Vemula Prashanth Reddy Fires On PM Narendra Modi: తెలంగాణలో పండిన వడ్లు కొనడానికి బీజేపీకి చేత కాదు కానీ.. ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేను మాత్రం రూ. 100 కోట్లు ఇచ్చి కొంటారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రధాని పదవిలో ఉండి.. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే మెరుగ్గా రైతులకు, పేదలకు మోడీ ఎం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. తన సన్నిహిత పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మోడీ మాఫీ చేశారని.. ఇప్పుడు అదే డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎనిమది ప్రభుత్వాలని బీజేపీ కూలదోసిందన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రమేయం లేకపోతే.. దర్యాప్తు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్ సన్నిహితుడే.. తిరుపతి స్వామీజీకి విమాన టికెట్ బుక్ చేశారని ప్రశాంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు.. మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేమన్న సంగతి కేంద్రానికి తెలిసిపోయిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వయంగా అమిత్‌షానే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని, ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తామని హామీ ఇచ్చి, రాజీనామా చేయించి మరీ ఈ ఉప ఎన్నికలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినా.. మునుగోడు ప్రజలు వారికి లొంగకుండా, తెలంగాణ పక్షాన నిలబడ్డారన్నారు. డబ్బుతో టీఆర్‌ఎస్‌ను ఓడించి, రాష్ట్రంలో ఏవేవో డ్రామాలు చేయాలని చూశారని.. కానీ మునుగోడు ప్రజలు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు. కేవలం కుల, మత చిచ్చు రగల్చడం వల్ల.. ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలని సూచించారు. బీజేపీ నేతలు మొదటి నుంచి అబద్ధాలు చెప్తున్నారని.. మనకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, చిచ్చు ఎవరు పెడుతున్న విషయాల్ని గమనించాలని ప్రజల్ని కోరారు. ఇకపై కూడా బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.