V Hanumantha Rao Comments On Congress President Elections: కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రాహుల్ గాంధీ దూరంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలిపారు. అన్ని పార్టీల ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్ని సోనియా గాంధీ జరుపుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికలకు రాహుల్ గాంధీని సిద్ధం చేసేందుకు సోనియా గాంధీ చాలా ప్రయత్నించారని అన్నారు. కానీ.. అది కుదరకపోవడంతో అధ్యక్ష పదవిలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు ఉన్నారని పేర్కొన్నారు.
తమ జిల్లాల్లో దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్యలకు తగిన గౌరవం దక్కలేదన్నారు. కొత్తగా డేలిగేట్స్‌గా పేర్లు వచ్చాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లు కాకుండా కొత్త పేర్లు వచ్చాయన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారనే బాధతోనే.. పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహలు ఆందోళన వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. ఎవరికైతే జిల్లాల్లో అన్యాయం జరిగిందో.. వాళ్లకు కో-ఆప్షన్‌లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నితన్, బగేల్ దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని కోరారు.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాలు, ఏఐసీసీ కేంద్ర కార్యాలయాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులుగా ఉన్న 9,300 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఈ ఓటింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.