పిల్లలను ఎలా పెంచాలి? అన్న దానిపై ఇప్పుడు బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. కానీ, శాస్త్రకారులు ఏ నాడో చిన్న సూక్తుల్లోతేల్చి చెప్పారు. పిల్లాడిని పసితనంలో రాజులాగా, ఆ తరువాత సేవకునిలా, యవ్వనం వచ్చాక మిత్రునిలా చూసుకోవాలని కన్నవారికి సూచించారు. కానీ, కొందరు తల్లిదండ్రులు తమ అతిప్రేమతో పిల్లలు పెద్దవారయినా, ఇంకా పసిపిల్లల్లాగే చూస్తూ ఉంటారు. అది పిల్లలను వారికి దూరం చేస్తుందని ఆలోచించరు. తమ భావాలనే వారిపై రుద్దితే, పిల్లల్లో కన్నవారి పట్ల అభిమానం స్థానంలో ద్వేషం చోటు చేసుకుంటుంది. దీనిని నవతరం ప్రేక్షకులకు నచ్చేలా ‘బొమ్మరిల్లు’ కథను తీర్చిదిద్దారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ద్వారా భాస్కర్ దర్శకునిగా పరిచయమై ‘బొమ్మరిల్లు’ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. 2006 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది.
‘బొమ్మరిల్లు’లోకి తొంగి చూస్తే – అరవింద్ తన కుటుంబ సభ్యులు ఏదీ అడక్కుండానే అన్నీ సమకూర్చాలని ఆశించే తండ్రి. తనయుడు సిద్ధార్థ్ మనసు తెలుసుకోకుండా తనకు నచ్చిన అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపిస్తాడు. కానీ, సిద్ధూకు తన మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడడంతో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కోసం పలు పాట్లు పడతాడు. తండ్రికి విషయం తెలిసి నిలదీస్తాడు. తాను చూసిన అమ్మాయి కంటే నీవు ప్రేమించిన పిల్ల ఎందులో గొప్ప అని తండ్రి అంటాడు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోకుండా ఎలా నిర్ణయిస్తారని తనయుడి ప్రశ్న. దాంతో తమ కుటుంబంతో కొద్దిరోజులు గడపడానికి, ప్రేమించిన హాసిని ని వాళ్ళ లెక్చరర్ ద్వారా ఆమె తండ్రికి కాలేజ్ టూర్ వెళ్తున్నట్టు అబద్ధం చెప్పించి, తీసుకు వస్తాడు. ఈ లోగా హాసిని తండ్రి కనకారావు తన కూతురు ఏమైంది, ఎప్పుడు వస్తుందని లెక్చరర్ ను చెడుగుడు ఆడేస్తుంటాడు. చివరకు హాసిని, సిద్ధూనే తనకు నచ్చలేదని చెప్పి ఇంటికి వెళ్తుంది. తరువాత తండ్రీకొడుకుల మధ్య సంవాదం. సిద్ధూ తల్లి తన భర్తకు తనయుని చేష్టలన్నీ చెబుతుంది. దాంతో తన అతిప్రేమ సిద్ధూను అలా మార్చిందని అరవింద్ పశ్చాత్తాప పడతాడు. హాసినితోనే సిద్ధూ జీవితం కొనసాగాలని కోరుకుంటాడు. సిద్ధూ తనకు నిశ్చితార్థమైన అమ్మాయికి అసలు విషయం చెబుతాడు. చివరకు సిద్ధూ కుటుంబసభ్యులంతా కనకారావు ఇంటిముందు నించుని, తమ అబ్బాయికి హాసిని ని ఇవ్వమని వేడుకుంటారు. కనకా రావు అంగీకరించడు. అయితే కొద్ది రోజులు సిద్ధూను పరీక్షించిన తరువాతే పిల్లనివ్వమని కోరతారు. కనకారావు ఇంట్లో సిద్ధూ తంటాలు పడి, చివరకు ఆయన మనసు గెలుచుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో సిద్ధూగా సిద్ధార్థ్, ఆయన తండ్రి అరవింద్ గా ప్రకాశ్ రాజ్, హాసినిగా జెనీలియా నటించారు. కనకారావు పాత్రలో కోట శ్రీనివాసరావు, సిద్ధూ తల్లిగా జయసుధ అభినయించారు. మిగిలిన పాత్రల్లో సునీల్, సత్య కృష్ణన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సురేఖా వాణి, చిత్రం శ్రీను, విజయ్ సాయి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి,చలపతిరావు కనిపించారు.
ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాయగా, సిరివెన్నెల, చంద్రబోస్, భాస్కరభట్ల, కులశేఖర్, అనంత్ శ్రీరామ్ పాటలు పలికించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్. ఇందులోని “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో… కలగన్నానే చెలీ…”, “వీ హ్యావ్ ఎ రోమియో…”, “బొమ్మని గీస్తే నీలావుంది… దగ్గరకొచ్చి ముద్దిమ్మంది…”, “నమ్మక తప్పని నిజమైనా…” పాటలు ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో తెలుగునాట ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీనిని తమిళంలో జయం రవి హీరోగా ఆయన అన్న మోహన్ రాజ్ దర్శకత్వంలో ‘సంతోష్ సుబ్రమణియన్’గా రీమేక్ చేశారు. బెంగాలీలో ఈ కథ ‘భలోబాసా భలోబాసా’గా, ఒరియాలో ‘డ్రీమ్ గర్ల్’గా పునర్నిర్మితమై ఆకట్టుకుంది. హిందీలో 2007లోనే ‘ఇట్స్ మై లవ్’ పేరుతో రీమేక్ ఆరంభించారు. కొన్ని కారణాల వల్ల చిత్రీకరణలో జాప్యం జరిగింది. ఈ హిందీ సినిమా 2020లో జనం ముందు నిలచింది.
ఈ చిత్రానికి మొత్తం ఏడు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. భాస్కర్ కు తొలిచిత్ర ఉత్తమ దర్శకుడు, స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి. అబ్బూరి రవి మాటలకు, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సవితారెడ్డికి అవార్డులు దక్కాయి. వీటితో పాటు ఉత్తమ సహాయనటునిగా ప్రకాశ్ రాజ్ కు, జెనీలియాకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించాయి. ఏది ఏమైనా ‘బొమ్మరిల్లు’ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎవరైనా తమ తనయులను అధికంగా ప్రేమించే తండ్రులను చూసి ‘బొమ్మరిల్లు ఫాదర్స్’ అంటూ ఎద్దేవా చేయడం కనిపించేది. దీనిని బట్టే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో చెప్పవచ్చు.