బాహుబలి-2
వంటి సూపర్ డూపర్ హిట్స్ కు కథలు సమకూర్చి ఆకట్టుకున్నారు విజయేంద్రప్రసాద్. రాజమౌళి తాజా చిత్రం ట్రిపుల్ ఆర్
కూడా విజయేంద్రప్రసాద్ కలం నుండి జాలువారిందే.
సరదాబుల్లోడు, రాణా, విజయేంద్రవర్మ, నా అల్లుడు, మిత్రుడు, జాగ్వార్
చిత్రాలకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. ఇక హిందీలో ఘనవిజయం సాధించిన బజరంగీ భాయిజాన్
కథ కూడా ఆయన కలం నుండి వెలుగు చూసినదే. హిందీలో ఆయన రచనతో మణికర్ణిక, తలైవి
రూపొందాయి. తమిళంలో మెర్సల్
కు కూడా విజయేంద్రప్రసాద్ రచన చేశారు. కన్నడలో అప్పాజీ, కురుబాన రాణి, పాండురంగ విఠల
వంటి సినిమాలకు కథలు సమకూర్చారు. ప్రస్తుతం హిందీలో పవన్ పుత్ర భాయిజాన్, రౌడీ రాథోడ్ 2
చిత్రాలకు ఆయననే కథ అందించారు.
తన అన్న శివశక్తిదత్తతో కలసి అర్ధాంగి
అనే చిత్రాన్ని రూపొందించారు. తరువాత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీకృష్ణ, రాజన్న, శ్రీవల్లి
వంటి సినిమాలు రూపొందాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రాజన్న
చిత్రం ఏకంగా ఆరు నంది అవార్డులు సంపాదించింది. ఆరంభ, గంగ-మంగ
వంటి టీవీ సీరియల్స్ కు కూడా విజయేంద్రప్రసాద్ రచన చేశారు. తెలుగునాటనే కాదు, యావద్భారతం రాబోయే ట్రిపుల్ ఆర్
కోసం ఎదురుచూస్తోంది. మరి ఈ సినిమాలో విజయేంద్రప్రసాద్ రచన ఏ తీరున అలరిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.