మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత కల్పించడం కష్టం అని ఎస్పీ అన్నారు. హెలికాప్టర్ ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పారు.
ఈనెల 9వ తేదీన వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం వెళ్లేందుకు సిద్దమయ్యారు. విశాఖ నుంచి మాకవరపాలెం మెడికల్ కళాశాల వరకు వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో రోడ్డు మార్గాన వెళ్లేందుకు అనుమతి ఎస్పీ తుహీన్ సిన్హా ఇవ్వలేదు. హెలికాప్టర్ ద్వారా వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తాం అని, మాకవరపాలెంలో హెలీపాడ్ ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఎస్పీ అంటున్నారు. ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటనపై వైసీపీ స్పందించింది. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ పరిశీలన కోసం తమ అధ్యక్షుడు వెళతారు అని తెలిచి చెప్పారు.
Also Read: Ponnur Murder: సోదరి ప్రేమ వివాహం.. యువకుడిని దారుణంగా హత్య చేసిన సోదరుడు!
‘రోడ్డు మార్గం ద్వారా జగన్ పర్యటన జరిగి తీరుతుంది, ఎవరు అవుతారో చూస్తాం. రోడ్డు మార్గం ద్వారానే జగన్ పర్యటన సాగి తీరుతుంది. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే బాధ్యత వైసీపీ కార్యకర్తలు తీసుకుంటారు. హెలికాప్టర్ కోసం పర్మిషన్ పెడితే పరిశీలిస్తామని పోలీసులు చెప్పడంపై నాకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయి. ముందు లేని అనుమతులు ఇప్పుడు ఎందుకు ఇస్తాం అంటున్నారు అనేది మా డౌట్. పోలీసులు ప్రేమలేఖలు రాయడం మానేసి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే సహకరిస్తాం. మెడికల్ కాలేజ్ గురించి వక్ర వ్యాఖ్యలు చేస్తున్న తాగుబోతులు, తిరుగుబోతు పెద్దలకు జగన్ గట్టిగా సమాధానం చెబుతారు’ అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.