ఫిబ్రవరి నెల తొలి శుక్రవారం (4వ తేదీ) థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం దగ్గరకు వస్తుంటే… వరుసగా సినిమాల విడుదల ప్రకటన జోరందుకుంటోంది. ఆదివారం నాటికి ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న చిత్రాల సంఖ్య ఏకంగా ఏడుగా తేలింది! విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో శుక్రవారం విడుదల చేస్తున్నాడు. అలానే శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ చిత్రమూ ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవి కనగాల నిర్మించిన ‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా కూడా శుక్రవారమే విడుదల అవుతోంది.
సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, బెనర్జీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో స్వర్గీయ నాగభూషణం మనవడు, ప్రముఖ కెమెరామేన్ మీర్ తనయుడు భూషణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అలానే మరో తెలుగు సినిమా ‘స్వ’ కూడా 4వ తేదీనే రాబోతోంది. ఇక గతంలో ‘వీధి’, ‘ధమ్’ చిత్రాలను తెరకెక్కించిన దొరై రాజు వూపాటి డైరెక్ట్ చేసిన ‘పటారు పాళెం’ కూడా శుక్రవారం విడుదల కాబోతోంది. వీటితో పాటే రెండు కన్నడ డబ్బింగ్ చిత్రాలు వస్తున్నాయి. అందులో ఒకటి రాగిణీ ద్వివేది నటించిన ‘రియల్ దండుపాళ్యం’ కాగా, మరొకటి కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన ‘కె3 – కోటికొక్కటి’. సో… వచ్చే శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు క్యూ కడుతున్నాయి. వీటికి మరో ఒకటో రెండో సినిమాలు జత కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!