ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాబ్, రూట్ ఒకటే అయినప్పటికీ ఛార్జీల్లో మాత్రం ఐఫోన్ కి, ఆండ్రాయిడ్ కి తేడా ఉంటుందని చెబుతున్నారు. ఫోన్ లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఛార్జీ పడుతుందని, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఈ రెండు కంపెనీలకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు పంపింది. ఈ సంస్థలు తమ యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్లకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఆయా సంస్థలు ఇచ్చే వివరణను బట్టి ఛార్జీల్లో తేడాపై క్లారిటీ రానున్నది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను ఉబర్ ఖండించింది. ఒక వేళ ఓలా, ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతే తక్షణం ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి అని ఆలోచిస్తుంటారు. ఛార్జీల్లో తేడాపై మీరు ఫిర్యాదు చేయొచ్చు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయొచ్చు. +918800001915 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.