సర్పంచులను ఎక్కువగా అవమానిస్తుంది సీఎం కేసీఆర్ అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులు సర్పంచులకు సంబంధం లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులు లోకల్ బాడీలకు రావద్దని చెప్పడాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ఖండించాలని పిలుపు ఇచ్చారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను పద్దతి లేకుండా సీఎం కేసీఆర్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానా లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వద్దు అనే దాని వెనక కేసీఆర్ నిర్వాకము ఉందని ఆరోపించారు. కేంద్రం చేస్తే తప్పు అంటారు.. కానీ కేసీఆర్ మాత్రం సర్పంచులతో సంబంధం లేకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడంపై కేసీఆర్ మాటలు తుగ్లక్ ని తలపిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోకల్ బాడీలకు నిధులు ఇవ్వాలని…కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు రావాల్సిందే అని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికార వికేంద్రీకరణ తప్పు అంటే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు బిల్లులు రాక ఆత్మహత్యలు శరణ్యం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేదని… కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు నడపాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఏ ఫండ్స్ ను కేసీఆర్ఇష్టం ఉన్న వాళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ , నాయకులు దోచుకోవడానికి ఈ ఫండ్స్ ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడి రైతులను దగా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం యాసంగి 20 లక్షల మెట్రిక్ టన్నుల కొన్నట్లు చెప్పారు కేసీఆర్… ఇప్పుడేమో తడిసిన ధాన్యం కొంటాం అని చెబుతున్నారు. దీనిని బట్టి ప్రభుత్వం రైతును ఎంత మోసం చేస్తున్నారనేది తెలుస్తోందని విమర్శించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రైతులు వడ్లు అమ్ముకున్నారని ఆయన న్నారు. రైతుల పట్ల కేసీఆర్ అసమర్థత బయటపడిందని విమర్శించారు.