బాలీవుడ్ లోని బిజీ హీరోయిన్స్ లిస్ట్ బయటకు తీస్తే తప్పక కనిపించే పేరు తాప్సీ పన్ను. అనేక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఢిల్లీ బ్యూటీ. అయితే, కరోనా ప్యాండమిక్ తాప్సీని కూడా సతమతం చేస్తోంది. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఆగిపోయాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో, చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనూ ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్, బీ-టౌన్ లో తాప్సీ చేస్తున్నన్ని చిత్రాలు ఇంకే లీడింగ్ లేడీ చేయటం లేదు. ఆమె ఖాతాలో మిథాలీ రాజ్ బయోపిక్ లాంటి స్పోర్ట్స్ డ్రామా కూడా ఉంది.
తాప్సీ నటించిన చిత్రాల్లో రెండు మాత్రం అంతా పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అవే… ‘హసీన్ దిల్ రుబా, రశ్మి రాకెట్’ సినిమాలు. ఈ రెండూ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాయని సమాచారం. బాలీవుడ్ లో రోజురోజుకి థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్ చేసుకుంటోన్న సినిమాలు ఎక్కువైపోతున్నాయి. స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగే శరణ్యం అంటున్నాయి. అందుకే, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘హసీన్ దిల్ రుబా’ సినిమా నిర్మాతలు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో డీల్ సెట్ చేసేసుకున్నారు. జూలై 2న విక్రాంత్ మెస్పీ, హర్ష వర్ధన్ రాణే స్టారర్ రిలీజ్ కాబోతోంది…
‘హసీన్ దిల్ రుబా’ సినిమాతో పాటూ తాప్సీ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘రశ్మి రాకెట్’ కూడా త్వరలో ఆన్ లైన్ లో అందుబాటులోకి రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ తో ‘రశ్మి రాకెట్’ మేకర్స్ డిస్కషన్స్ జరుపుతున్నారట. దాదాపుగా డీల్ ఓకే అయిందని ముంబై టాక్. సెప్టెంబర్ లో తాప్సీ స్టారర్ ‘రశ్మి రాకెట్’ ఓటీటీ ప్లాట్ పామ్ పైకి దూసుకు రావచ్చు! చూడాలి మరి, కరోనా కలకలం తరువాత ఇంత వరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని తాప్సీకి టూ డిఫరెంట్ అప్ కమింగ్ మూవీస్ ఎలాంటి రెస్పాన్స్ సాధించి పెడతాయో!