ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన ఆంథాలజీ ‘పిట్ట కథలు’లో నటించింది. నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన సెగ్మెంట్ లో శ్రుతీ యాక్ట్ చేసింది. అయితే… ఆ ఆంథాలజీకీ పెద్దంత గుర్తింపు రాలేదు.
వీక్షకులను ఆకట్టుకోవడంలో అది ఫెయిల్ అయ్యింది. అయినా పట్టువదలని విక్రమార్కుడి తరహాలో శ్రుతీహాసన్ ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని డిజిటల్ మీడియాలో పరీక్షించుకోబోతోంది. ఆమె నటించిన తాజా వెబ్ సీరిస్ ‘బెస్ట్ సెల్లర్’ ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో శ్రుతీహాసన్ తో పాటు మిథున్ చక్రవర్తి, అర్జున్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దుబే, సోనాలీ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘బుల్ బుల్’ ఫేమ్ అన్విత దత్తా, అల్తే కౌశల్ స్క్రిప్ట్ సమకూర్చారు. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించిన ‘బెస్ట్ సెల్లర్’పై ఇప్పుడు శ్రుతీహాసన్ ఆశలు పెట్టుకుంది. మరి ఈసారి అయినా ఆమె డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.