కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్బుతం అని అంతా కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అత్యద్భుతం, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు ఆగ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. యువకులు ఉపాధి కూడా కోల్పోతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు నిర్ణయంతో పోరుబాటకు సిద్దం అవుతున్నారు రైతులు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఊళ్లో పెళ్ళి కాని ప్రసాదులు పెరిగిపోతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ ను 1.5 టీఎంసీల నీటి సామర్ధ్యం కోసం తొలి విడతలో భూ సేకరణ చేపట్టారు అధికారులు. ఇందుకోసం సుమారు 150 ఎకరాల భూమిని రైతుల వద్ద నుండి సేకరించారు. ఎకరాకు 5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. తాజాగా మంచిప్ప రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మరింత భూసేకరణ చేపట్టింది. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం 50లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది. కానీ ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తుందో ప్రకటించడం లేదు. మంచిప్ప రిజర్వాయర్ 3.5 టీఎంసీల అప్ గ్రేడేషన్ కోసం అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాల నుంచి 1336 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది.
మరో 788 ఎకరాల అటవీ భూమి కోసం ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. భూసేకరణకు వెళ్లిన అధికారులను రైతులు పలు మార్లు వెనక్కి పంపారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 2 వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారు అధికారులు. ముంపు గ్రామాల రైతులంతా చిన్న, మధ్యతరగతి రైతులే కావటంతో రైతులంతా భూములు కోల్పోతున్నారు. భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంచడం ద్వారా గ్రామంలో ఉన్న యువతకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్దితి నెలకొంది. యువత, ఎన్నో ఏళ్లుగా మంచిప్ప గ్రామంలో జీవిస్తున్న ప్రజల మనుగడకు ముప్పు రావడంతో ఆందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు.
భూనిర్వాసితుల బాధలు ఇలా ఉంటే.. ముంపు భయంతో మంచిప్ప, బైరాపూర్, అమ్రబాద్ లతో ముంపు గ్రామాల, తాండాల యువకులకు మరో టెన్షన్ పట్టుకుంది. రిజర్వాయర్ నీటి సామర్ధ్యం 1.5 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు పెంచడంతో మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాలలో పెళ్లి కాని ప్రసాదులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముంపు గ్రామాలకు పిల్లను ఇచ్చేందుకు, ముంపు గ్రామాల నుంచి పిల్లలను చేసుకునేందుకు ఏ గ్రామాల నుంచి బంధువులు ముందుకు రావడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఉన్న భూములు కోల్పోవటంతో తిరిగి గల్ఫ్ బాట పట్టడమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది యువకులు స్వయం ఉపాధివైపు మొగ్గుచూపుతున్న తరుణంలో మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంపు, నీటి సామర్ధ్యం పెంపుతో తీవ్ర నష్టం ఉంటుందని ముంపు గ్రామాల యువకులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఇళ్లు కోల్పోతే తమ కూతుళ్లు, కుమారులకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు బాధిత రైతులు.