వివాదాలకు మారుపేరుగా మారిపోయింది కంగనా రనౌత్. చిత్రం ఏమంటే… ఆమె నోటి నుండి ఏ పదం వచ్చినా, ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది ఏదో రకంగా వివాదాలవైపే సాగుతోంది. తాజాగా… బ్రిటీషర్స్ బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరును వదిలేసి, ‘భారత్’గా దేశం పేరు మార్చుకుందని కంగనా మరో వివాదానికి తెర తీసింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా రెండు పోస్టులు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున ఉన్న కారణంగా మన దేశానికి బ్రిటీషర్స్ ‘ఇండియా’ అనే పేరు పెట్టారని, అది బానిసత్వానికి చిహ్నమని కంగనా వాపోయింది. ‘భారత’ అనే మూడు సంస్కృత అక్షరాలలో ఎంతో అర్థముందని చెబుతూ, ఆ అక్షరాలలోని లోతైన భావాన్ని ‘భా (భావ) ర (రాగ) త (తాల్)’గా వివరించింది కంగనా. మన పూర్వీకులు మనకిఇచ్చిన విజ్ఞానాన్ని, నాగరికతను ప్రతి ఒక్కరూ అనుసరించాలని; వేదాలను, భగవద్ఘీతను, యోగాను అధ్యయనం చేయాలని కంగనా కోరింది. ప్రస్తుతం ముంబైలో ఉండి, తన కొత్త డిజిటల్ ప్రాజెక్ట్ ‘టీకు వెడ్స్ షేరు’ నిర్మాణ వ్యవహరాలను కంగనా పర్యవేక్షిస్తోంది. అలానే కంగనా నటించిన పాన్ ఇండియా మూవీ ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘తేజస్’, ‘థక్కడ్’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.