మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను మోహన్ బాబు, విష్ణు కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిల్మ్ నగర లోని ఈక్వేషన్స్ చూస్తే… మంచు విష్ణు ముందంజలో ఉండటమే కాదు… విజయపథాన కూడా సాగే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే… గతంలో మాట ఎలా ఉన్నా… ఇప్పుడు చిరంజీవి, మోహన్ బాబు మధ్య సఖ్యత బాగా ఉంది. ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఈశాన్య రాష్ట్రాలకు ఓ రోజు సరదా ట్రిప్ కూడా వేసి వచ్చారు. అదే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మంచు లక్ష్మీ గతంలో కొన్ని విభాగాల బాధ్యతలను భుజానకెత్తుకుని సిన్సియర్ గా పనిచేశారు. ఆ రకంగా చూసినప్పుడు అత్యధిక శాతం మంది మంచు విష్ణు పక్షాన నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది.