బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు.
Read Also: Telangana Rains: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి మూడ్రోజుల పాటు సెలవులు
తాజాగా ఈ వ్యాఖ్యలపై ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గజ్వేల్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ లో కాదు మరోసారి హుజురాబాద్ లో గెలిచి ఉనికి చాటుకోవాలని సవాల్ చేశారు. గజ్వేల్ లో నువ్వు కాదు.. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా వచ్చినా వారికి ఇక్కడ ఓటమి తప్పదని అన్నారు. గజ్వేల్ లో టీఆర్ఎస్ కండువా వేసుకున్న సామాన్య కార్యకర్తను కూడా ఈటెల రాజేందర్ ఓడించలేరని ఆయన అన్నారు. ఈటెల ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని ఒంటేరు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి తీసుకువచ్చిన నిధుల వివరాలు చెప్పగలవా..? అని ప్రశ్నించారు. నీ నియోజకవర్గంలో మొత్తం కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని అన్నారు. హుజూరాబాద్ లో ఓటమి భయం పట్టుకుని గజ్వేల్ లో పోటీ చేస్తానిన ప్రకటనలు చేస్తున్నావంటూ విమర్శలు గుప్పించారు.