హైదారాబాద్ కార్పోరేట్ ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు, సౌకర్యాలు ఉన్నాయో అవే ఆదిలాబాద్ లో అందుబాటులో కి తెచ్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. గత పరిస్థితులు మారాయని, ఇప్పుడు వైద్యులు అన్ని చోట్లకు వస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోనే వైద్యం అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానం సాధించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ప్రజలకు సేవలందించిందని ఆయన అన్నారు. ఎంతో మంది కోవిడ్ సమయంలో పక్కరాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందారన్నారు. రాష్ట్రంలో మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు.