రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గుట్టల వేణుగోపాల్ (26)గా గుర్తించారు. వేణుగోపాల్ తన అన్న, వదినతో కలిసి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం, తాను నివసిస్తున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : Boeing 737: టేకాఫ్ సమయంలో మంటలు, విమానానికి తప్పిన పెను ప్రమాదం
వేణుగోపాల్ రాసిన సూసైడ్ నోట్‌లో, “ఎక్కడ చూసినా కరప్షన్, ఎటు వెళ్లినా పొల్యూషన్, జీవితంపై విరక్తి కలుగుతోంది. అమ్మ, నాన్న నన్ను క్షమించండి” అని పేర్కొన్నాడు. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి ఇలాంటి తీవ్ర నిర్ణయాలకు దారితీస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
(గమనిక: ఆత్మహత్య ఒక పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఎదుర్కొంటున్న వారు సన్నిహితులతో మాట్లాడటం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సహాయం పొందవచ్చు.)