బంగ్లాదేశ్ జనం ఎంతో గౌరవించే వారి మహానాయకుడు ముజీబుర్ రహ్మాన్. ఆయన జీవిత చరిత్ర శ్యామ్ బెనగల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కరోనా లాక్ డౌన్స్, అలాగే, ఈ మధ్య వచ్చిన రెండు భారీ తూఫాన్లు సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశాయి. కాకపోతే, ఎలాగోలా ఇప్పటికే 80 శాతం బయోపిక్ పూర్తి చేశామన్న శ్యామ్ బెనగల్ మిగతా భాగం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు షేక్ ముజీబుర్ రహ్మాన్. ఆయన కృషి వల్లే ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్ గా ఏర్పడింది. అందుకే, ఆయన్ని బంగ్లాదేశీయులు తమ జాతిపితగా భావిస్తారు. ‘బంగాబంధూ’ అంటూ సంబోధిస్తారు. అదే పేరు సినిమా టైటిల్ కూడా నిర్ణయించారు శ్యామ్ బెనగల్. భారత్, బంగ్లా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ ప్రతిష్ఠాత్మక ఆత్మకథా చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది. ముజీబుర్ రహ్మన్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా మహమ్మారితో పాటూ తుఫాన్ల కారణంగా అది కుదరలేదు.
యేడాదిన్నర క్రితమే ‘బంగాబంధూ’ సినిమా పూర్తవ్వాల్సింది అంటోన్న డైరెక్టర్ శ్యామ్ బెనగల్, 2021 చివరికల్లా, ఎలాగైనా చిత్రీకరణ ముగుస్తుందని చెప్పాడు. 2022లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడుగా , ప్రధానిగా చరిత్రలో చోటు సంపాదించిన షేక్ ముజీబుర్ రహ్మాన్ దురదృష్టకరంగా హత్యకి గురయ్యాడు. ఆయన కూతురు షేక్ హసీనాయే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతోంది! ఇండియా, బంగ్లాదేశ్ జాయింట్ వెంచర్ గా రెడీ అవుతోన్న హిస్టారికల్ బయోపిక్… ఎప్పుడు ఇరు దేశాల ప్రేక్షకుల ముందుకి వస్తుందో చూడాలి మరి!