Vemula Prashanth Reddy : మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం-రాష్ట్రం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “మాటలు మాత్రం చెబుతున్నారు కానీ, ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలుకాలేదు” అని వ్యాఖ్యానించారు.
వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. RRR ప్రాజెక్టు ఆలోచన మొదట కేసీఆర్ మదిలో పుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు అవతల మరో రింగ్ రోడ్డు నిర్మిస్తే, నగరానికి భారీ డెవలప్మెంట్ వస్తుందని కేసీఆర్ భావించారని ఆయన చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనేకసార్లు అభ్యర్థించిందని గుర్తు చేశారు. “రెండేళ్ల తర్వాత కేంద్రం సూత్రప్రాయ అంగీకారం ఇచ్చింది. 2018లో DPR పంపితే 2021లోనే దానిని ప్రకటించారు. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రాజెక్టు స్థితి మారలేదు” అని విమర్శించారు.
అలాగే, 2022 సెప్టెంబర్‌లో ల్యాండ్ ఆక్విజిషన్‌కు పర్మిషన్ ఇచ్చినా, రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. “మా ప్రభుత్వం 100 కోట్లు డిపాజిట్ చేసింది. కానీ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు” అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ప్రస్తుత ప్రభుత్వం మూడు సార్లు టెండర్లు పిలిచినా ఇప్పటికీ ఓపెన్ చేయలేదని ఆరోపించారు. “ఎవరి వాటా ఎంత అనే లెక్కలు కుదరకపోవడం వల్లే టెండర్లు ఓపెన్ చేయడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో పనులు మొదలవుతాయని చెప్పి, ఇప్పటికీ ప్రారంభం కాలేదు” అని అన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించలేదని, మోదీపై ఒత్తిడి తెచ్చే ధైర్యం ఇద్దరికీ లేదని విమర్శించారు.
Happy Divorce: “కొడుకుకు తల్లి పాలాభిషేకం, కేక్ కటింగ్”.. విడాకుల సెలబ్రేషన్ వీడియో వైరల్..
సదరన్ పార్ట్ రింగ్ రోడ్ విషయంలో కేంద్రం వద్ద పాత అలైన్మెంట్ ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భూములు ఉన్న ప్రాంతాల మీదుగా RRR వెళ్లేలా కొత్త అలైన్మెంట్ మార్చిందన్నారు. “కొత్త అలైన్మెంట్ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారు. వారు మంత్రి దగ్గర ఫిర్యాదు చేస్తే, ‘RRR రోడ్ అయ్యేదా, పోయేదా?’ అని సమాధానం ఇచ్చారట. ఇది ప్రజల పట్ల అవమానం” అని మండిపడ్డారు.
ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ విషయానికొస్తే, వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “మా ప్రభుత్వంలోనే 40 శాతం పనులు పూర్తయ్యాయి. దసరా నాటికి పూర్తి అవుతుందని మంత్రి చెప్పినా, దసరా అయిపోయింది, ఇప్పుడేమో వచ్చే దసరాకి అంటున్నారు. పనులు మాత్రం ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి” అని అన్నారు.
అలాగే, టిమ్స్ ఆసుపత్రుల విషయంలోనూ ఆయన ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించారు. “పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ టిమ్స్ ఏర్పాటుకు బీజం వేశారు. మా ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో వరంగల్ టిమ్స్ 60% పూర్తిచేసింది. కానీ ఈ ప్రభుత్వం రెండేళ్లలో 10% కూడా పూర్తి చేయలేదు. ఎల్బీ నగర్, ఆల్వాల్ టిమ్స్‌లలోనూ అదే పరిస్థితి ఉంది” అని అన్నారు.
ప్రశాంత్ రెడ్డి చివరగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి, “మా మీద విమర్శలు చేయడం మానేసి, పనులు చేయండి. మీరే రెండేళ్లు అధికారంలో ఉన్నారు. కానీ RRR, ఉప్పల్ ఫ్లైఓవర్, టిమ్స్ ఆసుపత్రుల పనులు మేము ఎక్కడ వదిలామో అక్కడే ఉన్నాయి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు.. ఇప్పుడు ప్రజల కోసం పని చేయండి” అని డిమాండ్ చేశారు.
Gudivada Amarnath: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు అవుతారో చూస్తాం!