రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి గోదారమ్మా… సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ చాలా తెలివిగా, ఆ రీమిక్స్ సాంగ్ ను సినిమాలో సెట్ చేశారు. సినిమాలో హీరో వరుణ్ తేజ్ కు నటి శ్రీదేవంటే పిచ్చి. హీరోయిన్ పూజా హెగ్డేను చూస్తే అతనికి శ్రీదేవే గుర్తొస్తుంది. ఆ రకంగా ఆ పాటను వాడేసుకున్నారు. అప్పటి ‘దేవత’కు చక్రవర్తి స్వరరచన చేయగా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు. వారి గాత్రాన్ని అలానే ఉంచి, ఇన్ స్ట్రుమెంటైజేషన్ ను మిక్కీ జే మేయర్ రీ క్రియేట్ చేశారు. విశేషం ఏమంటే… ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా విజయం సాధించకపోయినా, అందులోని నటీనటులకు పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ రీమిక్స్ సాంగ్ అయితే… ఏకంగా వంద మిలియన్ వ్యూస్ ను యూట్యూబ్ లో పొందింది.