సినిమా రంగంలో చాలామంది సక్సెస్ వెనుక పరుగులు తీస్తారు. నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరోల డేట్స్ కోసం తాపత్రయ పడతారు. ఫ్లాప్ హీరోలు… సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కోసం వేట సాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం మైనెస్ ఇంటు మైనస్ ప్లస్ అనే సూత్రాన్ని నమ్ముకుని పరాజయంలో ఉన్న హీరోతో, ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో మూవీస్ చేస్తుంటారు. బహుశా అదే సూత్రాన్ని అల్లు అరవింద్ తన చిన్న కొడుకు శిరీష్ కు వర్తింప చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే… అల్లు శిరీష్ తాజా చిత్రం ‘ప్రేమ కాదంట’ మూవీ వాలకం చూస్తుంటే బోలెడన్నీ మైనెస్ లు కలిసి కనిపిస్తున్నాయి.
హీరో అల్లు శిరీష్ కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విజయమే లేదు. అంతే కాదు… అతని సరసన నటిస్తున్న అనూ ఇమ్మాన్యూల్ కూ సక్సెస్ అనేది లేదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల్లుడు అదుర్స్’లో అమ్మాయి గారు నటించింది. సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక దర్శకుడు రాకేశ్ శశి అయితే… ఏకంగా రెండు ఫ్లాప్స్ ను ఇప్పటికే తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ‘జత కలిసే’ సినిమా 2015 చివరిలో రాగా, ఆ తర్వాత రాకేశ్ శశి… చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన ‘విజేత’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ‘విజేత’గా నిలువలేకపోయింది. అయినా ముచ్చటగా మూడో సినిమాను శిరీష్ తో చేస్తున్నాడు. మరో విషయం ఏమంటే… అల్లు శిరీష్ ఇప్పటి వరకూ అన్ని స్ట్రయిట్ సినిమాలే చేశాడు. కానీ ఆఖరిగా మాత్రం ‘ఏబీసీడీ’ పేరుతో ఓ మలయాళ రీమేక్ లో నటించాడు. అదీ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు అల్లు శిరీష్ చేస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ కాదంట’ మూవీ, తమిళ చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’కు రీమేక్ అట. సో… రీమేక్స్ కూడా శిరీష్ కు అచ్చి రాలేదని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. మరి ఇన్ని నెగెటివ్ పాయింట్స్ పెట్టుకుని చేస్తున్న ఈ సినిమా… ఘన విజయం సాధిస్తే మాత్రం అది గొప్ప విషయమే. అదే జరగాలని కోరుకుందాం!